Site icon NTV Telugu

Gambhir Vs Pitch Curator: హలో మాస్టారు మాకు కూడా రూల్స్ తెలుసండి.. ఓవల్ పిచ్ క్యూరేటర్పై గంభీర్, గిల్ గరం..!

Gambir

Gambir

Gambhir Vs Pitch Curator: భారత్- ఇంగ్లాండ్‌ ఐదో టెస్టు మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. మంగ‌ళవారం నాడు పిచ్ ను ప‌రిశీలిస్తున్న భార‌త బృందం వద్దకి వ‌చ్చిన లీ ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు. లీ మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకు రావడంతో.. పిచ్ క్యూరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా ఈ వివాదంపై భారత కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ రియాక్ట్ అయ్యాడు. క్యూరేటర్ ఫోర్టిస్‌పై మండిపడ్డాడు.

Read Also: Delta Airlines: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను.. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి ప‌రిశీలించాల‌ని ఇప్పటి వరకు ఏ క్యూరేటర్ కూడా మాకు చెప్పలేదని టీమిండియా సారథి గిల్ పేర్కొన్నాడు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్ (చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం ఉంది.. మాకు అన్ని రూల్స్‌ తెలుసు.. ఒకవేళ స్పైక్స్ ఉన్న షూల‌ను వేసుకుంటే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకునే అవకాశం ఉంది.. కానీ, మేము అలాంటి షూలను ధరించలేదు.. అయినా కూడా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో తెలియడం లేదన్నారు. మేము ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాం.. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత జట్టు కెప్టెన్ వెల్లడించారు. కాగా ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి ఓవ‌ల్ స్టేడియం వేదిక‌గా స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేసుకోవాలని టీమిండియా చూస్తుంటే.. ఇంగ్లాండ్ మాత్రం ఎలాగైనా గిల్ సేనను ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.

Exit mobile version