Site icon NTV Telugu

Danni Wyatt: పేరెంట్ అవుతున్న లెస్బియన్ క్రికెటర్.. ఒకప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజ్!

Danni Wyatt Hodge

Danni Wyatt Hodge

Lesbian Cricketer Danni Wyatt-Hodge Expecting Baby Girl: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డాని వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2024 జూన్ 10న లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో ఇద్దరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 2019 నుంచి డేటింగ్ చేసిన డాని వ్యాట్, జార్జి హాడ్జ్‌లు.. 2023 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా డాని, జార్జి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ లెస్బియన్ జంట లండన్‌లో కలిసి ఉంటోంది. తాజాగా డాని వ్యాట్-హాడ్జ్ ఓ శుభవార్త చెప్పారు.

ఈ లెస్బియన్ జంట డాని వ్యాట్, జార్జి హాడ్జ్‌ త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. తమకు ఓ ఆడ బిడ్డ పుట్టబోతోందని డాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మా లిటిల్ వ్యాట్-హాడ్జ్ రాబోతోంది. త్వరలో కలుద్దాం బేబీ గర్ల్. మేము నిన్ను చూడడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు సూర్యాస్తమయం సమయంలో నీటి దగ్గర నిలబడి అల్ట్రాసౌండ్ పోటోలను పట్టుకుని ఉన్న పిక్స్ జతచేశారు. ఈ జంటకు సహచరులు, ఫాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంగ్లండ్ జట్టుకు చెందిన లారెన్ బెల్, సోఫీ ఎక్ల్‌స్టోన్.. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కూడా శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఫుట్‌బాల్ వర్గాలు కూడా జార్జీ హాడ్జ్‌కు విషెష్ తెలిపాయి.

34 ఏళ్ల డాని వ్యాట్-హాడ్జ్ ఇటీవల 2025 వన్డేప్రపంచకప్‌లో ఆడారు. డాని తన కెరీర్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్ట్‌ల్లో 188 పరుగులు చేశారు. 120 వన్డేల్లో 2,074 పరుగులు, 27 వికెట్లు తీశారు. 178 టీ20ల్లో 3,335 పరుగులు, 46 వికెట్లు పడగొట్టారు. డాని డబ్ల్యూపీఎల్ 2026లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడనున్నారు. ఆమెను ఫ్రాంచైజీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు తరపున ఆడి ఆరు మ్యాచ్‌లలో 137 పరుగులు చేశారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో కీలక ఆటగాళ్లలో ఒకరైన డ్యాని.. తన పవర్‌ఫుల్ బ్యాటింగ్‌, అద్భుత ఫీల్డింగ్‌, ఆఫ్‌స్పిన్‌తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారు. 2014లో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసినప్పుడు డానీ వెలుగులోకి వచ్చారు. ‘కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో’ అని పోస్ట్ రాశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Exit mobile version