NTV Telugu Site icon

ముళ్ళపూడి ‘చిత్ర’రచన

Remembering Legendary Story and Screenplay Writer Mullapudi Venkata Ramana on his birth anniversary

(జూన్ 28న ముళ్ళపూడి వెంకటరమణ జయంతి)
ముళ్ళపూడి వెంకటరమణ రచన పలు చిత్రాలను విజయమార్గం పట్టించింది. చిత్రసీమలో అడుగు పెట్టకముందే ముళ్ళపూడి వారి కలం బలం తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే! సినిమా రంగంలో అడుగు పెట్టాక ముళ్ళపూడివారికి సుందర్ లాల్ నహతా, డూండీ కాంపౌండ్ లో చోటు దక్కింది. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాశమలర్’ చిత్రాన్ని తెలుగులో యన్టీఆర్, సావిత్రితో ‘రక్తసంబంధం’గా రీమేక్ చేశారు. ఈ రీమేక్ సినిమాతోనే ముళ్ళపూడి వారి రచన చిత్రసీమలో మొదలయింది. తెలుగులో ‘రక్తసంబంధం’ అఖండ విజయం సాధించింది. నిజానికి మాతృకలో లేని కొన్ని సన్నివేశాలను ముళ్ళపూడి వారే రూపొందించి, నవ్వులు పూయించారు. అలా ముళ్ళపూడి వారు తొలి చిత్రంతోనే తన సత్తా ఏంటో చాటుకున్నారు. దాంతో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు , ముళ్ళపూడివారిలోని పట్టు కనిపెట్టేశారు. తన దగ్గర చేర్చుకొని మరింత సాన పట్టేశారు. ఆదుర్తి దర్శకత్వంలో రూపొందిన “మూగమనసులు, దాగుడుమూతలు, తేనెమనసులు, కన్నెమనసులు, పూలరంగడు” చిత్రాలకు ముళ్ళపూడి కథను సమకూర్చారు. ‘మూగమనసులు’కు ఆచార్య ఆత్రేయతో కలసి కథ, మాటలు అందించిన ముళ్ళపూడి తొలిసారి సోలో కథకునిగా ‘దాగుడుమూతలు’ రాశారు. అందిన చోట కథను అందిస్తూ, పొందిన చోట మాటలు పొందుపరుస్తూ మొత్తానికి అందరినీ అలరిస్తూ సాగారు ముళ్ళపూడి. ఇక మిత్రుడు బాపు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘సాక్షి’కి సైతం ముళ్ళపూడి కలం భలేగా పనిచేసింది. ‘సాక్షి’ పలు పసందైన పదాలను తెలుగువారి ముందు పరిచింది.

బాపూరమణీయం…
బాపు చిత్రసీమలో అడుగుపెట్టాక, ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతీ చిత్రానికి ముళ్ళపూడి రచన సాగింది. బాపు హిందీలో తెరకెక్కించిన చిత్రాలకు సైతం ఏదో ఒక రీతిన ముళ్ళపూడి చేయి చేసుకొనేవారు. అలా బాపు, రమణ మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ ‘బాపూరమణీయం’ సాగింది. చిత్రసీమలో స్నేహం అన్న మాట వినిపించిన ప్రతీసారి ఈ ఇద్దరు మిత్రుల పేర్లు వినిపించక మానవు. వారిద్దరి కలయికలో రూపొందిన “బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతాకళ్యాణం, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, రాధా కళ్యాణం, త్యాగయ్య, పెళ్ళీడు పిల్లలు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీరామరాజ్యం” వంటి చిత్రాలలోని మాటలు భలేగా అలరించాయి. ఈ చిత్రాలలో కొన్ని సూపర్ హిట్స్ గానూ, మరికొన్ని హిట్స్ గానూ, ఇంకొన్ని ఫట్స్ గానూ మిగిలాయి. అయితేనేమి, ముళ్ళపూడి పలికించిన పదాలు మాత్రం తెలుగు ప్రేక్షకుల పెదాలపై నాట్యం చేశాయనే చెప్పాలి.

