Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

Devdutt Padikkal Independence Day Century

Devdutt Padikkal Independence Day Century

Devdutt Padikkal Makes India Cricket History: భారత్, శ్రీలంక మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసేసరికి 178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 131 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. 134 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న పడిక్కల్.. తన టెస్టు కెరీర్‌లో మొదటి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం తన మూడో టెస్టులోనే తొలి సెంచరీ నమోదు చేసిన పడిక్కల్.. క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాని ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

పడిక్కల్ రేర్ రికార్డు:

భారత క్రికెట్‌లో స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రికార్డుల్లో నిలిచాడు. గాలే టెస్టులో శతకం బాదడంతో పడిక్కల్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా టీమిండియా మాజీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ 99 బంతుల్లో అజేయంగా 114 పరుగులు చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగి.. ఆ తర్వాత ఆగస్టు 15కు కొనసాగడంతో ఈ అరుదైన ఘనత కోహ్లీ ఖాతాలో చేరింది. కోహ్లీ సెంచరీ వన్డేల్లో నమోదు కాగా.. పడిక్కల్ ఏకంగా టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం ప్రత్యేకతగా మారింది.

రెండో లెప్ట్‌ హ్యాండ్ బ్యాటర్‌గా:

స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున కూడా అంతర్జాతీయ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2012లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో తన తొలి శతకాన్ని సాధించిన కింగ్.. 116 పరుగులు చేశాడు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెస్టు సెంచరీ సాధించి ప్రత్యేక జాబితాలోకి ప్రవేశించాడు. ఇక 21వ శతాబ్దంలో భారత్‌ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. టెస్ట్ సెంచరీ చేసిన రెండో లెప్ట్‌ హ్యాండ్ బ్యాటర్‌గా పడిక్కల్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2002లో జింబాబ్వేపై శతకం చేశాడు.

టెస్టు ప్రయాణానికి కొత్త ఊపు:

సాయి సుదర్శన్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఈ ఆర్సీబీ బ్యాటర్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కెరీర్‌లో కీలకమైన సమయంలో వచ్చిన ఈ శతకం అతడి టెస్టు ప్రయాణానికి కొత్త ఊపునిచ్చింది. 19 టెస్టుల్లో భారత్ ఏకంగా ఏడుగురు వేర్వేరు బ్యాటర్లను నంబర్-3లో ప్రయోగించినా.. ఆ ఆటగాళ్ల సగటు కేవలం 27.28గా ఉంది. శుభ్‌మన్ గిల్ 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై చెన్నైలో సెంచరీ చేసిన తర్వాత భారత జట్టులో నంబర్-3 స్థానంలో మరో సెంచరీ రాలేదు. ఇప్పుడు పడిక్కల్ శతకంతో ఆ లోటుకు తెరపడింది. దీంతో భవిష్యత్తులో ఈ స్థానానికి తాను కూడా బలమైన అభ్యర్థినని నిరూపించాడు.

అద్భుతమైన ఫామ్‌లో పడిక్కల్:

దేశవాళీ క్రికెట్‌లోనూ దేవదత్ పడిక్కల్ ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడి గత ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లోని 10 ఇన్నింగ్స్‌ల్లో 702 పరుగులు చేశాడు. అతడి సగటు 87.75గా ఉంది. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. మొహాలీలో పంజాబ్‌పై 120 పరుగుల నాటౌట్, ఉత్తరాఖండ్‌పై రంజీ సెమీఫైనల్లో 232 పరుగులు, శ్రీలంక ‘ఏ’పై గాలేలో 101 నాటౌట్ వంటి కీలక ఇన్నింగ్స్‌లు అతడి ఫామ్‌కు నిదర్శనం. శ్రీలంక ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌ల్లో 12, 67, 94 పరుగులతోనూ మెరిశాడు. అలాగే కొలంబోలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 164 బంతుల్లో 142 పరుగుల నాటౌట్ సాధించాడు. ఒక్క సెంచరీతో నంబర్-3 స్థానానికి తాను కూడా రేసులో ఉన్నానని సెలెక్టర్లకు పడిక్కల్ హెచ్చరికలు పంపాడు.