NTV Telugu Site icon

నటరత్న రెండు చిత్రాలు…మరపురాని చరిత్ర!

NTR Pendli Pilupu and Sati Sulochana Movies Released on May 5Th

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు అంటేనే ఓ సంచలనం! ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమారంగంలో కానీ నందమూరి బాటనే పలువురు అనుసరించారు. అనుసరిస్తున్నారు. భవిష్యత్ లోనూ అనుసరించబోతారు. ఇందులో ఏలాంటి సందేహమూ లేదు. చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ యన్టీఆర్ సాధించిన అరుదైన విజయాలను తలచుకుంటేనే మది పులకించిపోతూఉంటుంది. అదే పనిగా చరిత్ర సృష్టించాలని యన్టీఆర్ ఏ నాడూ ఏ పనీ చేయలేదు. ఆయన పూనుకున్న కార్యం విజయవంతమయ్యాకే ఓ చరిత్రగా నిలచింది. అందుకే చరిత్రకారులు తరచూ యన్టీఆర్ ను ‘చారిత్రక పురుషుడు’ అంటూ కీర్తిస్తుంటారు. ఆయన చరిత్ర అటువంటిది మరి. తెలుగు వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన యన్టీఆర్ చిత్రసీమలో సాధించిన అనేక అరుదైన రికార్డుల్లో ఒకదానిని గుర్తు చేసుకోవలసిన అవసరముంది. ఎందుకంటే, అలాంటి రికార్డుకు ఆద్యుడు ఆయనే. సరిగా అరవై ఏళ్ళ క్రితం ఆ రికార్డును నెలకొల్పారు రామారావు. అది 1961 మే 5న సాక్షాత్కరమై చరిత్రలో చెరిగిపోకుండా నిలచే ఉంది.

ఒకే రోజున రెండు సినిమాలు…
అరవై ఏళ్ళ క్రితం యన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు – పెండ్లి పిలుపు, సతీసులోచన- ఒకే రోజున విడుదలై, ఆ రెండు చిత్రాలు నేరుగా శతదినోత్సవాలు చూడడం అన్నది భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అదే మొదటి సారి. ఇదేమీ యన్టీఆర్ అదే పనిగా కోరుకొని చేసింది కాదు. నిర్మాతలే సాహసించి ఆ చిత్రాలను ఒకే రోజున విడుదల చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ‘పెండ్లిపిలుపు’ సాంఘిక చిత్రం కాగా, ‘సతీసులోచన’ పౌరాణికం. అయినా, ఓ టాప్ స్టార్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయితే, వారి అభిమానులకు ఓ అగ్నిపరీక్షే! ఆ రెండింటిలో ఏ చిత్రాన్ని ముందుగా చూడాలి అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే నందమూరి అభిమానులు ఆనందంగా ఆ రెండు చిత్రాలను పలు మార్లు చూసి, రెండింటినీ విజయపథంలో పయనింపచేశారు. ఈ చరిత్రకు 1961 మే 5వ తేదీ సాక్షిగా నిలచింది. ఆ రోజునే ఈ సినిమాలు విడుదలై విజయభేరీ మోగించాయి.

