Site icon NTV Telugu

కృష్ణ భగవాన్ వెటకారమా! ఐతే ఓకే!!

Talented Comedian Krishna Bhagavan Birthday Special

వంశీ దర్శకత్వం వహించిన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ మూవీలో కొండవలస నోటి నుండి పదే పదే వచ్చే డైలాగ్ ‘ఐతే ఓకే’! దీన్ని రాసింది నటుడు కృష్ణ భగవాన్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. నటుడిలో రచయిత ఉంటే… ఆ సంభాషణలు ఎంతగానో పండుతాయనడానికి ఉదాహరణ ఇదే! ఆ మూవీ సక్సెస్ లో కృష్ణ భగవాన్, కొండవలస మధ్య సాగే కామెడీ ట్రాక్ ప్రధాన భూమిక పోషించిందంటే అతిశయోక్తి లేదు. వంశీ ఇచ్చిన ఆఫర్ ను నటుడిగానే కాకుండా కామెడీ ట్రాక్ రైటర్ గానూ సద్వినియోగం చేసుకుని ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశారు కృష్ణభగవాన్. కొందరి వెటకారం… కారంలా ఉండదు! వెన్నపూసలా చల్లగానూ, చిద్విలాసం చిందించేలానూ ఉంటుంది. కృష్ణభగవాన్ దీ అంతే… ఇవాళ ఆ చిలిపి నవ్వుల కృష్ణుడి బర్త్ డే.

1965 జూలై 2 కైకవోలులో జన్మించారు కృష్ణ భగవాన్. ఆయనకు ముగ్గురు అన్నలు, ఒక అక్క. పెదపూడి, కాకినాడ తర్వాత హైదరాబాద్ చేరి డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండీ నాటకరంగంతో ఉన్న అనుబంధంతో, పెద్దన్న మంగరాజు ప్రోత్సాహంతో కృష్ణ భగవాన్ చెన్నయ్ చేరి నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నారు. యుక్తవయసులోనే మైమ్, మిమిక్రీ చేయడంలో అనుభవం ఉండటంతో జంధ్యాల దర్శకత్వం వహించిన ‘శ్రీవారి శోభనం’లో తొలిసారి తెరమీద అలా చటుక్కున మెరిశారు కూడా! కానీ చెన్నయ్ చేరిన తర్వాత ప్రాధాన్యమున్న పాత్ర అంటే వంశీ చిత్రం ‘మహర్షి’లోనే దక్కింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు కృష్ణ భగవాన్. భగ్న ప్రేమికుడిగా మరో కీలక పాత్ర చేసి ‘మహర్షి’ని ఇంటి పేరుగా మార్చుకున్నాడు రాఘవ. ఆ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ భగవాన్ లో మంచి రచయిత కూడా ఉన్నాడని గ్రహించిన దర్శకుడు వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’కు రచన కూడా అతనితోనే చేయించారు. సినిమా సూపర్ హిట్ అయినా… కృష్ణ భగవాన్ కు నటుడిగా, రచయితగా బ్రేక్ రాలేదు. ఖాళీగా ఉండకుండా ఆ సమయంలోనే ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘వసంత కోకిల’ సీరియల్ లో నటించి, రచన చేసి నంది అవార్డును అందుకున్నాడు కృష్ణ భగవాన్. ఆన్ అండ్ ఆఫ్ గా సాగుతున్న సినిమా ప్రయాణంలో బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’. ఆ తర్వాత కృష్ణ భగవాన్ నట ప్రస్థానం సాఫీగా సాగిపోయింది. ఆయనలోని వెటకారాన్ని గుర్తించిన దర్శక నిర్మాతలు కామెడీ ట్రాక్స్ తయారు చేసుకునే బాధ్యత ఆయనకే ఇచ్చారు. దాంతో కృష్ణ భగవాన్ రెచ్చిపోయారు. వెటకారంతో వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించారు. దానికి చిన్నప్పుడు తాగిన గోదారి నీళ్ళు కూడా ఓ కారణమే అంటారు కృష్ణ భగవాన్.

మూడు క్యారెక్టర్స్, ఆరు కామెడీ పాత్రలతో సాగిపోతున్న కృష్ణ భగవాన్ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్’, ‘కుబేరులు’ చిత్రాలలో హీరోతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ఇక ‘జాన్ అప్పారావు 40 ప్లస్’, ‘మిస్టర్ గిరీశం’ చిత్రాలలో హీరోగానూ నటించారు. అయితే… వెటకారంతో జనాలను ఆకట్టుకున్న కృష్ణ భగవాన్ హీరోగా మాత్రం మెప్పించలేకపోయారు. దాంతో తిరిగి తన కామెడీ పాత్రల్లోకి మళ్ళీ వచ్చేశారు. అన్నట్టు ఈ వెటకారం మాస్టర్ అసలు పేరు చెప్పలేదు కదా… మీనవల్లి పాపారావు చౌదరి. ఈ పేరు కాస్తంత ఎబ్బెట్టుగా ఉందని దర్శకుడు వంశీనే ‘మహర్షి’ షూటింగ్ టైమ్ లో దానిని ‘కృష్ణ భగవాన్’ చేసేశారు! అన్నట్టు ఈ మధ్యలో ఈయనకు భక్తి భావం కూడా బాగానే పెరిగింది. రమణమహర్షి, వివేకానంద, షిర్డీ సాయిబాబా గురించిన గ్రంధాల పఠనంలో మునిగిపోతున్నారు. కృష్ణ భగవాన్ తనకు తానుగా రిటైర్ మెంట్ తీసుకోవాలే కానీ ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ ఆయన్ని వదులుకోదు అంటారు తోటి ఆర్టిస్టులు. ఆ మధ్య కాస్తంత అనారోగ్యంతో నడక తగ్గి వేషాలు మందగించాయి కానీ కృష్ణ భగవాన్ లో యాక్టింగ్ కెపాసిటీకి ఢోకా లేదు. ఇప్పటికీ కృష్ణ భగవాన్ కొన్ని సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. త్వరలో థియేటర్లు తెరుచుకోగానే ఏదో ఒక సినిమాలో ఆయన మార్క్ హాస్యాన్ని పండించడం ఖాయం.

(హాస్యనటుడు, రచయిత కృష్ణ భగవాన్ బర్త్ డే)

Exit mobile version