NTV Telugu Site icon

India found deposit of lithium: బ్యాటరీలు, ఈవీ మార్కెట్‌లో ఇక మనదే హవా

India found deposit of lithium

India found deposit of lithium

India found deposit of lithium: ఇన్నాళ్లూ మనం పత్తి పంటను మాత్రమే తెల్ల బంగారమని అనుకునేవాళ్లం. కానీ.. లిథియం అనే ఖనిజాన్ని కూడా తరచుగా తెల్ల బంగారంగానే అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. ఇండియాలో ఇది ఇప్పటివరకూ చాలా చాలా తక్కువ మొత్తంలోనే దొరికేది. అందుకే.. అత్యంత విలువ కలిగిన బంగారంతో పోల్చారు. అయితే.. ఇప్పుడు ఈ లిథియం ఖనిజం భారతదేశంలో భారీగా ఉన్నట్లు గుర్తించారు.

జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రాంతాల్లో ఏకంగా 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌గా ప్రకటించింది. రెండేళ్ల కిందట కర్ణాటకలో కేవలం 16 వందల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు మాత్రమే గుర్తించారు. ఇదే ఇప్పటివరకు ఇండియాలో కనుగొన్న అతిపెద్ద లిథియం డిపాజిట్‌. కానీ.. ప్రస్తుతం 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని తెలియటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.

read more: Renault, Nissan Vehicles: ఉమ్మడిగా వాహనాలను ఉత్పత్తి చేయనున్న రెనాల్ట్‌, నిస్సాన్‌

విద్యుత్‌ వాహనాలు, సౌర విద్యుత్‌ ప్యానెల్స్‌, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర డివైజ్‌లలో వాడే బ్యాటరీల తయారీకి ఈ ఖనిజం కీలకం కాబట్టి ఇక ఈ రంగంలో ఇండియా హవా ప్రారంభంకానుందని ఆశాభావం వెలిబుచ్చింది. మన దేశంలో లిథియం నిల్వలు ఈ రేంజ్‌లో ఉన్నాయని తేలటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఇండియా.. ఈ లిథియం కోసం ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలపై ఆధారపడేది.

కానీ.. ప్రస్తుతం ఈ ఖనిజం మన దేశంలోనే భారీగా ఉందని తెలియటంతో స్వావలంబన సాధించే దిశగా ప్రయాణం ప్రారంభమైనట్లేనని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రధాని మోడీ నినాదమైన ఆత్మనిర్మర్‌ భారత్‌ కల సాకారమైనట్లేనని పేర్కొన్నాయి. ప్రపంచ తయారీ రంగంలో లీడర్‌గా ఎదిగేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న భారతదేశానికి ఈ లిథియం నిల్వలు బయటపడటం కీలకమైన మైలురాయి అని అధికారులు తెలిపారు.

తాజా ఆవిష్కరణతో లిథియం నిల్వల విషయంలో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా అవతరించింది. అగ్ర రాజ్యం అమెరికా కన్నా కూడా కొంచెం ముందే ఉండటం విశేషం. లిథియం ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ప్రస్తుతం చిలీ మొదటి స్థానంలో ఉంది. వాస్తవానికి లిథియం రిజర్వ్‌లు ఎక్కువగా బొలీవియా దేశంలో ఉన్నాయి.

కానీ.. ఈ ఖనిజాన్ని వెలికితీసే మౌలిక సదుపాయాలు ఆ దేశంలో పెద్దగా లేకపోవటంతో ఉత్పత్తిలో మొదటి ర్యాంక్‌ సాధించలేకపోతోంది. అయితే.. లిథియం ఖనిజాన్ని వెలికితీయటం, శుద్ధిపరచటం, బ్యాటరీల తయారీలో వాడుకునేలా సిద్ధం చేయటం సంక్లిష్టమైన ప్రక్రియలు. ఇవన్నీ పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకు.. అంటే.. మరికొన్నేళ్లు.. మన దేశం దిగుమతుల పైనే ఆధారపడాల్సి ఉంటుంది.

దీంతోపాటు లిథియం వెలికితీత అనేది పర్యావరణంపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తుంది. ఎందుకంటే.. ఈ ఖనిజాన్ని భూమి లోపలి పొరల్లోంచి కరిగించి తీయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పైగా.. లిథియం వెలికితీత చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అంతేకాదు. ఒక టన్ను లిథియాన్ని వెలికితీస్తే.. 15 టన్నుల కార్బన్‌డైఆక్సైడ్‌ గాల్లోకి విడుదలవుతుంది.

లిథియాన్ని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగించాల్సి ఉన్నందున శిలాజ ఇంధనాలను పెద్దమొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది. లిథియం వెలికితీత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం సైతం ఉంది. అందుకని.. లిథియం విషయంలో ముందుకు వెళ్లాలంటే ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి.. భారతదేశం హరిత ఇంధన లక్ష్యాలను చేరుకోవటానికి మరియు గ్లోబల్ క్లైమేట్ గోల్స్‌ని రీచ్‌ కావటానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది.