NTV Telugu Site icon

Special Story on Electric Vehicles: విద్యుత్‌ వాహనాల వెలుగుల వెనక దాగిన నిజాలు

Special Story On Electric Vehicles

Special Story On Electric Vehicles

Special Story on Electric Vehicles: ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌పై చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఈ విద్యుత్‌ వాహనాల వినియోగం మన దేశంలో ఎలా ఉంటుంది?. ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం బారినపడిన దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. వాహనాల ద్వారా వెలువడిన కాలుష్యం. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి.. బీఈవీ. అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌. ఇది పేరుకు తగ్గట్లుగానే బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. రెండోది.. ఎఫ్‌సీఈవీ. అంటే.. ఫ్యూయెల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌. అసలు ఇండియాలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ఎలా మొదలైంది? వాటి భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ప్రత్యేక కథనం..

మన దేశంలో మొదటి విద్యుత్‌ వాహనాన్ని స్కూటర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ 1996లో తయారు చేసింది. ఆ త్రీ వీలర్‌ని ‘విక్రమ్‌ సఫా’ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు 400 వాహనాలను విక్రయించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బీహెచ్‌ఈఎల్‌ 18 సీట్లున్న ఎలక్ట్రిక్‌ బస్సును రూపొందించింది. 2001లో బెంగళూరుకు చెందిన రెవా అనే సంస్థ కూడా ఈవీ కార్ల ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అమెరిగాన్ అనే అమెరికన్ కంపెనీ డెవలప్ చేసిన దాదాపు 3200 కార్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. వాటిలో సుమారు 1500 కార్లు ఇండియాలోనే అమ్ముడుపోయాయి. అత్యధికంగా బెంగళూరులో సేల్ అయ్యాయి. అనంతరం 2013లో ఇండియా ‘నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌-2020’కి రూపకల్పన చేసింది.

నేషనల్‌ ఎనర్జీ సెక్యూరిటీని, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచటం, వాహన కాలుష్యాన్ని తగ్గించటం వంటి లక్ష్యాలతో ఈ ప్రణాళికను తీసుకొచ్చారు. ప్రతిదాంట్లోనూ అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నట్లే ఈ విద్యుత్‌ వాహనాల వల్ల కూడా లాభనష్టాలు ఉన్నాయి. ముందుగా లాభాలేంటో చూద్దాం. అవి.. తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. రిపేర్లకు అవకాశం తక్కువ. పెట్రోల్‌, గ్యాస్‌ అవసరం లేదు. మెయింటనెన్స్‌ ఖర్చు కూడా చాలా తక్కువ. ఎలాంటి ఎమిషన్సూ ఉండవు. కాబట్టి దానివల్ల పొల్యూషన్‌కి అవకాశంలేదు. శబ్ద కాలుష్యమూ ఉండదు. ప్రస్తుతం ఇండియాలో ప్రతి వెయ్యి మంది జనాభాలో 80 మందికి సొంత కార్లు ఉన్నాయి. అందులోనూ ఎక్కువ మంది ఫ్యూయెల్‌ బేస్ కార్లు ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉన్న నేపథ్యంలో దీనికి చెక్‌ పెట్టేందుకు 2030 నాటికి 30 శాతం ఈవీ కార్లు, 80 శాతం ఈవీ టూ వీలర్లు, 70 శాతం ఈవీ కమర్షియల్‌ వెహికిల్స్‌ ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా 1 గిగా టన్‌ కార్బన్‌డైఆక్సైడ్‌ ఎమిషన్స్‌ తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు ఆయిల్‌ ఇంపోర్ట్స్‌ని తగ్గించటం ద్వారా 330 బిలియన్‌ డాలర్ల ఖర్చు తగ్గించుకోవచ్చని ఆశించింది. భవిష్యత్‌లో మన దేశంలో విద్యుత్‌ వాహనాలను మాత్రమే నడపాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. రానున్న రోజుల్లో పొల్యూషన్‌ ఫ్రీ ఇండియాను, ఆయిల్‌ దిగుమతి చేసుకోవాల్సిన అవసరంలేని పరిస్థితులను చూడాలన్నదే తన ఉద్దేశమని నీతి ఆయోగ్‌ సీఈఓ అమిత్‌కాంత్‌ ఆకాంక్షించారు.

