ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు ప్రపంచకప్ విజేత డామియన్ మార్టిన్ ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న 54 ఏళ్ల మార్టిన్‌కు.. బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. మార్టిన్ ప్రస్తుతం జీవితంతో పోరాటం చేస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు.
వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన డామియన్ మార్టిన్ క్రిస్ట్‌మన్ తర్వాతి రోజు తన గోల్డ్ కోస్ట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను బ్రిస్బేన్ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల్లో మార్టిన్‌కు మెనింజైటిస్ వ్యాధి నిర్ధారణ అయింది. మార్టిన్‌కు మత్తు మందు ఇచ్చి తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే.. మరికొన్ని రోజుల్లో మార్టిన్‌ను కోమా నుంచి బయటకు తీసుకువస్తారట. మెనింజైటిస్ అనేది మెదడు, వెన్ను చుట్టూ ఉన్న పొరల్లో తీవ్రమైన వాపు రావడం వల్ల కలిగే ప్రమాదకర వ్యాధి. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాపాయం కూడా. మార్టిన్ తొందరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు.
Also Read: Rukmini Vasanth: ఒకే ఒక్క హిట్.. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా రుక్మిణీ వసంత్!
1999, 2003 వరల్డ్‌కప్‌లతో పాటు 2006 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా జట్లలో డామియన్ మార్టిన్ కీలక సభ్యుడిగా ఉన్నారు. ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడారు. టెస్టుల్లో 46.37 సగటుతో 13 శతకాలు (4406 రన్స్) చేశారు. 2005లో న్యూజిలాండ్‌పై చేసిన 165 పరుగుల ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో చిరస్మరణీయం. వన్డేల్లో కూడా 40.8 సగటుతో రన్స్ (5346) చేశారు. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై గాయపడిన వేలితోనే అజేయంగా 88 పరుగులు చేయడం అభిమానుల మదిలో నిలిచిపోయింది. 2006–07 యాషెస్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్.. ఆ తర్వాత వ్యాఖ్యాతగా మారారు.
