Bangladesh Beat India By 5 Runs In Second ODI: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. చివరివరకూ గట్టిగానే పోరాడింది కానీ, ఓవర్లు అయిపోవడంతో ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. స్టార్ బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో.. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ని భారత్ వదులుకోవాల్సి వచ్చింది. 272 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56), రోహిత్ శర్మ (51) భారత్‌ను గెలిపించేందుకు బాగానే ప్రయత్నించారు. కానీ, చివర్లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో కేవలం 5 పరుగులు తేడాతో భారత్ ఓడిపోయింది. 266 పరుగులకే చాపచుట్టేయాల్సి వచ్చింది.
షేర్-ఏ-బంగ్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. బరిలోకి దిగిన ఆదిలోనే బంగ్లాకి గట్టి దెబ్బలు తగిలాయి. టాపార్డర్‌ని భారత బౌలర్లు కుప్పకూల్చారు. దీంతో.. 69 పరుగులకే బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. ఇది చూసి.. స్వల్ప స్కోరుకే బంగ్లా ఆలౌట్ అవ్వొచ్చని అంతా అనుకున్నారు. కానీ.. ఆ అంచనాల్ని మెహిదీ హసన్ తిప్పికొట్టాడు. మరో వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతూ.. బంగ్లా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. మహ్మదుల్లాతో కలిసి.. పరుగుల వర్షం కురిపించాడు. వీళ్లిద్దరు కలిసి ఏడో వికెట్‌కి ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. మహ్మదుల్లా ఔటయ్యాక కూడా హసన్ ఆగలేదు. రప్ఫాడించేశాడు. దీంతో.. బంగ్లా స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 271కి చేరింది. ఈ క్రమంలో మెహదీ హసన్ తన శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. అతని వల్లే బంగ్లా ఇంత భారీ స్కోరు చేయగలిగిందని చెప్పుకోవడంలో సందేహం లేదు.
ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి కూడా ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధవన్ (8) అత్యల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన సుందర్, కేఎల్ రాహుల్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. అయితే.. వన్ డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి భారత్ స్కోర్‌ని ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరు కలిసి ఐదో వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నిలిచాయి. వీళ్లు ఆడిన ఇన్నింగ్స్ కారణంగా.. భారత్ ఆశలు సజీవం అయ్యాయి. కానీ.. ఎప్పుడైతే వాళ్లిద్దరు ఔటయ్యారో భారత్ మళ్లీ కష్టాల్లోకి వెళ్లిపోయింది. చివర్లో రోహిత్ శర్మ (28 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అతనికి సరైన మద్దతు లభించకపోవడంతో.. మరో ఐదు పరుగులు ఉండగానే భారత్ ఓవర్లు ముగిసిపోయాయి. దీంతో.. మ్యాచ్ ఓడిపోయింది. ఈ విజయంతో 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను బంగ్లా కైవసం చేసుకుంది.
