NTV Telugu Site icon

తెలకపల్లి రవి : అఘాయిత్యపు బెదిరింపులు, అసహ్యకరమైన బూతులు ఆపేదెలా ?

ఎపి ముఖ్యమంత్రి తల నరుకుతానంటూ వ్యాఖ్యానించిన సస్పెండెడ్‌ మేజిస్ట్రీట్‌ రామకృష్ణను మదనపల్లిలో పోలీసు అరెస్టు చేసి, పీలేరు తీసుకువెళ్లారు. అధికారిక ప్రకటన ఇంకా లేనప్పటికీ ఆ వ్యాఖ్యల కోసమే అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చాలని జగన్‌ అనలేదా అని ఈ సమయంలో రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలోనూ జగన్‌ ను అందరూ ఖండిరచారనేది తెలిసిన విషయమే. ఆయన కూడా తన వ్యాఖ్యలను కొంచెం సవరించుకుని మాట్లాడడం కూడా చూశాం, ఇక్కడ రామకృష్ణ విషయంలో అలాటిది లేకపోగా ఎదురుదాడికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఆవేశంలో ఆయన అన్నారనుకుంటే ఆ చర్చ జరిగిన టీవీ తంబ్‌ నైల్‌ కూడా అదే ఇచ్చి వివాదం పెరగడానికి కారణమైంది. మాలాటి వాళ్లం విమర్శించిన తర్వాత తెలుగులో మార్చి ఇంగ్లీష్ లో మాత్రం ఇంకా అలాగే తల ముక్కలు చేస్తానని కొనసాగించింది. ఈ విమర్శ పైనే రామకృష్ణ కూడా సమర్థించుకుంటూ మాట్లాడారు. మామూలుగానే మీడియాలోనూ సోషల్‌ మీడియాలోనూ వచ్చే వ్యాఖ్యులు చిత్రాలపై దాడి చేయడం ఏపీ పోలీసులకు పరిపాటి గనక నేరుగా ముఖ్యమంత్రినే ఉద్దేశించిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై రంగప్రవేశం చేసి ఆయనను అరెస్టు చేశారు. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు గాని ఆ తరహా భాష మాత్రం ఎవరు వాడినా తప్పేనని చెప్పాల్సి వుంది. పైగా విమర్శ తర్వాత కూడా సవరించుకోకపోగా సమర్థించుకోవడం మరింత దారుణం. ఇప్పుడు ఆయనను అరెస్టు చేసి ఏవో చర్యలు తీసుకోవాలనే దానికంటే ఈ ధోరణిని నివారించేందుకోసం తగు అడుగు వేయడం కీలకం. ఏం జరుగుతుందో చూద్దాం. జాతీయ స్తాయిలోనూ బిజెపి తృణమూల్‌ నేత మధ్య బెంగాల్‌లో ఎలాటి మాటలు నడుస్తున్నదీ చూస్తున్నాం,  

           వాస్తవానికి ఈ వ్యాఖ్య  ఒక్కటే కాదు. ఇటీవలి కాలంలో దూషణలు బెదిరింపు చవకబారు బూతు పదాలు వాడటం రాజకీయ చర్చలను వ్యాఖ్యలను పూర్తిగా కలుషితం చేసింది.  సోషల్‌మీడియాలో ఇలాటి బూతు నిపుణు తిట్ల ప్రవీణలు తయారైనారు. పెద్ద పదాలు వాడితే గాని ప్రచారం రాదనే భావన వీరిది. కావాలని వారిని రెచ్చగొట్టే పార్టీ నేతను గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈ మధ్యనే తెంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయించేందుకు  బిజెపి నేతలు ఒక మైనర్‌ బాలుని ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వాడారని మంత్రి కెటిఆర్‌ తీవ్రంగా హెచ్చరిక చేశారు. దానిపైన కూడా కెసిఆర్‌ ఆనలేదా అని ఎదురు దాడినే చూశాం తప్ప ఆలోచన కనిపించలేదు. అనుచితమైన పదాలు ఎవరు వాడినా తప్పే గాని ఏదో ఒక సందర్భంలో నోరు జారడం వేరు, దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడటం వేరు, మీడియా సంస్థలు ప్రచారం కల్పించడం మరింత దారుణం. పైన చెప్పిన ఉదంతంలో జరిగింది అదే. ఎంత ఎక్కువ తిడితే లేక ఎంత అసభ్యంగా పోస్టు పెడితే అంత గొప్ప అనుకోవడం చాలా పొరబాటు. పోటీపడి బూతులు తిట్టడం తమ వారికి సంబరం కలిగిస్తుందని పార్టీలు ఆలోచిస్తున్నాయే గాని విభేదించే వారిని కూడా ఆకట్టుకునేలా మాట్లాడాలనుకోవడం లేదు.  తల నరకడం వంటి మాట వరకు వెళ్లిన ఈ ధోరణికి  పరాకాష్ట, వీటికి అవకాశం లేకుండా పోవాలంటే ముందు పెద్ద పార్టీ వైఖరి మారాలి.