NTV Telugu Site icon

నిత్య చైతన్య స్ఫూర్తి శ్రీశ్రీ!

Mahakavi Sri Sri Birthday Special Article

(నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా)

‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో… వలస కూలీలు కాలికి చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డుమీద ఎండలో నడస్తున్న సందర్భంలో… మన వాళ్ళు తలుచుకున్నది మహాకవి శ్రీశ్రీ నే! ఆయన రాసిన గీతాలనే!!

నడిచి నడిచి ఓపిక నశించి ఓ చెట్టు నీడన కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళను చూడగానే ‘దారి పక్క చెట్టు కింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె, మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక…’ అనే శ్రీశ్రీ కవిత్వాన్నే ఎవరి పెదాలైనా పలుకుతాయి. పొట్ట చేతపట్టుకుని పల్లె దాటి పట్నం వచ్చిన కుర్రాడు కరోనా కారణంగా ఉద్యోగం పోగొట్టుకుని, తిండిలేక అలమటిస్తూ కనిపిస్తే… ‘కూటి కోసం కూలికోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలు దేరిన బాటసారికి…’ అనే శ్రీశ్రీ గీతమే చెవుల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి శ్రీ శ్రీ గీతానికి అన్వయిస్తూ ఆలోచించడం రెండు మూడు తరాలకు అలవాటుగా మారిపోయిందంటే… మరి ఈ శతాబ్దం శ్రీశ్రీ ది కాక మరి ఎవరిది అవుతుంది!
1910లో విశాఖ పట్నంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావు వివాహం 1925లో ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్న సమయంలో వెంకట రమణమ్మతో జరిగింది. ఆ తర్వాతే ఆయన 1931లో బి.ఎస్.సి., జువాలజీ చేశారు. ఆంధ్ర ప్రభలోనూ ఉద్యోగం చేసిన శ్రీశ్రీ 1933 -40 మధ్య కాలంలో రాసిన ‘మహా ప్రస్థానం’ గీతాలు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. చిత్రసీమలోకి కాస్తంత ఆలస్యంగానే అడుగుపెట్టినా… అక్కడా తనదైన శైలిలో అగ్నిజ్వాలలు కురిపించారు శ్రీశ్రీ.
హిందీ చిత్రం ‘నీరా ఔర్ నందా’ తెలుగు అనువాదం ‘ఆహుతి’తో ఆయన సినీరంగంలోకి గీత రచయితగా అడుగుపెట్టారు. విశేషం ఏమంటే తెలుగులో అదే తొలి అనువాద చిత్రం కూడా! అయితే పద్య, గద్య రచనలోనూ విశేష అనుభవం ఉన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత అభిరుచులను పక్కన పెట్టి, దర్శక నిర్మాతలు కోరినది అందించారు. అందుకే కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటగా భాసిల్లారు. అదే సమయంలో అభ్యుదయ భావాలు పలికించాల్సిన సందర్భంలోనూ, సమ సమాజ నిర్మాణ ఆవశ్యకతను తెలియచేయాల్సి వచ్చినప్పుడు శ్రీశ్రీ కలం మరింత ఉత్సాహంగా కదను తొక్కింది. నాణానికి మరో వైపు అన్నట్టుగా ప్రేమ భావనను, మానవీయ విలువలను సినిమా మాధ్యమం ద్వారా అశేష ప్రజానీకం ముందు అంతే ఆర్ద్రతతో ఆవిష్కరించారు శ్రీశ్రీ. ‘ఆరాధన’లోని ‘నా హృదయంలో నిదురించే చెలి’ గీతానికి, ‘దేవత’లోని ‘బొమ్మను చేసి ప్రాణము పోసి’ పాటకు, ‘వెలుగు నీడలు’ లోని ‘కలకానిది వెలువైనది’, ‘నర్తనశాల’లోని ‘ఎవ్వరి కోసం ఈ మందహాసం..’ పాటకు పొంతనే ఉండదు. కానీ ఆ యా సందర్భాలను బట్టి అద్భుతమైన భావాలను శ్రీశ్రీ వ్యక్తం చేశారు. నిజానికి శ్రీ శ్రీ కమ్యూనిస్టు. దేవుడంటే ఆయనకు విశ్వాసం లేదు. అయినా… పలు భక్తిగీతాలు రాశారు. అదే సమయంలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా… మనుషులు చేసిన దేవుళ్ళారా’ అంటూ ఆ వింత గోలను, దేవుడి లీలను చూడమంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు.

శ్రీశ్రీ విడిగా రాసిన గీతాలను సినిమాలలో వివిధ సందర్భాలలో వాడుకున్న సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో… ‘ఆకలిరాజ్యం’ చిత్రంలో కమల్ హాసన్ పాడేవన్నీ శ్రీశ్రీ గీతాలే. ఇక చిరంజీవి ‘రుద్రవేణ’లోనూ నేను సైతం అంటూ శ్రీశ్రీ గీతాన్నే ఆవిష్కరించారు బాలచందర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి గానూ శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా’ జాతీయ స్థాయిలో తొలి తెలుగు ఉత్తమ గీతంగా ఎంపిక కావడం మరో ఎత్తు. చిత్రం ఏమంటే… శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిథ నొక్కటి ధారవోశాను’ పదాలనే తీసుకుని ‘ఠాగూర్’ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన గీతానికీ జాతీయ అవార్డు వచ్చింది. ఆ రకంగా శ్రీశ్రీ తదనంతర కాలంలోనూ తెలుగు సినిమా పాటతో మమేకమయ్యారని మరోసారి నిరూపితమైంది. ఇక విప్లవ చిత్రాలకు, అందులోని గీతాలకు శ్రీశ్రీ కలందన్నుగా నిలిచి వాటిని విజయపథంలోకి తీసుకెళ్ళింది. తెలుగు సినిమా ప్రస్థానంలో ఆయనదో ప్రత్యేక అధ్యాయం. కేవలం సినీ గీత రచయితగానే కాకుండా శ్రీశ్రీ తెలుగు భాష, సాహిత్యాలకు చేసిన సేవ వెలకట్టలేనిది. సిద్ధాంత రీత్యా ఆయనను వ్యతిరేకించే వారు సైతం ఓ కవిగా శ్రీశ్రీని నెత్తిన పెట్టుకుంటారన్నది వాస్తవం.