NTV Telugu Site icon

FIFA World Cup: అంగరంగ వైభవంగా షురూ.. ఆ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్

Fifa Worldcup 2022

Fifa Worldcup 2022

Fifa World Cup Opening Ceremony: ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫిఫా’ వరల్డ్‌కప్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు గ్రూప్-ఏలోని ఖతర్, ఈక్వెడార్ మధ్య పోటీ జరుగుతుంది. రాజధాని దోహాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్‌ఖోర్ సిటీ ఈ మ్యాచ్‌కి వేదకగా మారింది. వచ్చే నెల 18వ తేదీ వరకు జగరనున్న ఈ మెగా గ్రాండ్ ఈవెంట్‌లో మొత్తం 32 దేశాలు పోటీ పడనున్నాయి. ఖతర్ సహా అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, పోర్చుగల్, జర్మనీ, నెదర్లాండ్స్, ఉరుగ్వే, క్రొయేషియా, డెన్‌మార్క్, మెక్సికో, అమెరికా, సెనెగల్, వేల్స్, పోలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

మానవ హక్కులతో పాటు మరెన్నో విమర్శల్ని ఎదుర్కొంటున్న ముస్లిం దేశం ఖతర్.. తన ఖ్యాతిని నిలబెట్టుకునేలా ఈ మెగా ఈవెంట్‌ని సాఫీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సాయంత్రం 5:40 గంటలకు టెంట్ షేప్‌లో ఉన్న ఒక స్టేడియంలో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సౌదీ అరేబియా యువరాజు, ఈజిప్ట్ & అల్జీరియా అధ్యక్షులతో పాటు ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అధికారిక ద్వైపాక్షిక సంబంధాలు లేకపోయినా.. ఫిఫా మధ్యవర్తిత్వంతో పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలు టెల్ అవీవ్ నుంచి కమర్షియల్ విమానంలో ఖతార్‌లో దిగారు. 30 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఒక బృందం కత్తి నృత్యాన్ని ప్రదర్శించింది. ఖతారి సింగర్ ఫహద్ అల్ ఖుబైసీతో కలిసి బీటీఎస్ బ్యాండ్‌కు చెందిన జంగ్‌కుక్ అనే కే-పాప్ బాయ్ కొత్త టోర్నమెంట్ పాటని పాడాడు. ఈ సందర్భంగా గల్ఫ్ రాష్ట్ర ఉపప్రధానమంత్రి ఖలీద్ అల్ అత్తియా మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల కృషి, ప్రణాళికలతో ఖతార్ మంచి ప్రయోజనాల్ని పొందుతోందని అన్నారు.

మరోవైపు.. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్‌ని రిప్రెజెంట్ చేసేందుకు ఆదివారం ఖతార్ చేరుకున్నారు. షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ తాని ఆహ్వానం మేరకు ఖతార్ వెళ్లిన జగదీప్.. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. హమద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఈయనకు ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ ఉపరాష్ట్రపతి పర్యటన.. ఖతార్, భారత్ మధ్య సత్సంబంధాలు పెంపొందించడానికి దోహదపడే అవకాశం ఉంది.

Show comments