Online Dating App Scam: అప్పుడెప్పుడో 1951లో రిలీజ్ అయిన ‘పాతాళభైరవి’ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుల్లోని యువతకు సరిగ్గా సరిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ అవుతుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా.. “ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు”. ఈ పాటను పి.నాగేశ్వరరావు రచించగా, వి.జె. వర్మ (ఘంటసాల) పాడారు. ఈ పాట పసివాడి అమాయకత్వాన్ని, ప్రేమలో పడే కష్టాలను తెలుపుతుంది.
ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు…
అయ్యో పాపం పసివాడు..
READ ALSO: Kane Richardson: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ ఛాంపియన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్..
అచ్చంగా ఈ లిరిక్స్ ఇప్పటి తరానికి సూపర్‌గా సరిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన తెగ వినిపిస్తున్న పేరు ఆన్‌లైన్ డేటింగ్ యాప్. ఈ యాప్‌లను మీరు కూడా ఉపయోగిస్తుంటే.. ఇప్పుడు మనం చర్చించబోయే వార్త మీకు గొప్ప పాఠంగా మారవచ్చు.
నేడు బెంగళూరు, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో “రెస్టారెంట్ డేటింగ్ మోసాల” ముప్పు విపరీతంగా పెరిగింది. ఆశపడి పరిచయం పెంచుకుందామని డేటింగ్‌కు వెళ్లే పురుషులను రూ.2 వేలకు బదులుగా రూ.20 వేలు నుంచి రూ.50 వేల వరకు బిల్లు వేసి మోసం చేస్తున్నారు. కొందరు చాలా తెలివిగా, పకడ్బందీగా ఈ స్కామ్‌ను చేస్తున్నారు. కొన్ని ముఠాలు ఆకర్షణీయంగా కనిపించే మహిళల ద్వారా డేటింగ్ యాప్‌లలో పురుషులను సంప్రదిస్తూ.. కొంచెం ముద్దుగా మాట్లాడిన తర్వాత, ఆ మహిళ స్వయంగా కలవాలని ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత తనని ఒక నిర్దిష్ట కేఫ్ లేదా బార్‌లో కలవాలని పట్టుబడుతోంది. నిజానికి ఆ ప్రదేశాలు.. మోసం చేయడానికి ప్లాన్ చేసిన రెస్టారెంట్ యజమాని – మహిళలకు చెందిన ప్లేస్‌లు.
ముద్దు మాటలకు మురిసిపోయి.. రెస్టారెంట్‌కు వచ్చిన పురుషులను, రమ్మని ఆహ్వానించిన ఆ మహిళ వచ్చిన తర్వాత.. ఆ వ్యక్తిని ఏమాత్రం అడగకుండానే మెనూలోని అత్యంత ఖరీదైన మద్యం, హుక్కా, ఫుడ్‌ను ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇలాంటి కిలేడీలు ఆర్డర్ చేసే వస్తువుల ధరలు మెనూ కార్డులలో కనిపించవు. ఇవేమీ తెలియని ఆ వ్యక్తి తనను మెచ్చిన అందమైన లేడీతో మాట్లాడుతూ.. భోజనం పూర్తి చేస్తాడు. అప్పుడు సైలెంట్‌గా తాకుతుంది ఫస్ట్ షాక్.. అది ఏమిటంటే.. తనతో డేట్‌కు వచ్చిన ఆ మహిళ “అత్యవసర కాల్” లేదా “ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు” అని చెబుతూ అక్కడి నుంచి ఉన్నట్లుండి మాయం అవుతుంది. చేసేది లేక బిల్ చూస్తే.. చుక్కలు కనిపిస్తాయి. గంట ముచ్చటకు ఆశపడి వస్తే.. నెల జీతం హాంఫట్ అవుతుంది. ఇదండీ కథ. వాస్తవానికి ఇది కథ కాదు.. చాలా మంది పెళ్లి కానీ ప్రసాదుల వ్యథ. ఇటీవల బెంగళూరు పోలీసులు ఇలాంటి అనేక కేసులను ఛేదించారు. ఒక వ్యక్తికి గంట డేటింగ్ కోసం రూ.40 వేలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకులను అరెస్టు చేశారు.
