England Won Against India In T20 World Cup Semi Final: నిన్న న్యూజీల్యాండ్‌పై పాకిస్తాన్ గెలవడమే ఆలస్యం.. ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్యే ఉంటుందని మనవాళ్లు కథనాలు అల్లేసుకున్నారు. ఇంగ్లండ్‌ని ఓడించడం భారత్‌కి పెద్ద సమస్యేమీ కాదని.. ఆల్రెడీ ఈ టోర్నీలో ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిన ఘనత ఇంగ్లండ్‌ది కాబట్టి, మన టీమిండియా ఆ జట్టుని మట్టికరిపించి, ఫైనల్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుందని అంచనాలు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫైనల్‌లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఉండదని, తాము భారత్‌ని ఫైనల్‌కి వెళ్లనివ్వమని బల్లగుద్ది మరీ చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే.. సెమీ ఫైనల్‌లో భారత్‌ని ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. భారత్ కుదిర్చిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా చేధించింది.
తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. ఇది కీలకమైన మ్యాచ్ కాబట్టి.. కచ్ఛితంగా ఓపెనర్లు దుమ్ముదులుపుతారని అనుకున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చితక్కొట్టడం ఖాయమని భావించారు. తీరా చూస్తే.. ఆ ఇద్దరు చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచారు. ఎప్పట్లాగే ఈసారి కూడా రాహుల్ మొదట్లోనే చేతులెత్తేశాడు. 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ అయితే ఖాతా తెరవకుండా, వన్డే తరహాలో నిదానంగా ఆడాడు. 28 బంతుల్లో 27 పరుగులే చేశాడు. మెయిన్ వికెట్లు పోవడంతో.. కోహ్లీ ఆచితూచి ఆడుతూ, 40 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇక ‘మిస్టర్ 360’గా పేరుగాంచిన సూర్య కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా ఆపద్భాంధవుడిలా టీమిండియాని ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొని, పరుగుల వర్షం లంకించాడు. కేవలం 33 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. అతని పుణ్యమా అని.. భారత్ కనీసం గౌరవప్రదమైన స్కోరు (168) చేయగలిగింది.
169 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ఈజీగానే డిఫెండ్ చేసుకోవచ్చు. పైగా.. ఈ టోర్నీలో మన భారత బౌలర్లు బాగానే రాణించారు కాబట్టి, ఈ మ్యాచ్‌లో కూడా ట్విస్టులు ఇస్తారని ఊహించారు. కానీ, అత్యంత కీలకమైన ఈ సెమీ ఫైనల్‌లో మాత్రం భారత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. వికెట్ తీయడం ఏమో కానీ, కనీసం పరుగుల్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ‘ఇదిగోండి, కొట్టుకోండి’ అన్నట్టు ప్రత్యర్టుల బ్యాటర్లకు బంతులు అందివ్వడంతో.. ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 17 ఓవర్లలోనే 170 పరుగులు చేసి, భారత్‌పై సంచలన విజయం సాధించింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్ ఓపెనర్లైనా జాస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) ఎడాపెడా షాట్లు ఆడటంతో, భారత బౌలర్లు ఒత్తిడి గురయ్యారు. ఆ టెన్షన్‌లో వికెట్ తీయడం మరిచి, పరుగులు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.