Boxer Lovlina Sensational Comments On Boxing Federation Of India: కామన్‌వెల్త్ 2022 క్రీడలకు సిద్ధమవుతున్న బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు తనని మానసికంగా వేధిస్తున్నారని, కామన్‌వెల్త్ గేమ్స్‌కి ముందు కావాలనే టార్గెట్ చేస్తున్నారని బాంబ్ పేల్చింది. లోపల చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయని, తాను మెడల్ సాధించడానికి ప్రోత్సాహించిన కోచ్‌లను మారుస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆమె కుండబద్దలు కొట్టింది. తన కోచ్‌లనే తిరిగి నియమించాలని వేడుకుంది.
‘‘నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారు. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించడానికి ప్రోత్సాహించినా, వెన్నుదన్నుగా నిలిచిన నా కోచ్‌లను తరచూ మారుస్తున్నారు. నా ట్రైనింగ్ ప్రాసెస్‌లో, అలాగే పోటీల్లో నన్ను వేధిస్తూనే ఉన్నారు. నా కోచ్‌లలో ఒకరైన సంధ్య గురుంగ్‌జీ ‘ద్రోణాచార్య’ పురస్కారం పొందారు. వెయ్యిసార్లు చేతులు జోడించి వేడుకుంటే కానీ, నా కోచ్‌లని క్యాంప్‌లోకి అనుమతించడం లేదు. ఈ ట్రైనింగ్‌లో నేను మానసిక ఆందోళనకు గురవుతున్నాను. ఇప్పుడు నా కోచ్ సంధ్య గురుంగ్‌జీ కామన్‌వెల్త్ విలేజ్‌కి బయట ఉన్నారు. ఆయనకు ఎంట్రీ దొరకడం లేదు. నా ట్రైనింగ్ కూడా కేవలం ఎనిమిది రోజుల క్రితమే ప్రారంభమైంది. నా రెండో కోచ్‌ని కూడా ఇప్పుడే ఇండియాకు తిరిగి వెనక్కు పంపించారు’’ అంటూ ఆ ట్వీట్‌లో లవ్లీనా పేర్కొంది.
తానెంతో వేడుకున్న తర్వాత కూడా ఆ కోచ్‌లని పంపించారని, ఇది తనని మానసిక క్షోభకు గురి చేస్తోందని లవ్లీనా తెలిపింది. ఈ కారణంగా తాను ఆటపై ఫోకస్ చేయలేకపోతున్నానని మొరపెట్టుకుంది. గత ఛాంపియన్షిప్‌లో తాను సరిగ్గా ప్రదర్శించకపోవడానికి కూడా ఈ పాలిటిక్స్ కారణమని చెప్పింది. అయితే.. దీని ప్రభాస్ కామన్‌వెల్త్ క్రీడల్లో పడకుండా జాగ్రత్త తీసుకుంటానని, దేశం కోసం ఈ పాటిలిక్స్ గోడల్ని బద్దలుకొట్టి, మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. అయితే.. లవ్లీనా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్లు ఆమె మద్దతుగా సోషల్ మీడియాలో కోరుతున్నారు.
