మహిళల వన్డే ర్యాంకులను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టాప్-10 ర్యాంకుల్లో ఇటీవల వన్డే ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా మహిళలు డామినేట్ చేస్తున్నారు. ఈ జాబితాలో టాప్-10లో ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మహిళలే ఉండటం విశేషం. ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాటర్ల ర్యాంకుల్లో టాప్-1లో ఆస్ట్రేలియా ప్లేయర్ అలీస్సా హిలీ నిలిచింది. ఆమె ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించింది. ప్రపంచకప్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆమె 509 పరుగులు సాధించింది. ఇందులో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు ఉన్నాయి. అయితే అలీస్సా హిలీ ఎవరో కాదు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్య.
మరోవైపు ఈ జాబితాలో టాప్-10లో మిగతా స్థానాలను స్కీవర్ (ఇంగ్లండ్), మూనీ (ఆస్ట్రేలియా), వొల్వార్డ్ (దక్షిణాఫ్రికా), మెగ్ ల్యానింగ్ (ఆస్ట్రేలియా), హేన్స్ (ఆస్ట్రేలియా), మిథాలీ రాజ్ (భారత్), సాట్టెర్ వైట్ (న్యూజిలాండ్), స్మృతి మంధాన (భారత్) ఆక్రమించారు. బౌలింగ్ ర్యాంకుల్లో భారత ప్లేయర్లల్లో టాప్ టెన్‌లో ఒక్కరికి మాత్రమే చోటు దక్కింది. స్టార్ బౌలర్ జూలన్ గోస్వామి ఐదో స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్ల కేటగిరీలో టాప్-10లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉన్నారు. ఏడో స్థానంలో దీప్తి శర్మ, పదో స్థానంలో జూలన్ గోస్వామి ఉన్నారు.
