ఇటీవల అంబటి రాయుడు ‘ఇదే తన చివరి టీ20 లీగ్’ అంటూ ట్వీట్ చేసినట్టే చేసి, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేసిన వ్యవహారంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అసలెందుకు రాయుడు ఆ పని చేశాడంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు లేకపోవడంతో.. చెన్నై యాజమాన్యానికి, రాయుడుకి ఏమైనా చెడిందా? అనే అనుమానాలు తీవ్రమయ్యాయి. అలాంటిదేమీ లేదని, రాయుడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదని సీఎక్కే సీఈవో కాశీ విశ్వనాథ్ వివరణ ఇచ్చినప్పటికీ.. ఆ అనుమానాలు ఆగలేదు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చేందుకు చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రంగంలోకి దిగాడు. ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిదని ఆయన పేర్కొన్నాడు. చెన్నై యాజమాన్యానికి, రాయుడుకి చెడిందని వస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశాడు. రాయుడు బాగానే ఉన్నాడని, ఇలాంటి చర్చలు తమ క్యాంప్‌పై ఎలాంటి ప్రభావమూ చూపవని చెప్పాడు. తానేమీ కట్టుకథ చెప్పడం లేదని, అంతా బానే ఉందని ఫ్లెమింగ్ వివరించాడు.
ఇదిలావుండగా.. అంబటి రాయుడును చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన రాయుడు.. 27.10 సగటుతో 271 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుత సీజన్‌లో సరిగ్గా రాణించలేకపోయానన్న నిరుత్సాహంతోనే రాయుడు ‘రిటైర్మెంట్’ ట్వీట్ చేసి ఉంటాడని సీఎస్కే సీఈవో కాశీ ఇదివరకే చెప్పారు. ఆ ట్వీట్ చూసిన వెంటనే తాను అతనితో మాట్లాడానని, అతడేమీ రిటైర్మెంట్ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు.
