NTV Telugu Site icon

చంద్రబోస్ చల్లగా… పాటలతో మత్తు చల్లగా…

Lyricist Chandrabose Birthday Special

(మే 10న గీత రచయిత చంద్రబోస్ పుట్టినరోజు)
కొందరికి కొన్ని అలా కలసి వస్తాయి అని చెప్పవచ్చు. చంద్రబోస్ పేరులోనే చంద్రుడున్నాడు, ఇక ఆయన తొలి పాట “మంచు కొండల్లోన చంద్రమా…” అంటూ శ్రీకాంత్ ‘తాజ్ మహల్’ చిత్రంలో పల్లవించింది. అలా ఈ చంద్రుడు తెలుగువారిపై చల్లగా, మెల్లగా తన పాటలతో మత్తు చల్లుతూ వారి అభిమానాన్ని చూరగొన్నారు. చంద్రబోస్ పాతికేళ్ళ పాటల ప్రయాణంలో దాదాపు 800 చిత్రాలలో 3300 పాటలు పలికించారు. ఈ మాట వింటే ఆశ్చర్యం వేయకమానదు. అలా సందర్భం చెబితే చాలు, ఇలా పాటను పలికించేవారు చంద్రబోస్. నిజానికి ఆయన వేగమే చిత్రసీమలో ఎంతోమంది సంగీత దర్శకులను ఆకట్టుకుంది. ఆ వేగం ఈ నాటికీ తగ్గడం లేదు – అదే చంద్రబోస్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. కేవలం పాట అలా రాసి, ఇలా ఇచ్చేయడమే కాదు, జనం మెచ్చేలా పాటలు పలికించడంలో దిట్ట ఈ పాటల చంద్రుడు.

కొందరు దర్శకులు, సంగీత దర్శకులు చంద్రబోస్ మాత్రమే తమ సన్నివేశాలకు, తమ సరిగమలకు న్యాయం చేయగలరని భావిస్తారు. అలాంటి వారంతా స్క్రిప్ట్ దశలోనే ఈ పాటను చంద్రబోస్ తో రాయించాలని నిర్ణయించుకుంటారు. ఇక బాణీలు కట్టే సమయంలోనే చంద్రబోస్ అయితే ఈ పాటను ఎలా రూపుకడతాడో అని భావిస్తారు సంగీత దర్శకులు. వారి అంచనాలకు మించి తన పాటతో పరవశింప చేసేవారు చంద్రబోస్. ఈ చంద్రుని ప్రతిభనే కాదు, ప్రవర్తన సైతం సినీజనాన్ని ఆకట్టుకుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చంద్రబోస్ అంటే ఎంతోమందికి అభిమానం. జూ.యన్టీఆర్ ‘ఆది’లో “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి పువ్వడిగింది… ఇవ్వొద్దు ఇవ్వొద్దు…” అని పలికిస్తే, నంది నడచుకుంటూ చంద్రబోస్ చెంతకు చేరింది. నాగార్జున ‘నేనున్నానని’లో “చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని…” అంటూ చంద్రబోస్ పాటందుకుంటే, మరోమారు అతణ్ణి వెదుక్కుంటూ ‘నంది’ నడచి వచ్చింది. చంద్రబోస్ పాటలకు అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే మిన్నగా వచ్చాయని చెప్పవచ్చు. మూడువేల పైచిలుకు పాటల్లో చంద్రబోస్ పలుకులు పలుమార్లు జనాన్ని పులకింపచేశాయి. ఒకానొక దశలో చంద్రబోస్ ను కొందరు దర్శకులు అభిమానంగా ‘జూనియర్ వేటూరి’ అనీ కీర్తించారు. అయితే, వేటూరి మేరునగమైతే, దానిని ఆస్వాధించే అణువును నేను అని ఎంతో వినమ్రంగా చెప్పారు చంద్రబోస్.

ఈ మధ్య పలువురు వర్ధమాన గీతరచయితల ఆగమనంతో సంగీత దర్శకులు అందరికీ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. అందువల్ల ‘సింగిల్ కార్డ్’ పడడం అన్నది మునుపటిలా జరగడం లేదు. అయినా, రామ్ చరణ్ ‘రంగస్థలం’లో సింగిల్ హ్యాండ్ తో దేవిశ్రీ ప్రసాద్ బాణీలతో భలేగా సాగారు చంద్రబోస్. ఈ పాటలు ఏ తీరున పులకింప చేశాయో చెప్పక్కర్లేదు. ఇక ఈ యేడాది ఇప్పటికే విడుదలైన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటే… దానికోసం చంద్రబోస్ రాసిన ‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా…’ పాటే కారణం. రికార్డు స్థాయిలో ఆ పాటకు యూట్యూబ్ లో వ్యూస్ కూడా దక్కడం విశేషం. అలానే ఆది సాయికుమార్ ‘శశి’ చిత్రం కోసం చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వూ…’ గీతం కూడా అద్భుతమైన ఆదరణ పొంది… చంద్రబోస్ కలం బలాన్ని మరోసారి తెలియచేసింది. నిజానికి పాటగాడు కావాలనే అభిలాషతో చిత్రసీమలో చక్కర్లు కొట్టిన చంద్రబోస్ పాటల రచయితగా జైత్రయాత్ర చేశారు. అప్పుడప్పుడూ ఆయన గాత్రయాత్రలోనూ కొన్ని పాటలు పాలుపంచుకుంటూ ఉన్నాయి. పాటకు ఆట తోడు అన్నట్టుగానే చంద్రబోస్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర జోడీ అయ్యారు. వారి సంసారనౌక సరిగమలతో సజావుగా సాగుతోంది. కొన్ని టీవీ షోస్ లోనూ న్యాయనిర్ణేత స్థానంలో కూర్చుని చంద్రబోస్ తన మాటలతో జనాన్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ చంద్రుడు మునుముందు తన గీతాలలో ఏ తీరున మత్తు చల్లుతారో చూద్దాం.