అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఏప్రిల్ మాసంలో ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ మూవీస్ జనం ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్కసారిగా చిత్రసీమ కుదేలైంది. అయినా ఈ నెల కూడా డబ్బింగ్ తో కలిపి 17 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మూడవ వారంలో థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని థియేటర్లనూ మూసేశారు కూడా. కానీ ‘వకీల్ సాబ్’ ప్రదర్శన కోసం థియేటర్లు తెరిచి ఉంచడంతో చిన్న చిత్రాల నిర్మాతలు ఒకరిద్దరు తమ చిత్రాలను ఈ నెల చివరి రెండు వారాల్లో విడుదల చేశారు.
మాట మీద నిలబడ్డ ‘వైల్డ్ డాగ్’
కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం గత యేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మధ్యలో ఓటీటీ సంస్థలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా నాగ్ నిర్మాతలు వాటిని పట్టించుకోలేదు. తాము అనుకున్నట్టు ఏప్రిల్ 2న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చారు. దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కిన ‘వైల్డ్ డాగ్’లో నాగార్జున నటన, మేకింగ్ క్వాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బట్… మాస్ ఆడియెన్స్ ను అలరించడంలో విఫలమైంది. అందుకే ఈ సినిమాను వెంటనే ఓటీటీలోనూ విడుదల చేసి, మరింత మందికి ఇది చేరేలా చేశారు నిర్మాతలు. ఏప్రిల్ మొదటివారంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’తో పాటు మూడు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. కన్నడ చిత్రం ‘యువరత్న’, తమిళ చిత్రాలు ‘సుల్తాన్, ఓ మంచి రోజు చూసి చెప్తా’ కూడా అదే వారాంతంలో వచ్చినా ఏదీ మెప్పించలేదు.
పవర్ స్టార్ గ్రాండ్ రీ-ఎంట్రీ!
దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇది హిందీ సినిమా ‘పింక్’కు రీమేక్. విశేషం ఏమంటే… రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైతం రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తోనే రీ ఎంట్రీ ఇచ్చారు. అన్న అప్పుడు సృష్టించిన మేజిక్ నే ఇప్పుడు తమ్ముడూ క్రియేట్ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ‘వకీల్ సాబ్’ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదే విధంగా మహిళాభిమానుల మనసుల్నీ దోచుకుంది. ఈ సినిమా ఓవర్ ఆల్ గా దాదాపు 130 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఆ రకంగా ఏప్రిల్ విన్నర్… వన్ అండ్ ఓన్లీ ‘వకీల్ సాబ్’ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత వారం ఏ. ఆర్. రెహమాన్ కథను అందించి, నిర్మించిన ’99 సాంగ్స్’ విడుదలైంది కానీ ఎలాంటి ప్రభావాన్ని బాక్సాఫీస్ బరిలో చూపించలేకపోయింది. ఇదే వారంలో మరో రెండు అనువాద చిత్రాలూ వచ్చాయి. అలానే రాజశేఖర్ తో ‘పట్టపగలు’ పేరుతో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా సైతం ‘ఆర్జీవీ దెయ్యం’గా 16వ తేదీ విడుదలైంది. ఈ సినిమాలోపాటు మరో నాలుగు స్ట్రయిట్ సినిమాలు విడుదలైనా అవేవీ చెప్పుకోదగ్గవి కాదు.
థియేటర్ల బంద్ ను పట్టించుకోకుండా ఏప్రిల్ 23న వచ్చిన ‘శుక్ర, కథానిక’ సినిమాలకూ ప్రేక్షకాదరణ దక్కలేదు. ఇక ఏప్రిల్ 30న వచ్చిన చివరి చిత్రం ‘ఒక అమ్మాయి క్రైమ్ స్టోరీ’. కీర్తి చావ్లా నటించిన ఈ సినిమా రిలీజ్ కావడమే ఓ విజయం అన్నట్టు అయ్యింది. ఇలా ఏప్రిల్ మాసంలో మొత్తం 17 సినిమాలు విడుదలైతే… ఒక్క ‘వకీల్ సాబ్’ మాత్రమే విజయవంతమైన చిత్రంగా నిలిచింది. మరి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే నెలలో అసలు సినిమాలు విడుదల అవుతాయో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దీనికి కాలమే జవాబు చెప్పాలి.