ఇంద్రజిత్ గా మారిన సతీసులోచన!
ముందుగా ‘సతీసులోచన’ కథ దగ్గరకు వద్దాం. ఎందుకంటే, ఈ సినిమాకూ మరో చరిత్ర ఉంది. రామాయణంలో రావణాసురుడు, అతని కొడుకు మేఘనాథుని కథ ఆధారంగా ‘సతీ సులోచన’ రూపొందింది. ఇంద్రుని జయించడం వల్ల మేఘనాథుడు కాస్తా ఇంద్రజిత్ కావడం తెలిసిందే! ఆ ఇంద్రజిత్, ఇంద్రుని చంపడానికి వెంటాడతాడు. నాగలోకంలో ఆదిశేషుని నీడలో చేరతాడు ఇంద్రుడు. అతణ్ణి వెదుక్కుంటూ వెళ్ళిన ఇంద్రజిత్, అక్కడ ఆదిశేషుని కూతురు సులోచనను చూసి ప్రేమిస్తాడు. వారి పెళ్ళికి ఆదిశేషుడు అంగీకరించడు. ఆదిశేషుని ఓడించి, మరీ ఇంద్రజిత్ సులోచనను వివాహమాడతాడు. రావణుడు, ఇంద్రజిత్ ఇద్దరికీ హరి వైరి. కానీ, సులోచన పుట్టుకతోనే హరి భక్తురాలు. దాంతో ఆమెను భర్త ఇంద్రజిత్ పలువిధాలా అవమానిస్తాడు. ఓడిపోయిన ఆదిశేషుడు మరు జన్మలో శ్రీరామచంద్రుని తమ్ముడు లక్ష్మణునిగా జన్మిస్తాడు. ఆదిశేషువుగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే, ఇంద్రజిత్ ను ఓడించి తీరతానని శపథం చేసి ఉంటాడు. దాంతో యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్ అంతమొందుతాడు. కానీ, సులోచన తన హరిభక్తితో ప్రార్థించగానే శ్రీరాముడే స్వయంగా ఇంద్రజిత్ తలను తీసుకువచ్చి, ఆమెకు అప్పగిస్తాడు. అప్పుడే ఇంద్రజిత్, లక్ష్మణుడే నీ తండ్రి ఆదిశేషువు అని భార్య సులోచనకు చెబుతాడు. తరువాత సులోచనకు, ఆమె భర్త ఇంద్రజిత్ కు మోక్షం లభిస్తుంది. ఇదీ ఈ చిత్ర కథ. అందువల్ల ‘సతీ సులోచన’ అన్న టైటిల్ అన్ని విధాలా సబబైనదే. ఈ చిత్రం తొలుత అదే పేరుతో విడుదలయింది. అప్పుడు ‘సతీసులోచన’ టైటిల్ వేసి, బ్రాకెట్ లో ‘ఇంద్రజిత్’ అని ఉండేది. తరువాతి రోజుల్లో యన్టీఆర్ కు ఉన్న విశేషమైన ఫాలోయింగ్ కారణంగా, ఆ చిత్రానికి ‘ఇంద్రజిత్’ అని మరోమారు టైటిల్ వేసి విడుదల చేశారు. రిపీట్ రన్స్ లో ఈ సినిమా టైటిల్స్ లోనూ, పోస్టర్స్ లోనూ ‘ఇంద్రజిత్’గానే వెలుగు చూసింది. కొత్త చిత్రం అనుకుంటారేమో అనే అనుమానంతో ‘ఇంద్రజిత్’ పేరు పెద్దగా వేసి, బ్రాకెట్ లో ‘సతీ సులోచన’ అని కూడా ప్రకటించారు. రిపీట్ రన్స్ లోనూ ‘ఇంద్రజిత్’ విజయభేరీ మోగించింది. తరువాత కూడా ఇలా అతి కొద్ది చిత్రాల టైటిల్స్ రిపీట్ రన్స్ లో మార్పు చేశారు. అయితే అవేవీ విశేషంగా వెలుగు చూడలేకపోయాయి.

ఇంద్రజిత్ గా యన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్న చందాన నటించిన ‘సతీ సులోచన’లో అంజలీదేవి సులోచనగా అభినయించారు. రావణ పాత్రలో ఎస్వీ రంగారావు కనిపించారు. రామునిగా కాంతారావు, లక్ష్మణునిగా రామకృష్ణ, నారదునిగా చలం నటించారు. ఎస్.రజనీకాంత్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డి.వి.సూర్యారావు, కంచర్ల మాధవరావుతో కలసి నిర్మించారు. సముద్రాల సీనియర్ మాటలు, పాటలు రాసిన ఈ చిత్రానికి డి.వి.నరసరాజు స్క్రీన్ ప్లే రాయడం విశేషం. టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు తొలి ఆట నుంచే విశేషాదరణ చూరగొంది. ఆరు కేంద్రాలలో ‘ఇంద్రజిత్’ శతదినోత్సవాలు చేసుకుంది.

సరదాల ‘పెండ్లి పిలుపు’
ఇక ‘పెండ్లిపిలుపు’ కథ విషయానికి వస్తే, చిన్నప్పుడు తప్పిపోయిన మరదలినే, పెద్దయ్యాక కాలేజ్ లో కలుసుకుంటాడు హీరో. తప్పిపోయిన కథానాయిక స్థానంలో తన కూతురిని పెట్టి, డబ్బు కొట్టేయాలని ఓ నీచుడు పన్నాగం పన్నుతాడు. చివరకు అందరూ కలసి ఆ నీచుని ఆటకట్టిస్తారు. కోరుకున్న అమ్మాయి కొంగునే తన చెంగున ముడేసుకుంటాడు హీరో. ఇలాంటి కథలు తరువాతి రోజుల్లో భలేగా వచ్చాయి. ఆ రోజుల్లో ‘పెండ్లి పిలుపు’ యువతను విశేషంగా ఆకట్టుకుంది.

