Site icon NTV Telugu

CSK vs MI: పిండేసిన ముంబై బౌలర్స్.. 97 పరుగులకే కుదేలైన చెన్నై

Mumbai Vs Chennai

Mumbai Vs Chennai

గొప్ప బ్యాటింగ్ లైనప్ కలిగిన ఐపీఎల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టాపార్డర్ విఫలమైతే, మిడిలార్డర్ పటిష్టంగా రాణించగలదు. ఐదు వికెట్ల కోల్పోయిన తర్వాత కూడా, చెన్నై జట్టు మంచి స్కోరు సాధించగలదు. అందుకే, ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ జట్టు చెలామణి అవుతోంది. అలాంటి చెన్నై, ఈరోజు ముంబై బౌలర్ల చేతిలో కుదేలైంది. కేవలం 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, చెన్నై జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన ముంబై.. బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన చెన్నై, 16 ఓవర్లకే కుప్పకూలింది. ఈసారి టాపార్డర్ దారుణంగా విఫలమయ్యారు. డివాన్ కాన్వే, మోయీన్ అలీ డకౌట్ అవ్వగా.. ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్ 6 పరుగులకే వెనుతిరిగాడు. ఈ ఏడాది సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రాబిన్ ఉతప్ప సైతం ఆరు బంతుల్లో కేవలం ఒక పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఎంఎస్ ధోనీ ఒక్కడే, 33 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్ళందరూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.

ముంబై బౌలింగ్ విషయానికొస్తే.. డేనియల్ సామ్స్ చెన్నై బ్యాట్స్మన్లపై దండయాత్ర చేశాడని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి, 3 వికెట్లు తీశాడు. రిలీ మెరిడిత్, కుమార్ కార్తికేయ చెరో రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, రమన్దీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. ముంబై ముందున్న లక్ష్యం (98) చాలా తక్కువే కాబట్టి, విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, ముంబై బౌలర్ల తరహాలోనే చెన్నై బౌలర్లు కూడా మాయం చేస్తే, మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారడం ఖాయం.

Exit mobile version