Afghanistan Won First Match Against Sri Lanka In Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. మొదట శ్రీలంక జట్టు 105 పరుగులకే చాపచుట్టేయగా.. 10.1 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని చేధించింది. ఆఫ్ఘన్ ఓపెనర్లు చెలరేగి ఆడటంతో.. ఆ స్వల్ప లక్ష్యాన్ని అంత తక్కువ ఓవర్లలోనే చేధించగలిగారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు శ్రీలంక బరిలోకి దిగింది. అయితే.. ఆది నుంచే శ్రీలంక బ్యాట్స్మన్లు తడబడ్డారు. భానుక రాజపక్స (38), చమిక కరుణరత్నే (31) మినహాయిస్తే.. ఏ ఒక్కరూ కూడా సరిగ్గా రాణించలేకపోయారు. కాస్తో కూస్తో ధనుష్క గుణతిలక (17) పర్వాలేనిపించాడంతే! ముగ్గురు డకౌట్స్ కాగా.. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దీంతో.. శ్రీలంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది.
ఇక 106 స్వల్ప లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు.. మొదట్నుంచే విజృంభించారు. ఒకవైపు హజ్రతుల్లా జజై (28 బంతుల్లో 37) ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా షాట్లు బాదితే.. మరోవైపు రెహ్మానుల్లా గుర్బాజ్ రప్ఫాడించేశాడు. 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఇతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ వల్లే.. స్వల్ప లక్ష్యానికి త్వరగా చేరువయ్యారు. తొలి వికెట్‌కు ఈ ఓపెనర్లు కలిసి 83 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. మాంచి ఊపులో ఉన్న గుర్బాజ్.. ఆ జోష్‌లోనే హసరంగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం జద్రన్.. కాసేపు క్రీజులో కుదురుకున్నట్టే కుదురుకొని, చివర్లో ఔటయ్యాడు. చివరికి జద్రన్ చేసిన సింగిల్‌తో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఇంకా 9.5 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండగానే.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేధించింది. హసరంగ ఒక్కడే శ్రీలంక బౌలర్లలో రాణించాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫారుఖీ 3 వికెట్లు తీయగా.. రెహ్మాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీశాడు.