అదీ రమణ వ్యక్తిత్వం!
ముళ్ళపూడి రచనలో చిత్రవిచిత్రమైన పదాలూ కొన్నిసార్లు తకధిమితై అంటూ ఆటాడాయి. ‘తీ.తా.’ అంటే ‘తీసేసిన తాసిల్దారు’ అని, ‘సెగట్రీ’ అంటూ ‘సెక్రటరీ’ని మాండలికంలోకి మార్చడమేనని, అమ్మాయిల మనసు అద్దం లాంటిదని, అబ్బాయిలు మది ఎప్పుడూ కోతి కొమ్మచ్చి ఆడుతూనే ఉంటుందని – ఇలా పలు విధాలా ముళ్ళపూడివారు నవ్వించి, కవ్వించారు. ఆయన అందరితోనూ మనసు విప్పి మాట్లాడేవారు. అందరితోనూ మంచిగానే మసలుకొనేవారు. రమణ రాసే మాటల్లాగే ఆయన చేతలు కూడా ఉండేవి. అయితే ఒక్కసారి మనసు నొచ్చుకుంటే, ఇక ఆ దరిదాపుల కనిపించేవారు కారు. ‘అన్నపూర్ణ పిక్చర్స్’ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుతో ముళ్ళపూడికి ఎంతో చనువు ఉండేది. అయితే ‘పూలరంగడు’ సమయంలో జరిగిన ఓ చిన్న పొరపాటుకు, ముళ్ళపూడి మనసు నొచ్చుకుంది. ఎంతో అనుబంధం ఉన్నా ఆ సంస్థకు ఆ తరువాత మళ్ళీ రచన చేయలేదు. చాలా రోజుల తరువాత ఆ సంస్థలో బాపు ‘పెళ్ళీడు పిల్లలు’ తీసినప్పుడు, రమణ కూడా కలం కదిలించారు. స్నేహం స్నేహమే, పంతం పంతమే అన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అలాగని ఎవరిపైనా పగలు పెంచుకొనడం ఆయనకు తెలియని విద్య. ఓ టాప్ హీరోకు పాతిక లక్షలకు పూచి పడి, అతను డబ్బు కట్టకపోయినా, హైదరాబాద్ లోని తన ఇంటిని అమ్మేసి అప్పు తీర్చారు. ఆ తరువాత కూడా ఆ అగ్రకథానాయకుడు ముళ్ళపూడి వారి డబ్బు వెనక్కి ఇచ్చింది లేదు. పైగా, అది తన పారితోషికం కింద జమా వేసుకున్నానని చెప్పారు. నిజానికి సదరు హీరోకు ఆ సమయంలో అంత మొత్తం ఎవరూ ఇచ్చింది లేదు. అయినా, ఏ రోజునా ఆ నటుని గురించి ముళ్ళపూడి చెడుగా చెప్పలేదని సన్నిహితులు చెబుతారు. అదీ ముళ్ళపూడి వారి వ్యక్తిత్వం!

బంధాలు… అనుబంధాలు…
బాపు-రమణ చిత్రసీమలో పలు కొత్త పోకడలకు దారి తీశారు. ముఖ్యంగా రమణ రచనకు తగ్గట్టుగా బాపు ఫ్రేమ్స్ పెట్టి, మరీ సినిమా తెరకెక్కించేవారు. ఆరంభంలో ఏయన్నార్ మనుషులుగా గుర్తింపు పొందిన వీరు తరువాతి రోజుల్లో యన్టీఆర్ నూ ఆకర్షించగలిగారు. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మిత్రులిద్దరి చేతనే ‘వీడియో పాఠాలు’ రూపొందించడం విశేషం. ఆయన హయాములోనే ఈ మిత్రులిద్దరికీ ‘గౌరవ డాక్టరేట్’ లభించడమూ గుర్తుంచుకోతగ్గ అంశం. యన్టీఆర్ తో ముళ్ళపూడి రచనకు విడదీయరాని బంధం ఉందని చెప్పాలి. యన్టీఆర్ ‘రక్తసంబంధం’తోనే ముళ్ళపూడి చిత్రసీమలో ప్రవేశించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘దాగుడుమూతలు’కే ముళ్ళపూడి సోలోగా తొలిసారి కథను అందించారు. ఇక యన్టీఆర్ నటించిన ‘కథానాయకుడు’ సినిమాకు బంగారు నంది లభించింది. ఈ చిత్రానికీ కథను సమకూర్చింది ముళ్ళపూడియే! రామారావు చివరి చిత్రంగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’కు కూడా ముళ్ళపూడి రచన చేయడం విశేషం. యన్టీఆర్ సినిమాతో చిత్రసీమలో ప్రవేశించిన ముళ్ళపూడి, ఆయన చివరి చిత్రానికీ రచన చేయడం విశేషం కాక మరేమిటి? మరో విశేషమేమిటంటే, బాపురమణ తెరకెక్కించిన చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’. అందులో యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ కథానాయకుడు. మరోవిశేషమేంటంటే, యన్టీఆర్ మనవడు జూ.యన్టీఆర్ నటించిన ‘నా అల్లుడు’కు ముళ్ళపూడి తనయుడు వర ముళ్ళపూడి దర్శకుడు. ఇలా నందమూరి నటవంశంతో ముళ్ళపూడి వారిది విడదీయరాని బంధమనే చెప్పాలి.