NTV Telugu Site icon

బీజింగ్ వింట‌ర్ ఒలింపిక్స్‌పై చైనా కీల‌క నిర్ణ‌యం…

ప్ర‌పంచంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, జీరో క‌రోనా దేశంగా ఆవిర్భ‌వించేందుకు చైనా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న చోట క‌ఠిన‌మైన లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న‌ది. ఇప్ప‌టికే మూడు న‌గ‌రాల‌లో లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఫిబ్ర‌వ‌రి 4 వ తేదీ నుంచి బీజింగ్‌లో వింట‌ర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.  ఈ ఒలింపిక్స్ ప్రారంభ‌మ‌య్యే నాటికి ఎలాగైనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసి గేమ్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని చూస్తున్న‌ది.  ఈ ఒలింపిక్స్‌కు విదేశాల నుంచి వ‌చ్చే ప్రేక్ష‌కులను అనుమ‌తించేది లేద‌ని మొద‌ట్లో చైనా చెప్పేసింది.  

Read: ‘చింతామణి’పై సర్కార్‌ నిషేధం..

ఆట‌గాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది.  అయితే, దేశీయ ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తులు ఇస్తామ‌ని చెప్పిన చైనా, ఇప్పుడు ఈ విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గింది.  ఈ వింట‌ర్ ఒలింపిక్స్‌కు ప్రేక్ష‌కులకు అనుమ‌తి లేద‌ని, ప్రేక్ష‌కులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పింది.  వివిధ దేశాల నుంచి వ‌చ్చే క్రీడాకారుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చైనా తెలియ‌జేసింది.