Site icon NTV Telugu

Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

Cockroaches

Cockroaches

Cockroach: సాధారణంగా ఇంట్లో బొద్దింక కనిపిస్తేనే భయపడతాం లేదా అసహ్యించుకుంటాం. కానీ, త్వరలోనే ఇవే బొద్దింకలు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించబోతున్నాయంటే నమ్ముతారా. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుత సాంకేతికతను జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. బొద్దింకలను గూఢచారులుగా మార్చి, శత్రువుల రహస్యాలను ఛేదించే ‘బొద్దింక సైబోర్గ్’ (Cockroach Cyborgs) ప్రాజెక్టును జర్మన్ స్టార్టప్ ‘SWARM బయోటాక్టిక్స్’ అభివృద్ధి చేస్తోంది.

READ ALSO: Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..

ఎలక్ట్రానిక్ బ్యాక్‌ప్యాక్‌తో నిఘా..
ఈ సాంకేతికతలో భాగంగా, నిజమైన బొద్దింకల వీపుపై చిన్నపాటి ఎలక్ట్రానిక్ బ్యాక్‌ప్యాక్‌లను అమర్చుతారు. ఈ మైక్రో బ్యాక్‌ప్యాక్‌లలో సూక్ష్మ కెమెరాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. వీటి సహాయంతో బొద్దింకలు శత్రువుల శిబిరాలు, ఇరుకైన సొరంగాలు లేదా యుద్ధ ప్రాంతాల్లోకి సులభంగా చొచ్చుకుపోయి అక్కడి సమాచారాన్ని రియల్ టైమ్‌లో అధికారులకు చేరవేస్తాయి. శాస్త్రవేత్తలు కేవలం సమాచారాన్ని సేకరించడమే కాకుండా, ఈ కీటకాల కదలికలను కూడా దూరం నుంచి నియంత్రించగలరు. తేలికపాటి విద్యుత్ సంకేతాలను పంపడం ద్వారా ఆపరేటర్లు బొద్దింక ఏ దిశలో వెళ్లాలో నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో కృత్రిమ మేధ (AI) సహాయంతో ఇవి సమూహాలుగా (SWARM) ఏర్పడి పెద్ద విస్తీర్ణంలో నిఘా పెట్టగలవని చెబుతున్నారు.

బొద్దింకలనే ఎందుకు ఎంచుకున్నారంటే..
ప్రకృతిలో అత్యంత దృఢమైన జీవుల్లో బొద్దింక ఒకటి. ఇవి ఎంతటి కఠిన పరిస్థితులనైనా తట్టుకోగలవు. తమ బరువు కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం వీటికి ఉంది. ప్రస్తుతం ఇవి 10 నుంచి 15 గ్రాముల బరువున్న పరికరాలను సులభంగా మోయగలుగుతున్నాయి. మనుషులు లేదా పెద్ద డ్రోన్లు వెళ్లలేని అత్యంత ఇరుకైన ప్రదేశాల్లోకి ఇవి సునాయాసంగా వెళ్లగలవు. అందుకే బొద్దింకలను ఈ ప్రాజెక్ట్‌లకు ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ బయో-రోబోటిక్స్ టెక్నాలజీ కేవలం గూఢచర్యం కోసమే కాదు, ప్రాణాలను రక్షించడానికి కూడా ఉపయోగపడనుందని అంటున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు లేదా భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి ఈ బొద్దింకలను పంపవచ్చని అంటున్నారు. అలాగే విష వాయువులు లేదా అణు రేడియేషన్ ఉన్న చోటుకు మనుషులు వెళ్లడం అసాధ్యం కాబట్టి, అటువంటి చోట్లు కూడా ఈ రోబోటిక్ బొద్దింకలు వెళ్లి సమాచారాన్ని సేకరించి రెస్క్యూ టీమ్స్‌కు సహాయపడతాయని వెల్లడించారు. డ్రోన్లు, ఏఐ ఇప్పటికే యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఇప్పుడు ఈ బయో-రోబోటిక్స్ సాంకేతికత నిఘా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

READ ALSO: Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

Exit mobile version