ఒకప్పుడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమన్నది గగనం. కానీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తొలిసారి డబుల్ సెంచరీ చేసి, అంతర్జాతీయ క్రీడల్లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు 200 పరుగుల మైలురాయిని అందుకున్నారు. అయితే, ఇప్పుడు ఓ క్రికెటర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. అది కూడా ఓ అంధ క్రికెటర్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టెఫన్ నీరో త్రిశతకం చేశాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. కామన్‌వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా న్యూజీల్యాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 40 ఓవర్లలో ఏకంగా 542 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇదంతా స్టెఫన్ నీరో బాదిన ట్రిపుల్ సెంచరీ పుణ్యమే! అతడు 140 బంతుల్లో 49 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 309 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాట్స్మన్లు కూడా చెలరేగడంతో.. ఆసీస్ 542 పరుగులు చేయగలిగింది. ఇక 543 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీల్యాండ్.. 272 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. ఫలితంగా.. 270 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది.
ఇదిలావుండగా.. ఇంతకుముందు అంధుల క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాట్స్మన్ మసూద్ జాన్ 262 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అతను 1998లో ఆ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత స్టెఫన్ నీరో ఆ రికార్డ్ బద్దలు కొట్టి, ట్రిపుల్ సెంచరీతో సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అలాగే ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నీరో నిలిచాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు చేశారు.