CM Jagan Nellore Tour: నేడు సీఎం జగన్ నెల్లూరు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

పెద్ద పెద్ద భవనాలు, ఆసుపత్రులు, మాల్స్‌, కమర్షియల్‌ బిల్డింగులు, రెసిడెన్షియల్‌ ఏరియాల్లో విద్యుత్‌ వాహనాల కోసం ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలని సూచించారు. దీనివల్ల విద్యుత్‌ వాహనాలు పెద్ద సంఖ్యలో వాడుకలోకి వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీని భారీగా తగ్గించింది. మొదట్లో విద్యుత్‌ వాహనాలకు 28 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. తర్వాత 18 శాతానికి, అనంతరం 12 శాతానికి, చివరికి 5 శాతానికి తగ్గించారు. దీనివల్ల దేశంలోని పలు పట్టణాల్లో ఎలక్ట్రిక్‌ రిక్షాలు, త్రీ వీలర్లు, టూ వీలర్లు వాడుకలోకి వచ్చాయి. ఓలా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టూవీలర్‌ ఫ్యాక్టరీని 3000 రోబోలతో, 500 ఎకరాల విస్తీర్ణంలో మన దేశంలోని తమిళనాడులో ఏర్పాటుచేసింది. ఈ వాహనాలు కార్బన్‌ నెగెటివ్‌ ఫ్రీ, మోస్ట్‌ సస్టెయినబుల్‌గా ఉండబోతున్నాయని ప్రకటించారు.

ఈ ఫ్యాక్టరీలో ఏటా పది లక్షలకు పైగా వాహనాలను తయారుచేస్తామని చెప్పారు. దీంతో చాలా మంది ఈవీల కోసం ప్రీబుకింగ్స్‌ చేసుకున్నారు. అయితే.. అవి చాలా వరకు ఇప్పటికీ డెలివరీ కాలేదు. డెలివరీ అయిన వెహికిల్స్‌లో కూడా పలు లోపాలు బయటపడ్డాయి. ఇండియాలోని ఫోర్‌ వీలర్‌ సెగ్మెంట్‌లో 70 శాతం వాటా.. టాటా మోటార్స్‌దే. కానీ వాళ్లు 2021లో పది వేల వాహనాలను మాత్రమే అమ్మగలిగారు. ఫ్యూయెల్‌ బేస్‌ సెగ్మెంట్‌లో టాటా మోటర్స్‌ షేర్‌ 13 నుంచి 14 శాతం మాత్రమే ఉన్నా ఆ వాహనాలను మాత్రం ఏడాదిలో 3 లక్షలకుపైగా అమ్మగలిగారు. మార్కెట్‌లో కార్లను విక్రయించే కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నా, ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నా, నిధులు కూడా భారీగానే అందుబాటులో ఉన్నా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి ఇండియాలో పెద్దగా ఆదరణ లభించట్లేదు.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ బ్యాటరీల సాయంతో నడుస్తాయి. ఆ బ్యాటరీలను లిథియం, కోబాల్ట్‌తో తయారుచేస్తారు. బ్యాటరీలకు స్టెబిలిటీ కోసం, వాహనాలను సేఫ్‌గా నడిచేందుకు కోబాల్ట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ మెటల్‌ 70 శాతం ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో దిగుమతి అవుతుంది. అక్కడ ఉన్న మొత్తం 92 మిలియన్‌ల జనాభాలో 2 మిలియన్‌ల మంది ఈ కోబాల్ట్‌ ఉత్పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గనుల యజమానులు ఎక్కువగా పిల్లలతో, మైనర్లతో ఈ పనులు చేయిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మాస్కులు, గ్లౌవ్స్‌, ఇతర రక్షణ పరికరాలులేని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోంది. దీంతో వాళ్లు చిన్న చిన్న సొరంగాల్లోకి వెళుతూ మృత్యువాత పడుతున్నారు. కోబాల్ట్‌ సప్లై చైన్‌లో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

కాంగోలోని మొత్తం 19 గనుల్లో 15 గనులు చైనావే. ప్రస్తుతం కోబాల్ట్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరగటంతో ఇంకెంత మంది బాలకార్మికులు దీనికి బలవుతారో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు.. ఈ ఎలక్ట్రానిక్‌ వెహికిల్స్‌లోని లోపాలను, వాటిని అధిగమించే మార్గాలను చూద్దాం. టెస్లా వంటి విదేశీ విద్యుత్‌ కారు రేటు 60 నుంచి 70 లక్షల వరకు ఉంది. దీనికితోడు ఇండియాలో ఈ వాహనాల తయారీ గానీ అసెంబ్లింగ్‌ గానీ లేకపోవటంతో దిగుమతి సుంకాలను చెల్లించాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు ఈ ఎలక్ట్రిక్‌ కార్లను కొనే పరిస్థితుల్లో లేరు. ఇండియాలో ఈవీ కార్ల తయారీని చేపట్టడంతో ఈ సమస్య పరిష్కారమైంది. ఈవీలు నగరాల్లో మాత్రమే నడపటానికి వీలుగా ఉంటున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఛార్జింగ్‌ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలియక సమస్యలు ఎదురవుతున్నాయి.

