NTV Telugu Site icon

Special Story on RATAN TATA: రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులోనూ.. అదే ఉత్సాహం.. అదే ముందుచూపు..

Ratan Tata

Ratan Tata

Special Story on RATAN TATA: నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మకానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏళ్ల కిందట ఒక ‘స్టార్టప్’గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు ఇప్పుడు గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఊహించని స్థాయికి ఎదిగింది. దీని వెనక సంస్థ వ్యవస్థాకుడు జెమ్ షెట్ జీ టాటా కృషి ఎంత ఉందో ఆయన మునిమనవడు రతన్ టాటా పట్టుదలా అంతే ఉంది. 86 ఏళ్ల వయసులోనూ రతన్ టాటా తనను, తన గ్రూపును రేపటికి సిద్ధం చేస్తున్న తీరు మన దేశానికి నిత్య స్ఫూర్తి అని చెప్పొచ్చు. అందుకే.. ఆయనే ఈవారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ..
YouTube video player

టాటా గ్రూపు.. మొత్తం 10 రంగాల్లో.. 29 లిస్టెడ్ కంపెనీలతో.. దాదాపు 60 అన్-లిస్టెడ్ సంస్థలతో.. వందల సంఖ్యలోని అనుబంధ కంపెనీలతో దేశంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే టాటా గ్రూపును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు లిస్టెడ్ కంపెనీల సంఖ్యను సగానికి అంటే 15కి తగ్గించుకునేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకొని ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. తద్వారా చర్చకు దారితీసింది. రతన్ టాటా సుమారు పదేళ్ల నుంచి టాటా గ్రూపుకి ‘చైర్మన్ ఎమెరిటస్’ అనే గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నారు.

1937లో జన్మించిన రతన్ టాటా 1962లో అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. అదే సంవత్సరం ఐబీఎం కంపెనీ ఆఫర్ ను తిరస్కరించి టాటా గ్రూపులోకి ప్రవేశించారు. ఏకంగా 50 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సంస్థను ముందుండి నడిపారు. టాటా గ్రూపులో తొలిసారి టాటా స్టీలుకి సంబంధించిన ఇనప లోహాన్ని కరిగించే కొలిమిని హ్యాండిల్ చేశారు. తర్వాత పదేళ్లపాటు వివిధ కంపెనీల్లో చేసి 1971లో ‘డైరెక్టర్-ఇన్ఛార్జ్’గా ప్రమోషన్ పొందారు. 1991 నుంచి 2012లో రిటైర్ అయ్యే వరకు 21 ఏళ్ల పాటు చైర్మన్ గా చేశారు. రతన్ టాటా హయాంలోనే టాటా గ్రూపు టర్నోవర్ అనేక రెట్లు పెరిగి 2011-12 ఆర్థి సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం.

రతన్ టాటా 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ అయ్యారు. రెండేళ్లు తిరిగే సరికి.. 1983లో సాల్ట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తొలిసారిగా ఐయోడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టారు. ‘‘టాటా నామక్.. దేశ్ కా నామక్’’ ప్రచారంతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నారు. మరో మూడేళ్లలో.. 1986లో ఎయిర్ ఇండియా చైర్మన్ అయ్యారు. ఇంకో ఐదేళ్లలో అంటే 1991 నాటికి మొత్తం టాటా గ్రూపుకే చైర్మన్ గా పూర్తి పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నారు. 1999లో టాటా మోటార్స్ ను ఫోర్డ్ మోటార్స్ కు విక్రయించాలన్న రతన్ టాటా ప్రయత్నం ఫలించలేదు.

అయితే.. ఇది తర్వాతి కాలంలో టాటా గ్రూపుకి టాటా ఇండికా అనే కారు రూపంలో బాగా కలిసి రావటం యాధృచ్ఛికమని చెప్పొచ్చు. 2000 సంవత్సరంలో రతన్ టాటాను పద్మభూషణ్ పురస్కారం వరించింది. అదే ఏడాది టాటా టీ.. బ్రిటన్ కి చెందిన టెట్లీ గ్రూపును అక్వైర్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ బ్రాండ్ గా పేరొందింది. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగుకి వెళ్లింది. అనంతరం ఒక బిలియన్ డాలర్ల రెవెన్యూ మార్క్ ని దాటిన మొట్టమొదటి ఇండియన్ ఐటీ కంపెనీగా అరుదైన ఘనత సాధించింది. రెం

డేళ్ల తర్వాత.. 2006లో రతన్ టాటా.. టాటా స్కై పేరుతో డీటీహెచ్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇది ఇప్పుడు ఈ సెక్టారులో లీడరుగా నిలిచింది. మరో రెండేళ్ల అనంతరం.. 2008లో అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ ని దివాళా దశ నుంచి గట్టెక్కించింది. ఆ సంస్థకు చెందిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ని అక్వైర్ చేసుకుంది. తద్వారా ఇండియా పేరును అంతర్జాతీయ స్థాయిలో చాటినందుకు రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2009లో రతన్ టాటా సామాన్యుల కోసం లక్ష రూపాయలకే నానో పేరుతో చీపెస్ట్ కారును లాంఛ్ చేశారు. 2010లో 50 బిలియన్ డాలర్లను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కి డొనేట్ చేశారు.

రతన్ టాటా 1975లో ఇదే స్కూల్లో అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. రతన్ టాటాపై గౌరవంతో స్కూల్ మేనేజ్మెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ సెంటర్ కి ఆయన పేరు పెట్టడం చెప్పుకోదగ్గ విషయం. రతన్ టాటా 2012లో టాటా గ్రూపు నుంచి రిటైర్ అయ్యారు. కానీ.. ‘‘చైర్మన్ ఎమెరైటిస్’’ అనే గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నారు. 2014లో ఐఐటీ బాంబే చరిత్రలోనే అత్యధిక డొనేషన్ చేశారు. ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటుకు 95 కోట్ల రూపాయలు దానం చేశారు. 2022లో అంటే ఈ సంవత్సరం ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయటం ద్వారా దాన్ని 69 ఏళ్ల తర్వాత తిరిగి టాటా గ్రూప్ చేతికే తీసుకురావటం రతన్ టాటా నాయకత్వ సామర్థ్యానికి తాజా నిదర్శనం.

చంద్రుడికైనా చిన్న మచ్చ ఉందంటారు. అలాగే.. నీతికి, నిజాయితీకే కాకుండా నైతిక విలువలకు, దానధర్మాలకు పెట్టింది పేరైన రతన్ టాటాకు కూడా ఇలాంటి ఒక చిన్న మచ్చ సైరస్ మిస్త్రీ రూపంలో పడటం ‘‘విధి’’ అనుకోవచ్చు. టాటా సన్స్ కి, సైరస్ మిస్త్రీకి మధ్య తలెత్తిన వివాదాలు కోర్టుల్లో పరిష్కారమైనప్పటికీ ‘‘టాటా గ్రూపు కోడ్ ఆఫ్ కండక్ట్’’పై అప్పట్లో నీలినీడలు, అనుమానాలు కమ్మాయనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. వయసు మీద పడటంతో రతన్ టాటా శారీరకంగా కాస్త ఒంగిపోయారేమో గానీ తన కంపెనీని ఎప్పుడూ తలెత్తుకునేలాగే చేశారు. ఎప్పటికప్పుడు రేపటికి సిద్ధమవుతూనే ఉన్నారు. 86 ఏళ్ల వయసులోనూ దేశానికి నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Show comments