Hyderabadis Ott Mentality: హైదరాబాద్‌లోని ఓటీటీ సబ్‌స్క్రైబర్ల మెంటాలిటీకి సంబంధించి ఒక కొత్త నివేదిక విడుదలైంది. ఈ రిపోర్ట్‌ని రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ అనే ఫేమస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రూపొందించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
హైదరాబాదీలు ప్రతి రోజూ మూడు గంటలకు పైగా సమయాన్ని ఓటీటీ కంటెంట్ చూస్తూ గడుపుతున్నారు. వీకెండ్స్‌లో అయితే మరో పది శాతం టైం కేటాయిస్తున్నారు. దీన్నిబట్టి.. హైదరాబాదీల నిత్య జీవితంలో ఓటీటీలు అంతర్భాగమయ్యాయని చెప్పొచ్చు. ఓటీటీ వ్యూవర్స్‌లో మహిళలు మరియు పురుషుల ఆసక్తులు వేర్వేరుగా ఉన్నాయి.
వయసును బట్టి కూడా ఈ ఇంట్రస్ట్ మారుతోంది. మహిళల్లో 60 శాతం మంది తెలుగు కన్నా హిందీ, ఇంగ్లిష్ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరం మొత్తమ్మీద 52 శాతం మంది హిందీ కంటెంట్‌కే ఓటేస్తున్నారు. అంటే.. ప్రాంతీయ ఓటీటీలు హైదరాబాదీలను ఆకట్టుకోవటంలో వెనకబడుతున్నాయని అర్థంచేసుకోవచ్చు.
ఎందుకంటే.. హిందీ తర్వాత.. ఇంగ్లిష్ కంటెంట్‌ని 28 శాతం మంది వీక్షిస్తున్నారు. ఇందులో సగం మందే.. అంటే.. కేవలం 14 శాతం మందే తెలుగు కంటెంట్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని పెయిడ్ ఓటీటీ చందాదారుల్లో మరియు వీక్షణ ప్రాధాన్యతల్లో ఒక తరం అంతరం ఉందని ఈ తాజా నివేదిక గుర్తించింది.
వయసు 36 సంవత్సరాలు దాటిన వ్యక్తుల్లో 55 శాతం మంది కుటుంబ సభ్యులతో కలిసి చూడాలనుకుంటున్నారు. 26 ఏళ్ల లోపు యువతీ యువకులు మాత్రం ఓటీటీని ఒంటరిగానే వీక్షించాలని కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా.. మ్యూజిక్ స్ట్రీమింగ్ చేసేవారి వాటా 62 శాతం కావటం విశేషం.
ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లో ఓటీటీ వేదికలపై ప్రైమ్ వీడియోలను 70 శాతం మంది యూజర్లు చూస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ కలిగినవాళ్లలో 77% మంది ఉద్యోగాలు చేసేవారు మరియు సొంత వ్యాపారాలు చేసేవారు ఉన్నారు. నెలకి యావరేజ్‌గా 60 వేల రూపాయలు సంపాదించేవారు సైతం ఓటీటీ వీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా కంటెంట్ సృష్టించటం కీలకమని రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని అన్నారు.