NTV Telugu Site icon

Behind Story of Big Bazaar’s Downfall: బిగ్ బజార్‌ తెర(మరుగు) వెనక ఏం జరిగింది?

Behind Story Of Big Bazaar’s Downfall

Behind Story Of Big Bazaar’s Downfall

Behind Story of Big Bazaar’s Downfall: ఫ్యూచర్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు అక్వైర్‌ చేస్తున్నట్లు రిలయెన్స్ గ్రూపు ప్రకటించడంతో మూడు దశాబ్దాల కిషోర్‌ బియానీ రిటైల్ సామ్రాజ్యానికి తెరపడింది. అయితే.. ఆ తెర వెనక ఏం జరిగింది?. అదే ఇవాళ్టి మన స్పెషల్‌ స్టోరీ. కిషోర్‌ బియానీ తన రిటైల్‌ వ్యాపారాన్ని ప్రారంభించిన 20 ఏళ్లలోనే దేశం మొత్తం విస్తరింపజేశారు. ఆయన మొట్టమొదట 1997లో కోల్‌కతాలో పాంథలూన్స్‌ను ప్రారంభించారు. ఫ్రాంఛైజ్‌లను విక్రయించటం ద్వారా బిజినెస్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత అదే నగరంలో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ను ఏర్పాటుచేసి బిగ్‌బజార్‌కు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలోనే దేశవ్యాప్తంగా వందకు పైగా స్టోర్లను అందుబాటులోకి తెచ్చారు. తదనంతరం వివిధ వ్యాపార రంగాల్లోకి ప్రవేశించారు.

‘అప్పు’ చేసి.. తప్పు చేసి..

ఫ్యూచర్‌ గ్రూప్‌ పతనానికి అప్పులే ప్రధాన కారణం. కిషోర్‌ బియానీ ఎన్నో వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టాలని అనుకునేవారు. దీంతో ఒక్కో వెంచర్‌ ఆయనకు తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినా ఆయన దీటుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో 2009లో కిషోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూపు నుంచి నాన్‌ రిటైల్‌ బిజినెస్‌ను వేరు చేస్తూ తన సంస్థను పునర్నిర్మించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ రుణాల భారం నుంచి తప్పించుకోలేకపోయారు.

ఇదిలాఉండగా.. బిజినెస్‌ గ్రోత్‌ కోసం ఆయన రీజనల్‌ రిటైల్‌ చైన్లను అక్వైర్‌ చేశారు. 2012లో పాంథలూన్స్‌ని ఆదిత్య బిర్లా గ్రూపుకి సుమారు 300 కోట్ల రూపాయలకు విక్రయించారు. అయినప్పటికీ ఫ్యూచర్‌ గ్రూప్‌కి నికరంగా రూ.7850 కోట్ల అప్పు ఉండిపోయింది. 2014లో నీల్గరీస్‌ అనే గ్రాసరీ స్టోర్‌ను రూ.300 కోట్లకు అక్వైర్ చేసుకున్నారు. అలాగే.. 2016లో స్మాల్‌ ఫార్మాట్‌ గ్రాసరీస్‌ స్టోర్‌ అయిన ఈజీ డే చెయిన్‌ను అక్వైర్‌ చేసుకున్నారు. అదే సంవత్సరంలో.. బెంగళూరుకు చెందిన రిటైల్‌ చెయిన్‌ హెరిటేజ్‌ ఫ్రెష్‌ను కూడా అక్వైర్‌ చేసుకున్నారు.

2017లో ఫ్యూచర్ రిటైల్ రూ.650 కోట్లు వెచ్చించి అప్పటికే నష్టాల్లో ఉన్న హైపర్‌సిటీ చెయిన్‌ను మరియు ఇ-జోన్‌ను బిగ్‌బజార్‌లో విలీనం చేసింది. దీంతో ఫ్యూచర్‌ గ్రూపు పూర్తిగా రుణాల ఊబిలో కూరుకుపోయింది. కిషోర్‌ బియానీ.. ఫుడ్‌ బిజినెస్‌ సెక్టార్‌లోకి కూడా అడుగుపెట్టారు. వాళ్ల ఉత్పత్తులకు సొంత లేబులింగ్‌ ఇచ్చి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ బ్రాండ్లను వాళ్ల రిటైల్‌ స్టోర్లలోనే అమ్మాలనే ఆలోచన చేశారు. తద్వారా ఎక్కువ లాభాలు పొందొచ్చని అంచనా వేశారు. ఇవే బ్రాండ్లను ఇతర రిటైల్‌ చెయిన్‌లకు కూడా విక్రయించాలని భావించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు.

