NTV Telugu Site icon

WTC Final 2023: జరిమానాలు వద్దు.. ఓవర్‌కు 20 పరుగులు ఫైన్ వేయండి!

India Test Team

India Test Team

Michael Vaughan react on slow over-rate in WTC Final 2023: టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ అద్భుత ఆటతో ట్రోఫీని ఖాతాలో వేసుకోగా.. రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్ మాత్రం చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా చాలా ఓవర్లు కోల్పోవడంతో పలువురు మాజీలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్‌ వాన్‌ స్పందించాడు. జరిమానాలు కాకుండా.. ఓవర్‌కు 20 పరుగులు ఫైన్ వేస్తే బాగుంటుందన్నాడు.

‘స్లో ఓవర్‌రేట్‌ కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో దాదాపు సగం రోజు ఆటను కోల్పోయాం. దీనిని ఎలా నియంత్రించాలి?’ అని ఓ క్రీడా ఛానల్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు ఇంగ్లీష్ మాజీ ప్లేయర్ మైఖెల్‌ వాన్‌ రిప్లై ఇచ్చాడు. ‘జరిమానాలు ఏ మాత్రం పనిచేయవు. రోజుల చివరలో బ్యాటింగ్‌ చేస్తున్న జట్టుకు అదనంగా పరుగులు ఇవ్వాలి. ఒక్కో ఓవర్‌కు 20 రన్స్’ అని మైఖెల్‌ వాన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొందరు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం 20 పరుగులా అంటూ మండిపడుతున్నారు.

Also Read: Gambhir vs Dhoni: ఎంఎస్ ధోనీ వల్ల భారత్‌కు ప్రపంచకప్‌లు రాలేదు.. అసలు హీరో అతడే: గంభీర్

డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. భారత జట్టు మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియాపై కూడా ఐసీసీ కొరడా జులిపించింది. స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన ఆసీస్‌ జట్టు మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 80 శాతం కోత విధించింది. టైటిల్ కోల్పోయి బాధలో ఉన్న టీమిండియాకు ఇది భారీ షాక్ అని చెప్పాలి.