‘పెండ్లిపిలుపు’ చిత్రంలో రామారావు సరసన దేవిక నాయికగా నటించారు. ఈ చిత్రంలో రేలంగి, గిరిజ, సీఎస్సార్, కన్నాంబ, సూర్యకాంతం, కేవీఎస్ శర్మ, పేకేటి శివరామ్, హేమలత, నిర్మలమ్మ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేశారు. ఈ సినిమాకు కె.ప్రసాదరావు సంగీతం అందించారు. డి.భావనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించారు. యువతను ఆకట్టుకున్న ‘పెండ్లిపిలుపు’ చిత్రం విజయవాడ, రాజమండ్రి రెండు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ రెండు కేంద్రాలలో ‘ఇంద్రజిత్’ కూడా డైరెక్టుగా వందరోజులు చూడడం మరింత విశేషం.

ఆ రెండు కేంద్రాలలో…
‘సతీసులోచన’ చిత్రం విజయవాడ – రాజకుమారిలో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూసింది. అదే ఊరిలోని జైహింద్ లో ‘పెండ్లిపిలుపు’ నేరుగా శతదినోత్సవం జరుపుకుంది. ఇక రాజమండ్రిలోని వీరభద్రలో ‘పెండ్లిపిలుపు’ వందరోజులు ప్రదర్శితంకాగా, అదే కేంద్రంలోని వెంకటనాగదేవి థియేటర్ లో ‘సతీసులోచన’ నూరురోజులు ఆడింది. ఒక హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలై, రెండూ విజయవంతం కావడం విశేషం. ఆ రెండు చిత్రాలూ డైరెక్ట్ గా సెంచరీ చూడడం మరింత విశేషం. అదీ రెండు కేంద్రాలలో రెండు చిత్రాలూ డైరెక్ట్ గా నూరు రోజులు ప్రదర్శించడం అన్నది ఈ నాటికీ చరిత్రగానే నిలచింది. అసలు భారతదేశంలోనే ఈ క్రెడిట్ చూసిన మొట్టమొదటి హీరోగా యన్టీఆర్ చరిత్రలో నిలచిపోయారు. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

బాలయ్య రికార్డ్!
సరిగా 32 సంవత్సరాల తరువాత యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ కూడా ఇదే ఫీటు సాధించారు. 1993 సెప్టెంబర్ 3న బాలకృష్ణ నటించిన ‘బంగారుబుల్లోడు’, ‘నిప్పురవ్వ’ రెండూ విడుదలయ్యాయి. అందులో ‘బంగారుబుల్లోడు’ అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది. ‘నిప్పురవ్వ’ కూడా డైరెక్ట్ హండ్రెడ్ డేస్ జరుపుకుంది. ఈ చిత్రాలు కూడా రాజమండ్రిలోనే నేరుగా శతదినోత్సవం చేసుకోవడం ఓ రికార్డు! రాజమండ్రిలోని మేనకలో ‘బంగారుబుల్లోడు’, శివజ్యోతిలో ‘నిప్పురవ్వ’ డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ ఆడాయి. మరో విశేషమేమంటే, 1961లో ‘పెండ్లి పిలుపు’ శతదినోత్సవం జరుపుకున్న వీరభద్రనే తరువాతి రోజుల్లో మెరుగులు దిద్దుకొని శివజ్యోతిగా మారింది.

మే విశేషం!
యన్టీఆర్ నటజీవితంలో మే 5వ తేదీ ఓ మరపురాని మధురానుభూతిని కలిగించింది. ఇదే మే 5వ తేదీ నందమూరి మూడోతరం స్టార్ హీరో జూనియర్ యన్టీఆర్ జీవితంలోనూ ఓ మరపురాని మధురమైన తేదీ కావడం మరింత విశేషం! అదెలాగంటే, 2011 మే 5న జూనియర్ యన్టీఆర్, లక్ష్మీప్రణతిని పెళ్ళాడారు. అంటే ఆ రోజుకు సరిగా ‘పెండ్లిపిలుపు’ , ‘సతీసులోచన’ చిత్రాలు విడుదలై యాభై ఏళ్ళయ్యాయన్న మాట! అలా మే 5వ తేదీన నందమూరి వారి ‘పెండ్లిపిలుపు’కు అభిమానులంతా ఆనందంతో చిందులు వేశారు. అదే రోజున జూనియర్ కాపురంలోకి ‘సతి’గా లక్ష్మీప్రణతి అడుగుపెట్టారు. ఇలా మే 5వ తేదీ సీనియర్ యన్టీఆర్ కు, జూనియర్ యన్టీఆర్ కు మరపురాని రోజుగా మిగిలింది. పైగా ఈ తాతామనవళ్ళు ఇద్దరూ మే నెలలోనే జన్మించడం మరింత విశేషం.

Show comments