Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్‌లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?

  • ఇంగ్లండ్ క్రికెట్‌లో కలకలం
  • మరోసారి వివాదంలో చిక్కుకున్న స్టోక్స్‌
  • బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
Ben Stokes Test New

Ben Stokes Test New

Ben Stokes in Trouble: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన అనంతరం టీమ్ మేనేజ్‌మెంట్ విధించిన నిబంధనలకు ఉల్లంఘించి.. నైట్‌ క్లబ్‌కు వెళ్లిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ కూడా ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక విచారణ చేపట్టింది. ఈ ఘటన దృష్ట్యా స్టోక్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రిటిష్ మీడియా తమ కథనాల్లో రాసుకొచ్చింది.

న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత సోమవారం (జూన్ 8) తెల్లవారుజామున బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ లండన్‌లోని ఓ నైట్‌ క్లబ్‌ను సందర్శించారు. అయితే జట్టు నిబంధనల ప్రకారం అర్ధరాత్రి తర్వాత ఆటగాళ్లు బయట తిరగకూడదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈసీబీ గుర్తించింది. అక్కడే జరిగిన ఓ గొడవ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. నివేదికల ప్రకారం.. సారాసెన్స్ రగ్బీ క్లబ్‌కు చెందిన ఓ అకాడమీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఈసీబీ భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయమై కుట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే స్టోక్స్ లేదా అట్కిన్సన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

×
×
Ad

ఈ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ దాడికి పాల్పడలేదని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఘర్షణకు కారణమైనది రగ్బీ ఆటగాడేనని, క్రికెటర్లు ఎలాంటి దాడి చేయలేదని నివేదికలు పేర్కొన్నాయి. పోలీసుల జోక్యం లేకుండానే ఈ వివాదం ముగిసిందని సమాచారం. అయినప్పటికీ జట్టు నిబంధనలను ఉల్లంఘించిన విషయంపై ఈసీబీ ఆగ్రహంగా ఉందట. ఈ ఘటనపై ఈసీబీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. రెండో టెస్ట్‌కు ముందు పూర్తి నివేదిక సిద్ధం చేసి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా పరిగణిస్తే.. స్టోక్స్ కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం ఉందని ఇంగ్లండ్ మీడియా అంటోంది. అలాగే గస్ అట్కిన్సన్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బెన్ స్టోక్స్ కెరీర్‌లో నైట్‌ క్లబ్ వివాదాలు కొత్తవి కావు. 2017లో బ్రిస్టల్‌లోని ఓ నైట్‌ క్లబ్ వెలుపల జరిగిన ఘర్షణ కేసులో కూడా అతడు వార్తల్లో నిలిచాడు. అలాగే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సమయంలో ఇంగ్లండ్ జట్టుపై అధిక మద్యపానం, క్రమశిక్షణా లోపాల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాతే జట్టులో అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనను మళ్లీ అమలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన తాజా ఘటన స్టోక్స్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో జట్టును ముందుండి నడిపించిన స్టోక్స్.. మైదానం వెలుపల జరిగిన ఈ వివాదం కారణంగా తన కెప్టెన్సీని కోల్పోతాడా లేదా అన్నది ఈసీబీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.