(డా. మంగళంపల్లి జయంతి సందర్భంగా)
మధుర మంగళ నాదమణులకు తళుకులద్దిన స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత సారాలను ఒడిసిపట్టిన విద్వన్మణి ఆయన. నటుడిగా, వాగ్గేయకారుడిగా, సినీ సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నూతన రాగాల సృష్టికర్తగా, వయొలిన్ విద్వాంసునిగా బహుముఖ ప్రజ్ఞ కనబరించిన గొప్ప వ్యక్తి. అన్నింటినీ మించి ఆయన సరస్వతీ దేవి గారాల బిడ్డ. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూక శంకరగుప్తంలో 1930 /జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఏడేళ్ల వయస్సులోనే కచేరీకి వేదికనెక్కి బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జన్మించిన 15వ రోజు తల్లి కన్నుమూశారు. మగపిల్లవాడు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నారు. అందరూ అలానే పిలిచారు. ఓ వేదికపై హరికథ భాగవతులు బాలమురళీకృష్ణ అని పేర్కొనడంతో ఆ పేరు స్థిరపడింది. ఆరవ తరగతి పరీక్ష తప్పడంతో స్కూలు చదువు అటకెక్కింది. చిత్రం ఏమంటే… ఆ తర్వాత ఆ గాన కళానిధి స్వరజ్ఞానానికి తలవొగ్గి వివిధ విశ్వవిద్యాలయాలు 12 గౌరవ డాక్టరేట్లను ఇచ్చాయి. బాల మురళీకృష్ణకు పారిపల్లి రామకృష్ణ పంతులు గురువు. వారి తండ్రికీ ఆయనే గురువు కావడం మరో విశేషం. వీణ, వయోలిన్, మృదంగం, కంజీర లాంటి వాయిద్యాల్లో కూడా బాల మురళీకృష్ణ ప్రజ్ఞాశాలిగా భాసిల్లారు. 1939 నుంచి దాదాపు జీవిత చరమాంకం వరకూ కచేరీలు చేస్తూనే ఉన్నారు. మంగళంపల్లి చాలా యేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేశారు. బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా ఆయనే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ తర్వాత మద్రాసుకు మకాం మార్చారు.
బాల మురళీకృష్ణ ప్రయోగశీలి. నేటి ప్రయోగం రేపటికి సంప్రదాయం అవుతుందనేది ఆయన విశ్వాసం. కొత్త రాగాలకు, తాళాలకు ఆయన జన్మనిచ్చారు. గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి వంటి సరికొత్త రాగాలను సృష్టించి సంగీతబ్రహ్మగా ఖ్యాతి గడించారు. 72 మేళకర్తలతో కృతులు రచించారు. తెలుగు, కన్నడ, సంస్కృతాలలో కృతులు రాసి త్యాగరాయ కీర్తనలతో పాటు వాటినీ గానం చేశారు. అలా ఆయన కూడా వాగ్గేయకారుల జాబితాలో చేరిపోయారు. నదీనదాలను సాగరం తన గర్భంలో దాచుకున్నట్టు బాల మురళీకృష్ణ హిందుస్థానీ, కర్ణాటక, లలిత సంగీతాలను తనలో నింపుకున్నారు. బెంగాలీలో పాడి వంగదేశీయుల మెప్పును పొందారు. హిందుస్థానీలో గానం చేసి ఉత్తరాది వారి మదిని పులకింప చేశారు. తన జీవితకాలంలో వివిధ దేశాలలో 25 వేలకు పైగా కచేరీలు చేశారు.
ఇక చిత్రసీమలో ఆయన స్థానం ప్రత్యేకమైంది. ‘సతీసావిత్రి’ (1957) చిత్రం ద్వారా బాలమురళీకృష్ణ గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. ఆ చిత్రానికి ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. సుప్రసిద్ధ నటి, గాయని ఎస్. వరలక్ష్మి ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ‘భక్త ప్రహ్లాద’ (1967) చిత్రంలో బాల మురళీకృష్ణ నారదుడి పాత్రను పోషించడంతో పాటు అందులో అద్భుతమైన మూడు పాటలను పాడారు. ఆయన పాడిన సినిమా గీతాలు ఆయన గంభీర స్వరంలో, గమకాల గమనంలో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ‘నీవూ నేనూ వలచితిమీ’ (కర్ణ), ‘సలలిత రాగ సుధారస సారం’ (నర్తనశాల), ‘వసంతగాలికి వలపులు రేగ’ (శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ), ‘తిరుపతి వాసా…’ (దొరికితే దొంగలు), ‘ఏటిలోని కెరటాలు… ‘ (ఉయ్యాల జంపాల), ‘పలుకే బంగారమాయెనా అందాల రామా’ (అందాల రాముడు), ‘మేలుకో శ్రీరామా…’ (శ్రీరామాంజనేయ యుద్ధం), ‘శ్రీరామ జయరామ సీతారామా..’ (ముత్యాలముగ్గు), ‘ఆడవే హంసగమనా..’ (శ్రీమద్విరాట పర్వం), ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా..’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కళ్యాణిగా..’ (మేఘసందేశం), ‘జాతకాలు కలిసే వేళా…’ (ప్రియమైన శ్రీవారు) లాంటి పాటలు ప్రేక్షకుల ప్రశంసల్ని పొందాయి. ‘ఆది శంకరాచార్య’, ‘భగవద్గీత’ (సంస్కృతం) చిత్రాలకు సంగీతం అందించారు. కన్నడ చిత్రం ‘హంసగీతె’లో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా, ‘మధ్వాచార్య’కు 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అకాడమీలను రద్దు చేయడంతో కోపగించిన మంగళంపల్లి కొన్నేళ్ళ పాటు తెలుగునాట కచేరీలు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆరే తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను తెలుగు గడ్డపైకి పిలిచి, సత్కరించడంతో ఊరట చెందారు బాలమురళీకృష్ణ. విశేషం ఏమంటే… కర్ణాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్… ఇలా మూడు జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. మధుర, మనోజ్ఞ, మంగళ నాదాల శిరోమణి మంగళంపల్లి బాల మురళీకృష్ణ తన 86వ యేట (22 నవంబర్ 2016) చెన్నయ్ లో కన్నుమూశారు. ఆ సుస్వర మహర్షి భౌతికంగా దూరమైనా తన కీర్తనలు, పాటలతో సంగీత ప్రియుల హృదయసీమలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
