Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!

Glenn Phillips Catch

Glenn Phillips Catch

Glenn Phillips Catch Video: ‘గ్లెన్‌ ఫిలిప్స్‌’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కళ్లు చెదిరే, ఊహించని క్యాచ్‌లకు పెట్టింది పేరు ఈ న్యూజిలాండ్ ఆటగాడు. ఫిలిప్స్‌ ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టాడు. అందులో కొన్ని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఫిలిప్స్ పట్టిన ఓ ఊహించని క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ దగ్గర ఫిలిప్స్ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్‌ను చూసి.. అతడే స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మీరు క్రికెట్ అభిమాని అయితే.. ఆ వీడియో తప్పక చూడాల్సిందే.

కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. గయానా ముందుగా బ్యాటింగ్ చేసి 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రిన్‌బాగో జట్టు రెండో ఓవర్ ముగిసే సమయానికి 17/0 స్కోర్ చేసింది. మూడో ఓవర్లో డ్వైన్ ప్రిటోరియస్ వేసిన బంతిని సునీల్ నరైన్ భారీ షాట్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. బంతి డీప్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి వెళ్లగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ రోప్‌కు సమీపంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక్క చేత్తో బంతిని అందుకున్నాడు.

క్యాచ్ పట్టుకున్న వెంటనే గ్లెన్ ఫిలిప్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను క్యాచ్ ఎలా పట్టుకున్నానో అన్నట్లుగా ఆశ్చర్యపోయాడు. ఫిలిప్స్ ముఖంలో హావభావాలు వైరల్ అయ్యాయి. ‘సూపర్ మ్యాన్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ వద్ద బ్యాలెన్స్ కోల్పోకుండా, ఒక్క చేత్తో బంతిని అద్భుతంగా అందుకోవడం అతడి ఫీల్డింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా మారింది. ఫిలిప్స్‌ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా ఉన్నాడు. ముఖ్యంగా డైవింగ్ క్యాచ్‌లు, వన్ హ్యాండ్ క్యాచ్‌లు, గాల్లోకి ఎగిరి పట్టే క్యాచ్‌ల విషయంలో అతడిని కొట్టేవాడే లేడు. అభిమానులు అతడిని ‘సూపర్‌ మ్యాన్’ అని పిలుస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిలిప్స్ ఖాతాలో ఇప్పటికే 112 క్యాచ్‌లు ఉన్నాయి.