Site icon NTV Telugu

India vs England: కేఏ పాల్ కన్నా దారుణంగా ఆడారు.. టీమిండియాపై విసుర్లు

India Fans Fire On India

India Fans Fire On India

Cricket Fans Criticism On India Team After Losing Against England: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో భాగంగా ఇంగ్లండ్ చేతిలో భారత్ ఎంత ఘోర పరాజయం చవిచూసిందో అందరికీ తెలిసిందే! బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో.. ఒక్క వికెట్ కోల్పోకుండానే, మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది. బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు కూడా డిజాస్టర్ ప్రతిభ కనబరిచారు. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం పరుగుల వర్షం కురిపించే కేఎల్ రాహుల్.. ఈ కీలక మ్యాచ్‌లో మాత్రం 5 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. నిజానికి.. ఓపెనర్లకు ఆరు ఓవర్ల పవర్‌ప్లే అనేది ఒక వరం. ఇద్దరు మినహాయిస్తే.. మిగతా ఫీల్డర్లందరూ 30 యార్డ్స్ సర్కిల్ లోపలే ఉంటారు కాబట్టి, భారీ బౌండరీలు బాదడానికి వీలుంటుంది. అలాంటి సువర్ణవకాశాన్ని, ఓపెనర్ల ఫ్లాప్ షో కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. వికెట్లు పడుతున్నాయని కోహ్లీ కాసేపు క్రీజులో నిలబడాల్సి వచ్చింది. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటం చేయడంతో.. భారత్ 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఒకవేళ ఓపెనర్లు కూడా ఖాతా తెరిచి ఉంటే, బహుశా భారత్‌కి 200 పరుగులు చేసే వీలుండేది. ఇక బౌలర్లైతే కనీస పోరాట పటిమ కనబర్చలేదు. వికెట్ తీయకపోగా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంలో విఫలమయ్యారు. గతంలోనూ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి కానీ, ఈసారి మాత్రం మరింత చెత్త ప్రదర్శనతో భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు.

అందుకే.. మండిపోయిన భారత అభిమానులు టీమిండియాపై తిట్ల పురాణం సంధిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కీలక మ్యాచెస్‌లో కేఎల్ రాహుల్ ఎప్పుడూ హ్యాండ్ ఇస్తాడని, ఈ టోర్నీలోనూ చిన్న టీమ్‌లపై మినహాయిస్తే, పెద్ద టీమ్‌లపై అతడు స్కోరు చేసిన సందర్భాలే లేవని కోపాద్రిక్తులవుతున్నారు. భారత జట్టులో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నప్పుడు.. ఎల్లప్పుడూ ఫ్లాప్ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న రాహుల్‌కే ఎందుకు అవకాశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడ్స్‌లో నటించడానికి, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కొట్టడానికి తప్ప.. కేఎల్ రాహుల్ దేనికీ పనికిరాడంటూ ఏకిపారేస్తున్నారు. అటు.. రోహిత్ శర్మ కూడా ఈ టోర్నీలో ఒక్క కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడకపోవడం, సెమీస్‌లోనూ చేతులెత్తేయడంతో, అతనిపై విమర్శనాస్ట్రాలు సంధిస్తున్నారు. తిండి మీద పెట్టే ధ్యాసలో పావు భాగం బ్యాటింగ్ మీద పెట్టి ఉంటే, ఈరోజు ఈ దుస్థితి చూసే అవసరం వచ్చేది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. వీరితో పాటు ఈ టోర్నీ మొత్తంలో ఫ్లాప్ షో డిజప్పాయింట్ చేసిన టీమిండియా ఆటగాళ్లను ఓ రేంజ్‌లను ట్రోల్ చేసిపారేస్తున్నారు. ఇదే సమయంలో.. మునుగోడు ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన సందడిని తెరమీదకి తీసుకొచ్చి, కనీసం అతనిలా కూడా ఆకట్టుకోలేకపోయారని చీవాట్లు పెడుతున్నారు. ఓవైపు వింత ప్రచారాలతో వార్తల్లో నిలవడం, మరోవైపు కొంతలో కొంతైనా ఓట్లు పొంది.. కాస్త పరిణతి సాధించాడని, అతని కంటే దారుణ ప్రదర్శనతో అసమర్థ జట్టుగా నిలిచిందంటూ క్రీడాభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

Exit mobile version