Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!

Ganesh Utsav

Ganesh Utsav

Ganesh Utsav: గల్లీకో పందిరి.. డీజే మోతలు.. ఆకాశాన్నంటే విగ్రహాలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే కనిపించే కోలాహలమిది. అయితే ఈ సామూహిక ఉత్సవాల వెనుక ఓ పోరాట చరిత్ర, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యూహం దాగుందన్న విషయం ఈ రోజు ఎంతమందికి తెలుసు.. భక్తితో పాటు విప్లవ జ్యోతులు వెలిగించిన ఆ నాటి చారిత్రక ఘట్టం తెలుగు గడ్డపై ఎక్కడ, ఎలా మొదలైందో తెలిస్తే ఒళ్ళు గగుర్పొడవక మానదు. అసలు ఒకప్పుడు ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడని ఎప్పుడైనా ఆలోచించారా? 1905 అసలు ఏం జరిగింది.. ఆ ప్రత్యేక వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తిలక్ రగిల్చిన నిప్పు.. వినాయకుడి సాక్షిగా తిరుగుబాటు

బ్రిటీష్ కాలంలో నలుగురు కలిసి ఒకచోట మాట్లాడితేనే దేశద్రోహం కింద అరెస్టులు జరిగేవి. అలాంటి ఆంక్షలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మెదడులో ఓ అద్భుత ఆలోచన మెరిసింది. తెల్లదొరల కళ్లుగప్పి ప్రజలను ఒక్కచోట చేర్చడానికి ఆయన ఎంచుకున్న ఆయుధమే ‘గణపతి బప్పా’. కులమతాల గోడలను బద్దలు కొట్టి, ప్రజల్లో జాతీయ భావాన్ని నూరిపోయడానికి 1893లో మహారాష్ట్ర వేదికగా గణేశుడిని వీధుల్లోకి తెచ్చారు.

1905 నిర్మల్ కేంద్రంగా తెలుగు నేలపై తొలి అడుగు
తిలక్ ఊపిరి పోసిన ఆ పోరాట శంఖారావం నిజాం పాలనలో నలుగుతున్న తెలుగు గడ్డను సైతం తాకింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లా కుభీర్ ప్రాంతంలో 1905లో తొలిసారిగా సామూహిక గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్థానిక జమీందారులు, ప్రజలు ఏకమై మట్టితో రూపుదిద్దుకున్న వినాయకుడిని ఊరి నడిబొడ్డున కొలువుదీర్చారు. అలా ఉమ్మడి తెలుగు గడ్డపై మొట్టమొదటి బహిరంగ గణేశ్ మండపం రూపుదిద్దుకుంది. అక్కడ జరిగింది కేవలం ధూపదీప నైవేద్యాలు మాత్రమే కాదు. నిర్మల్ పరిసరాల్లో వెలసిన ఆ మండపాలు తిరుగుబాటు కేంద్రాలుగా మారాయి. తెల్లవారి కళ్లుగప్పి యువత, మేధావులు ఒకే చోట చేరేవారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, రహస్య సమావేశాలకు ఆ మండపాలే అడ్డాగా మారాయి. పగలంతా పూజలు జరిగితే, రాత్రుళ్లు స్వాతంత్ర్య కాంక్షను రగిలించే చర్చలు సాగేవి. ఇంటి గుమ్మం దాటని వినాయకుడిని వీధుల్లోకి తెచ్చి, ఆ విగ్రహాల వెనుక స్వాతంత్ర్య సమర శంఖాన్ని పూరించిన ఆనాటి చారిత్రక ఘట్టమే నేడు తెలుగు నేలంతా కోట్ల మంది జరుపుకునే మహా సంస్కృతిగా రూపాంతరం చెందింది. భక్తితో మొదలై జాతి విముక్తికి బాటలు వేసిన ఆ పోరాట వారసత్వం నిర్మల్ గడ్డపై మొదలుకావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.