NTV Telugu Site icon

35 ఏళ్ళ ‘అనసూయమ్మ గారి అల్లుడు’

Anasuyamma Gari Alludu Movie completes 35 Years

నందమూరి బాలకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’. ఈ సినిమా సాధించిన ఘన విజయం కారణంగా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 13 చిత్రాలు వచ్చాయి. విశేషం ఏమంటే నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఇంత వరకూ అత్యధిక చిత్రాలు చేసింది ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలోనే. 1986 జూలై 2న విడుదలైన ఈ సినిమా ఈ రోజుకు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రారంభం వెనుక ఓ ఆసక్తికరమైన ముచ్చట ఉంది. ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశం చేయక మునుపు తనతో ‘ప్రేమ సింహాసనం’ చిత్రం నిర్మించిన నిర్మాతలకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎ. కోదండరామిరెడ్డికి దక్కలేదు. అదే ఎన్టీయార్ తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా ‘అనసూయమ్మగారి అల్లుడు’ మూవీని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించారు. దానిని తనకు దగ్గిన గౌరవంగా భావించిన ఎ. కోదండరామిరెడ్డి సైతం ఎన్టీయార్ తనయుడు బాలకృష్ణకు ఓ సూపర్ హిట్ మూవీని ఇచ్చారు.

‘అనసూయమ్మ గారి అల్లుడు’ చిత్రానికి దాదాపు దశాబ్దం ముందు నుండి జాతీయ ఉత్తమ నటి శారద అనేక చిత్రాలలో ప్రధానమైన, ప్రభావవంతమైన పాత్రలను చేస్తూ వచ్చారు. ఫెరోషియస్ క్యారెక్టర్స్ చేస్తున్న శారదను అత్తగా పెట్టి బాలకృష్ణ తో ఓ సరదా చిత్రం చేస్తే కొత్తగా ఉంటుందనే ఆలోచన ఈ చిత్ర బృందానికి వచ్చింది. గతంలో అత్తలను టీజ్ చేసే అల్లుళ్ళ కథలు కొన్ని వచ్చినా… చిరంజీవి, బాలకృష్ణ జనరేషన్ లోని వారు ఎవరూ ఆ తరహా కథలను టచ్ చేయలేదు. దాంతో పరుచూరి సోదరులు అత్త – అల్లుడు కాన్ ఫ్లిక్ట్ ప్రధానాంశంగా ‘గుండమ్మ కథ’ తరహాలో ఈ కథను తయారు చేశారు. దానికి సంభాషణలూ వారే రాశారు. తన అన్నయ్య బీదింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని ఈసడించి అతన్ని దూరంగా పెట్టేస్తుంది అనసూయమ్మ. ఆమె కూతురుకూ తల్లి లక్షణాలే వస్తాయి. అలాంటి సమయంలో మెకానిక్ అయిన హరికృష్ణ అత్త కూతురుని ప్రేమలో పడేస్తాడు. మొదట అతనంటే అయిష్టత ప్రదర్శించినా ఆ తర్వాత బావ ప్రేమలో పడి, తన తల్లిని ఎదిరించి, ఆమె కళ్ళముందే కాపురం పెడుతుంది కూతురు. అయితే ఒకానొక సమయంలో తన కూతురు, మేనల్లుడిని పెళ్ళి చేసుకోలేదని తెలిసి, వారిద్దరినీ వేరు చేసే ప్రయత్నం చేస్తుంది అనసూయమ్మ. ఇదే సమయంలో అనసూయమ్మ వేలు విడిచిన అన్నయ్య ఆమె పంచన చేరి, ఆమెనే దివాళా తీయిస్తాడు. చివరకు మేనల్లుడైన హరికృష్ణే తన అత్తయ్యను ఆదుకుంటాడు. దాంతో ఆమెలోని అహంకారం సమసిపోతుంది. మామూలు మనిషిగా మారిపోతుంది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ‘అనసూయమ్మ గారి అల్లుడు’ చిత్ర కథ ఇదే.

పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ కథను అంతే అద్భుతంగా ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. అప్పటికే సక్సెస్ ఫుల్ పెయిర్ అయిన బాలకృష్ణ, భానుప్రియ మరింత హుషారుగా ఈ సినిమాలో నటించారు. అంతకు ముందు బాలకృష్ణకు తల్లిగా, వదినగా నటించిన శారద తొలిసారి ఈ సినిమాలో అతనికి అత్తగా నటించింది. అహంకారపూరితమైన అత్త పాత్ర చేయడం శారదకూ కొత్తే. అయినా ఆ పాత్రకు ఆమె సంపూర్ణ న్యాయం చేకూర్చింది. ఈ అత్త -అల్లుళ్ళ టీజింగ్ స్టోరీ సూపర్ హిట్ కావడంతో ఈ తరహా చిత్రాలకు ఇది ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ఇదే నేపథ్యంలో ఆ తర్వాత అగ్రహీరోలంతా వరుస పెట్టి సినిమాలు తీసి విజయాలను అందుకున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే… ఈ సినిమా విడుదలైన కొంత కాలానికి శారద – బాలకృష్ణ అత్త అల్లుడుగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే ‘నారి నారి నడుమ మురారి’ సినిమా వచ్చింది. ‘అనసూయమ్మ గారి అల్లుడు’ తరహాలో మాస్‌ గా కాకుండా కాస్తంత క్లాస్ గా దీనిని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది.

‘అనసూయమ్మగారి అల్లుడు’ సినిమాలో రావు గోపాలరావు, జగయ్య, అన్నపూర్ణమ్మ, నూతన ప్రసాద్, చలపతిరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంటర్ టైన్ మెంట్ కు, మాస్ ఎలిమెంట్స్ కు కోదండరామిరెడ్డి ప్రాధాన్యమించి ఈ సినిమాను తీశారు. దాంతో ఇది చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి చక్రవర్తి సమకూర్చిన సంగీతం, వేటూరి రాసిన పాటలు కూడా దోహదం చేశాయి. ఈ చిత్రానికి నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించగా, నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు. శ్లాబ్ సిస్టమ్ అమలు అవుతున్న ఆ సమయంలో ‘అనసూయమ్మ గారి అల్లుడు’ సినిమా 25 కేంద్రాలలో డైరెక్ట్ గా యాభై రోజులు ఆడింది. ఆ తర్వాత షిఫ్టింగ్ లో 28 కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలలో ఆ జనరేషన్ లో వందరోజులు ఆడిన సినిమా ఇదే. అలానే 142 రోజులు డైరెక్ట్ గా హైదరాబాద్‌ తారకరామలో ప్రదర్శితమైన ఈ సినిమా, షిఫ్టింగ్ లో సిల్వర్ జూబ్లీ ఆడింది. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఆ వెంటనే తమిళంలో ‘వైరాగ్యం’ పేరుతో ప్రభు, రాధ, షావుకారు జానకి కీలక పాత్రధారులుగా రీమేక్ చేశారు.

‘అనసూయమ్మగారి అల్లుడు’కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో ‘పట్టాభిషేకం’ చిత్రాన్ని, అలానే ఆయన శిష్యుడు ఎ. కోదండరామిరెడ్డితో ‘అనసూయమ్మ గారి అల్లుడు’ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు దాదాపుగా ఒకేసారి ప్రకటించారు ఎన్టీయార్. అందులో రాఘవేంద్రరావు తో తీసిన ‘పట్టాభిషేకం’ ముందుగా విడుదలై బాలకృష్ణ అభిమానులను నిరుత్సాహ పర్చింది. ఆ వెనుకే వచ్చిన కోదండరామిరెడ్డి తీసిన ‘అనసూయమ్మగారి అల్లుడు’ ఆ బాధను చెరిపేస్తూ సూపర్ హిట్ అయ్యింది. ఆ రకంగా బాలయ్య బాబు విషయంలో గురువు రాఘవేంద్రరావుపై కోదండరామిరెడ్డి పరోక్షంగా విజయం సాధించినట్టు అయ్యింది. అలా మొదలైన బాలయ్య – కోదండరామిరెడ్డి సినీ ప్రయాణం 2018లో వచ్చిన ‘యువరత్న రాణా’ వరకూ అప్రతిహతంగా కొనసాగింది.