Home Rents: రోజులు మారుతున్నాయి. పరిస్థితులు కుదుటపడుతున్నాయి. మన దేశంలోని వివిధ రంగాల్లో మళ్లీ కరోనా ముందు నాటి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. అద్దె ఇళ్ల మార్కెట్ దీనికి చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లినవాళ్లు ఇప్పుడు క్రమంగా నగరాలకు చేరుకుంటున్నారు. కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో సిటీల్లో అద్దెకు ఉండేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ఈ డిమాండ్‌కు తగ్గట్లు సప్లై లేకపోవటంతో యజమానులు ఇళ్ల అద్దెలను.. మిద్దెలు దాటిస్తున్నారు.
ఫలితంగా.. 2022వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇళ్ల అద్దెలు పదమూడున్నర శాతం భారమయ్యాయి. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో పాన్ ఇండియా లెవల్లో రెంట్లు యావరేజ్‌గా 7 శాతం బరువయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే సగటున ఈ మేరకు అద్దెలు మోపయ్యాయి. పోయినేడాది మొత్తమ్మీద రెంటల్ హౌజింగ్ డిమాండ్ ఎనిమిదిన్నర శాతం పెరగ్గా సప్లై మాత్రం 17 శాతం పడిపోయింది. స్వగ్రామాలకు వాపస్ వెళ్లినవాళ్లు తిరిగి వలస బాట పడుతున్నారు.
Air India: చరిత్ర సృష్టించనున్న ఎయిరిండియా
గతేడాది తొలి రోజుల్లో 13 ప్రధాన నగరాల్లో ఇళ్లను రెంట్‌కి తీసుకున్నవారి సంఖ్య బాగా పెరిగింది. దీనివల్ల దేశవ్యా్ప్తంగా అద్దెల వృద్ధి కొనసాగింది. ఈ విషయాలను మ్యాజిక్‌బ్రిక్స్ అనే సంస్థ రెంటల్ ఇండెక్స్ పేరిట విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. గుర్గావ్‌లో రెంట్లు 12 పాయింట్ 6 శాతం పెరగ్గా నోయిడాలో 9 శాతం, హైదరాబాద్‌లో 8 శాతం పెరిగాయి. 2021 డిసెంబర్‌తో పోల్చితే 2022 డిసెంబర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. చెన్నైలో 1 పాయింట్ 6 శాతం, కోల్‌కతా మరియు ఢిల్లీల్లో వరుసగా సున్నా పాయింట్ 8, సున్నా పాయింట్ 6 శాతం పెరిగాయి.
ఇదిలాఉండగా.. కిందటి సంవత్సరం మన దేశంలోని కొన్ని నగరాల్లో రెంటల్ డిమాండ్ పడిపోయింది. జాతీయ రాజధాని ప్రాంతంలో గరిష్టంగా 26 పాయింట్ 6 శాతం, ముంబైలో 13 పాయింట్ 9 శాతం, చెన్నైలో 6 శాతం అద్దెల గిరాకీ దిగొచ్చింది. ముంబై మరియు థానే నగరాలు మినహా మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ పరిశీలించిన దాదాపు అన్ని సిటీల్లో కూడా.. అందుబాటులో ఉన్న రెంటల్ యూనిట్ల సంఖ్య తగ్గిపోయింది. ముంబై మరియు థానే నగరాల్లో మాత్రం వరుసగా 2 పాయింట్ 9 శాతం మరియు 1 పాయింట్ 9 శాతం రెంటల్ యూనిట్లు గ్రోత్ సాధించాయి.
నిరుడు మొదటి ఆరు నెలలు ఇండియన్ రెంటల్ హౌజింగ్ మార్కెట్ బాగా పుంజుకుంది. డిమాండ్ పీక్ స్టేజ్‌కి చేరింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే రెంటల్ డిమాండ్ మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఇళ్లు కొనుక్కోవాలని అనుకునేవారు ప్రస్తుత ఆర్థిక మందగమన భయాల వల్ల తమ నిర్ణయాలను మార్చుకునే వీలుంది. ఫలితంగా ఇళ్లను అద్దెకు తీసుకునేవారి సంఖ్య ఆటోమేటిగ్గా పెరుగుతుంది. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ ఆరు సార్లు రెపో రేటును పెంచింది.
దీంతో మొత్తం రెపో రేటు 7 శాతం నుంచి 9 పాయింట్ 5 శాతానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కేంద్ర బ్యా్ంకులు ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి. దీనికితోడు భౌగోళికంగా, రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరో వైపు.. గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ పరిణామాలన్నీ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లపై మిశ్రమ ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ఇళ్ల కొనుగోలు గిరాకీ పతనమైంది. రెంటల్‌కి మాత్రం డిమాండ్ వృద్ధి చెందుతోంది.