NTV Telugu Site icon

ఎస్వీ కృష్ణారెడ్డి… సకుటుంబ చిత్రాల దర్శకుడు!

తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ పేజీకి లిఖించుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సార్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సార్ సభ్యుల కత్తెరకు పని ఉండదనే ప్రచారం బాగా జరిగిపోయింది. సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఉండదా అంటే ఉంటుంది. రొమాంటిక్ సన్నివేశాలు ఉండవా అంటే… ఉంటాయి. కానీ అవేవే హద్దు మీరి ఉండవు. ఆరోగ్యకరంగా, హుందాగా ఉంటాయి. సినిమాలోని సన్నివేశాలే కాదు…. కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలూ వీనుల విందుగా ఉండి, ఆయన చిత్రాలను మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాయి.
కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో తొలియత్నంగా ‘కొబ్బరి బొండం’ చిత్రం తీశారు కిశోర్ రాఠి, అచ్చిరెడ్డి. ఆ సినిమాకు కథ, కథనం, సంగీతం ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు. ఆ మూవీతో దర్శకత్వ విభాగాన్ని ఔపోసన పట్టి ఆ వెంటనే ‘మాయలోడు’ చిత్రం రూపొందించారు ఎస్వీకే. అలా దర్శకుడిగా తొలి చిత్రంతోనే సగటు ప్రేక్షకుడిని తన మాయలో పడేసుకున్నారాయన. ఇక అదే బాటలో ‘రాజేంద్రుడు – గజేంద్రుడు’, ‘యమలీల’, ‘నంబర్ వన్’, ‘శుభలగ్నం’ చిత్రాలతో జయకేతనం ఎగరేశారు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, నాగార్జునతో తెరకెక్కించిన సినిమాలతో కాస్తంత తడబడిన ఎస్వీ కృష్ణారెడ్డి మళ్ళీ ‘మావిచిగురు’ మూవీతో ఫామ్ లోకి వచ్చేశారు. ఆ తర్వాత ‘వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ప్రేమకు వేళాయెరా, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం ఊరెళితే, హంగామా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. అంతే కాదు… 2012లో ‘డైవర్స్ ఇన్విటేషన్’ పేరుతో ఓ ఆంగ్ల చిత్రాన్నీ డైరెక్ట్ చేశారు. చివరగా ఆయన 2014లో ‘యమలీల-2’ చిత్రాన్ని తెరకెక్కించారు.
దర్శకుడిగా చేతిలోకి మెగాఫోన్ తీసుకోకముందు నుండే ఎస్వీ కృష్ణారెడ్డి నటుడు కావాలన్న కోరికతో చిత్రసీమలో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ‘పగడాల పడవ’లో కీలక పాత్ర పోషించినా అది విడుదల కాలేదు. ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన చిరంజీవి ‘కిరాతకుడు’లో ఎస్వీ కృష్ణారెడ్డి స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అది ఆయనకు స్వీట్ మెమొరీని మిగిల్చింది. ఇక దర్శకుడైన తర్వాత స్వీయ దర్శకత్వంలోనూ ‘ఉగాది, అభిషేకం’ చిత్రాలలో కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత నితిన్ ‘సంబరం’లోనూ కీలక పాత్ర పోషించారు.
మధ్యలో అడపాదడపా పరాజయాలు పలకరించినా… అప్రతిహతంగా రెండు దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగారు. ఇప్పటికీ కుటుంబమంతా చూడదగ్గ చక్కని చిత్రాలను నిర్మించాలన్నదే కృష్ణారెడ్డి కోరిక కూడా. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే… పూర్తి స్థాయిలో నిర్థారణ కాకుండా ప్రాజెక్ట్స్ ను ప్రకటించడం సబబు కాదంటారు కృష్ణారెడ్డి. ఇటీవల ఆయన పర్యవేక్షణలోనే అలి ప్రధాన పాత్రధారిగా ‘యమలీల… ఆ తర్వాత’ పేరుతో ఓ సీరియల్ మొదలైంది. అలానే ఓ పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి ఎస్వీ కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా… ఆయన అభిమానులంతా ఎస్వీకే నుండి ఓ సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఆశిస్తున్నారు. మరి వారి కోరికను ఆయన ఎప్పుడు తీర్చుతారో చూడాలి. జూన్ 1న బర్త్ డే జరుపుకోబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ మంచి రోజు త్వరగా రావాలని కోరుకుందాం.

(జూన్ 1 ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా)