Commonwealth Games Bindyarani Devi Wins Silver: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ మూడు పతకాలను కైవసం చేసుకోగా.. మరో పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా… తాజాగా మహిళల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి బింద్యా రాణి దేవీ సిల్వర్ పతకాన్ని సాధించారు. దీంతో శనివారం భారత్ మొత్తం నాలుగు పతకాలను సాధించింది. మొదటగా 114 కేజీల రెండో క్లీన్ అండ్ జెర్క్ ప్రయత్నంలో విఫలం అయినప్పటికీ.. చివరి ప్రయత్నంలో 116 కిలోల బరువును ఎత్తారు బింద్యారాణి. దీంతో రెండవ స్థానంలో నిలిచారు.
Read Also: Commonwealth Games: కామన్వెల్త్ లో మీరాబాయి రికార్డ్.. స్వర్ణం కైవసం
అయితే స్వర్ణం సాధించిన నైజీరియా క్రీడాకారిణి ఆదిజత్ ఒలారినోయ్ కన్నా కేవలం 1 కిలో తక్కువతో బింద్యారాణి రెండోస్థానంలో నిలిచారు. సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 23 ఏళ్ల బింద్యారాణి మొత్తంగా 202 కిలోలను ఎత్తారు. స్నాచ్ రౌండ్ లో 86 కిలోలు .. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 116 కిలోలను లిఫ్ట్ చేసి కామన్వెల్త్ క్రీడల్లో రికార్డ్ క్రియేట్ చేశారు. స్వర్ణాన్ని గెలిచిన అదిజల్ అడెనికే ఓలారినోయ్ 203 కిలోల( స్నాచ్ 92 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ 111కిలోలు)ను ఎత్తి స్వర్ణాన్ని సాధించారు. మూడో స్థానంలో ఫ్రెయర్ మారో 198 కిలోలు ఎత్తి కాంస్య పతకాన్ని గెలిచారు. అంతకు ముందు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే మీరాబాయి చాను స్వర్ణాన్ని గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. సంకేత్ మహాదేవ్ సర్గర్ రజత పతకం గెలవగా.. గురురాజా పూజారి కాంస్య పతకాలను సాధించారు.