Gautam Gambhir react on heated exchange with Virat Kohli in IPL 2023: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు, లక్నో మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. ఆపై మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీని లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ కోహ్లీని గెలకడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఈ గొడవ తర్వాత గంభీర్ ఎక్కడ కనిపించినా.. కోహ్లీ ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. ఈ వివాదంపై తాజాగా గంభీర్ స్పందించాడు. ఏ ఆటగాడితో అయినా తన అనుబంధం ఒకేలా ఉంటుందన్నాడు. తప్పు చేస్తే మాత్రం వదిలేదు లేదని గౌతీ పేర్కొన్నాడు.
న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తనకు మధ్య వ్యక్తిగతంగా ఏమీ లేదని స్పష్టం చేశాడు. ‘ఎంఎస్ ధోనీ మరియు విరాట్ కోహ్లీతో నా సంబంధం ఒకేలా ఉంటుంది. ఏ ఆటగాడితోనైనా నా అనుబంధం ఒకే విధముగా ఉంటుంది. మా మధ్య వాగ్వాదం జరిగితే అది మైదానం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. నాలాగే వాళ్లు కూడా గెలవాలని ఎప్పుడూ కోరుకుంటాను’ అని గౌతీ తెలిపాడు.
‘నేను క్రికెట్ మైదానంలో చాలా పోరాటాలు చేశాను. గొడవలు మరియు వాదనలు మైదానం వరకు మాత్రమే పరిమితం కావాలి. వాదన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది, అది క్రికెట్ మైదానంలోనే ఉండాలి కానీ బయట కాదు. చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. టీఆర్పీ రేటింగ్‌ల కోసం ఈ వివాదంపై స్పందించాలని చాలా మంది అడిగాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని గౌతమ్ గంభీర్ వివరించాడు.
‘ఇప్పటికీ నేను ఒక్కటే చెబుతాను. అప్పుడు నేను చేసినదాన్ని సమర్థించుకుంటున్నా. నవీన్ ఉల్ హక్ తప్పు చేయలేదని భావిస్తే.. అతడి వెంట నిలబడతా. ఆ సమయంలో నవీన్ ఉన్నా లేదా ఇతర వ్యక్తి ఉన్నా నా చివరి శ్వాస వరకూ అదే చేస్తా. మీరు సరైనవారని నేను భావిస్తే.. నేను మీ వెంటే ఉంటా. నేను ఇదే నేర్చుకున్నా. దీన్నే కొనసాగిస్తా. నవీన్ మన సొంత ఆటగాడు కాదు కదా.. ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. అతడు మనవాడా? కాదా? అన్నది మ్యాటర్ కాదు.. నా జట్టు సభ్యుడు తప్పు చేసినా మద్దతు ఇవ్వను’ అని గౌతీ చెప్పుకొచ్చాడు.