తేల్చుకోలేని స్థితిలో..

ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా ఫ్యూచర్‌ గ్రూపు ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2014లో అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తీవ్ర పోటీనిచ్చాయి. ఆ సమయంలో ప్రొడక్టుల ఆన్‌లైన్‌ విక్రయం తమకు లాభదాయకంగా ఉంటుందా లేదా అనే సంశయంలో కిషోర్‌ బియానీ ఉండిపోయారు. ఈ అనుమానాల మధ్య ఇ-కామర్స్‌లోకి ఎంటరవటంతో సక్సెస్‌ సాధించలేకపోయారు. 2019 సెప్టెంబర్‌ 30 నాటికి ఫ్యూచర్‌ గ్రూపు ఉమ్మడి రుణాలు రూ.12,778 కోట్లకు పెరిగాయి.

2020 మార్చి నాటికి కిషోర్‌ బియానీ తన వ్యాపారాలను సక్రమంగా నడపలేకపోతున్నారనే టాక్‌ బిజినెస్‌ సర్కిల్స్‌లో వ్యాపించింది. ఒక వైపు ఫ్యూచర్‌ గ్రూపు వ్యాపారాలు దిగజారుతుండగా మరో వైపు అప్పులు అమాంతం పెరుగుతూ పోయాయి. కిషోర్‌ బియానీ నెట్‌వర్త్‌ 1.7 బిలియన్‌ల నుంచి 400 మిలియన్‌లకు పడిపోయింది. అదే ఏడాది ఆగస్టు నాటికి రిలయెన్స్‌ రిటైల్‌ వెంచర్‌.. ఫ్యూచర్‌ గ్రూపులోని రిటైల్‌, హోల్‌సేల్‌ బిజినెస్‌ల వేర్‌హౌజ్‌లను, లాజిస్టిక్‌లను రూ.24,713 కోట్లకు అక్వైర్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

అసలు ఏంటీ గొడవ?

ఫ్యూచర్‌ గ్రూప్‌కి, అమేజాన్‌కి మధ్య వివాదం ఎలా మొదలైందో చూద్దాం. అమేజాన్‌.. ఫ్యూచర్‌ గ్రూపులోని కొంత భాగాన్ని కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌లో ఫ్యూచర్‌ కూపన్స్‌ అనేది ఒక భాగం. దీనికి 7.3 శాతం వాటా ఉంది. ఇందులోని 49 శాతాన్ని అమేజాన్‌ సంస్థ 2019లో కొనుగోలు చేసింది. తద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌లో వీళ్లకు 3.5 శాతం వాటా ఉన్నట్లు చెప్పొచ్చు. అయితే ఈ అగ్రిమెంట్‌ ప్రకారం ఫ్యూచర్‌ రిటైల్‌కి సంబంధించిన విక్రయాలను ముందుగా అమేజాన్‌ దృష్టికి తేవాలి. అప్పుడు ఆ కొనుగోలును అమేజాన్‌వాళ్లు చేయొచ్చు లేదా థర్డ్‌ పార్టీకి ఇవ్వొచ్చు. కానీ అలా జరగలేదు.

రిలయెన్స్‌ రూ.24,713 కోట్లకు అక్వైర్‌ చేస్తున్నట్లు ప్రకటించటంతో ఈ డీల్‌ జరగకుండా అమేజాన్‌.. సింగపూర్‌లోని ఎమర్జెన్సీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ అమేజాన్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. కానీ ఈ తీర్పు ఇండియాలో చెల్లదంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ సుప్రీంకోర్టుకు వెళ్లగా డీల్‌ వాయిదా పడింది. ఈలోపే ఆస్తుల స్వాధీనంపై అమేజాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో రిలయెన్స్‌ ఈ డీల్‌ను వెనక్కి తీసుకోవాలనే ఆలోచన చేసింది. మొత్తానికి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో తెలియట్లేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ రిటైల్‌ రంగంలో రారాజుగా నిలిచిన కిషోర్‌ బియానీ వ్యాపార సామ్రాజ్య పతనానికి ఆయనే ప్రత్యక్షంగా కారణమయ్యారో లేక రిలయెన్స్‌, అమేజాన్‌లు కారణమయ్యాయో తెలియని అయోమయ పరిస్థితి ఉంది.

Show comments