మన దేశం మొత్తమ్మీద ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు రెండు వేల లోపు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈవీలను కొనాలని, వాటిలో దూర ప్రాంతాలకు వెళ్లాలని ఎవరైనా అనుకుంటారా?. అందుకే.. రానున్న రోజుల్లో పెద్ద పెద్ద భవనాలు, ఆసుపత్రులు, మాల్స్‌, కమర్షియల్‌ బిల్డింగులు, రెసిడెన్షియల్‌ ఏరియాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలనే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోంది. విద్యుత్‌ వాహనాలు బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి కాబట్టి కొన్నిసార్లు మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. వాటిని లిథియంతో తయారుచేస్తారని ముందే చెప్పుకున్నాం కదా. ఈ బ్యాటరీలను అతి శీతల ప్రదేశంలో గానీ ఎక్కువ వేడి ఉండే ప్రాంతంలో గానీ ఉంచితే వాటి లైఫ్‌టైమ్‌ తగ్గిపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్తవి కొనాల్సిందే తప్ప పాతవాటిని తిరిగి ఉపయోగించే అవకాశంలేదు. దీంతో బ్యాటరీల కొనుగోలుకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

తయారీదారులు బ్యాటరీలను చిన్న చిన్న సెల్స్‌గా సపరేట్‌ చేసి వాటికి ఫైర్‌ వాల్స్‌ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మంటలు వ్యాపించే ప్రమాదం తగ్గుతుంది. సాధారణంగా ఈవీ బ్యాటరీ పదేళ్లపాటు ఉంటుంది. కానీ ప్రతి సంవత్సరం దాని సామర్థ్యం 2.3 శాతం తగ్గిపోతుంది. దీనివల్ల పెద్దగా సమస్యేమీ ఉండదు. అంతకుముందులాగే మామూలుగానే మనం డ్రైవ్‌ చేయొచ్చు గానీ దాని రేంజ్‌ మాత్రం ఏటా తగ్గుతూ వస్తుంది. విద్యుత్‌ వాహనాల నుంచి పొగ రాదు కాబట్టి పొల్యూషన్‌ ఫ్రీ అనుకుంటారు గానీ అది నిజం కాదు. వాస్తవానికి విద్యుత్‌ అనేది కూడా క్లీన్ ఫ్యూయెల్‌ కాదు. ఎలక్ట్రిసిటీ 80 శాతం థర్మల్‌ ఎనర్జీయే. బొగ్గును మండించటం ద్వారా ఉత్పత్తి అవుతుంది. 10 కన్నా తక్కువ శాతం విద్యుత్‌ సోలార్‌, విండ్‌ పవర్‌ నుంచి వస్తుంది. ఈవీ బ్యాటరీలు డిస్పోజబుల్‌ కాదు. వాటి నుంచి ఉత్పత్తయ్యే టాక్సిక్‌ యాసిడ్‌ పర్యావరణానికి హానికరం.

వాహనం నడిపితే వచ్చే కాలుష్యం, వాటి తయారీలో వచ్చే కాలుష్యం రెండూ ఒకటే. కానీ.. ఫ్యూయెల్ బేస్డ్‌ వాహనాలతో పోల్చితే ఈవీల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. అయినప్పటికీ ఇవన్నీ ప్రపంచానికి వ్యర్థాలను సృష్టించేవే. భవిష్యత్‌లో రేర్‌ ఎర్త్‌ మెటీరియల్స్‌ ఆధారంగా పనిచేసే వాహనాలే రూపొందించాలని, తద్వారా వాటిని తిరిగి వాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు పరిష్కార మార్గంగా సూచిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్‌ వాహనాలు కావాల్సిందే. అందుకే ప్రభుత్వం ఈ దిశలో ఎదురవుతున్న లోటుపాట్లను పరిష్కరించే ఆలోచనలు చేస్తోంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ కారణాలన్నింటి రీత్యా ప్రజలు ప్రస్తుతం ఈవీలకు అలవాటుపడే పరిస్థితుల్లో లేరనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.