Champion: చిత్రసీమలో ప్రస్తుతం ఒకప్పటి వాస్తవాలను వెండి తెరపై ఆవిష్కరిస్తున్న ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో భైరాన్‌పల్లికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ మీలో ఎంత మందికి భైరాన్‌పల్లి కథ తెలుసు.. ఈ స్టోరీలో అసలు భైరాన్‌పల్లిలో ఏం జరిగింది, ఎందుకు ఈ ఊరుకు చరిత్ర పుటల్లో ప్రత్యేక పేజీ లిఖించబడి ఉందో తెలుసుకుందాం..
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ఒక ఊరు భైరాన్‌పల్లి. ఇది ఊరు మాత్రమే కాదండోయ్, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన నిజాం రజాకార్లకు ముచ్చెమటలు పట్టించిన ప్రాంతం. నిజాం తోకల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన అమరులను కన్న ఊరు. ఆ కాలంలో రజాకార్లకు ఎదురొడ్డి మానప్రాణాలను సైతం లెక్క చేయని వీరులను తెలంగాణ ప్రాంతానికి అందించిన పల్లెల్లో ఇది కూడా ఒకటి. భైరాన్‌పల్లిలో జరిగిన మారణకాండ అమృత్ సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటనకు ఏమాత్రం తీసిపోదని చరిత్ర విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రజాకార్ల తూటాలకు బలైన అమరుల ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికి ఈ ఊర్లో అమరుల స్థూపం కనిపిస్తుంది. ఇది ఆనాడు దుర్మార్గ రజాకార్ల రక్తదాహానికి బలైన పోరు బిడ్డల ప్రాణ త్యాగాలను చెదరని గుర్తుగా నిలుస్తుంది.
భారత దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ టైంలో యావత్ దేశమంతా స్వేచ్ఛా స్వాతంత్ర్యల మధ్య సంతోషంగా ఊపిరి పీల్చుకుంటుంటే, నిజాం ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఎందుకంటే యావత్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నిజాం రాచరికపు కంచెలో బంధీలుగా ఉన్న తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు. నిజాం ప్రభువు తోకలుగా చెప్పుకు తిరగే రజాకార్ల అగడాలతో ఈ ప్రాంత ప్రజలు భయంభయంగా గడపసాగారు. ఇదే సమయంలో నిజాం ప్రభువును గద్దె దించాలని కంకణం కట్టుకున్న తెలంగాణ సాయుధ పోరాట యోధులు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు.
అదే సమయంలో భైరాన్‌పల్లి దగ్గరలో ఉన్న లింగాపూర్, దూలోల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేశారు. ఎంతో మందిని చంపి, గ్రామాలకు గ్రామాలను లూటీ చేసుకొని భైరాన్‌పల్లి మీదుగా వాళ్లు వెళ్తుండగా భైరాన్‌పల్లి గ్రామ రక్షణ దళం ఆ నరరూప రాక్షసులను ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. ఊహించని దాడితో రజాకార్లు ప్రాణ భయంతో దోచుకున్న సామగ్రిని భైరాన్‌పల్లిలోనే వదిలేసి లగెత్తారు. నిజానికి ఈ దాడి రజాకార్లకు అహాన్ని దెబ్బతీసినట్లు అయ్యింది. దీంతో భైరాన్‌పల్లిపై కక్ష కట్టిన రజాకార్లు రెండు సార్లు దాడి చేశారు. కానీ ఘోరంగా విఫలమయ్యారు. అలాగే 20 మంది రజాకార్లు కూడా చనిపోయారు. దాంతో నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం భైరాన్‌పల్లిని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించడంతో పాటు, ఎప్పటికైనా ఈ గ్రామాన్ని నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఆ రోజు 1948 ఆగష్టు 27న తెల్లవారు జామున ఉదయం 4 గంటలు అవుతోంది. పల్లె ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఆ టైంలో ఒక్కసారిగా భైరాన్‌ల్లిలో తుపాకీ చప్పుల మోతలు వినిపించాయి. గ్రామ రక్షణ దళం తేరుకునే లోపు జనాల చావు కేకలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఊరంతా ఉలిక్కిపడింది. తేరుకుని చూసే సరికి, గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రజాకార్లు గ్రామంపైకి దండెత్తి వచ్చారు. సుమారు 1,200 మంది నరరూప రాక్షసులు భీకర మందుగుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున భైరాన్‌పల్లిలోకి వచ్చేశారు. గ్రామం లోపలికి వచ్చిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా కాల్చి చంపడంతో పాటు, ఇంటింటికీ తిరిగి 92 మందిని చేతికి పట్టుకుని పరుసగా నిలబెట్టి కాల్చిచంపారు. తర్వాత గ్రామం బయట శవాల చుట్టూ ఆడబిడ్డలను వివస్థలుగా చేసి బతుకమ్మ ఆడించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక కొంతమంది ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నాటి భైరాన్‌పల్లి కథ.
ప్రస్తుతం రోషన్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా ఈ కథ ఆధారంగా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలలో భైరాన్‌పల్లిలో బందూకు పట్టిన పోరాట యోధుడుగా రోషన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఫుట్‌బాల్ ప్లేయర్ లా కూడా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.
READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య
