Site icon NTV Telugu

Ammonium Nitrate: ఎరువా లేక ఎక్స్‌ప్లోసివ్‌‌ ! ఉగ్రవాదులకు అమ్మోనియం నైట్రేట్‌‌తో పనేంటి?

Ammonium Nitrate

Ammonium Nitrate

Ammonium Nitrate:భారతదేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంటి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థం RDX అనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థం అమ్మోనియం నైట్రేట్ అని తరువాత స్పష్టం చేశారు. వైద్యుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఈ అమ్మోనియం నైట్రేట్ మొత్తం 350 కిలోగ్రాములు ఉంటుందని అంచనా. అసలు అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి, దాంతో ఉగ్రవాదులకు పనేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Kishan Reddy: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం

అమ్మోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. వాస్తవానికి భారతదేశంలో జరిగిన మునుపటి ఉగ్రవాద దాడుల్లో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించారు. అనేక ఉగ్రవాద దాడుల కుట్రలలో దర్యాప్తు సంస్థలు ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నాయి. 2019లో జరిగిన పుల్వామా ఉగ్ర దాడిలో అమ్మోనియం నైట్రేట్‌ను ఉగ్రవాదులు ఉపయోగించారు. ఈ దాడిలో 43 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే.

ఇంతకీ అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి..
అమ్మోనియం నైట్రేట్ (NH₄NO₃) అనేది ఒక స్ఫటికాకార రసాయన సమ్మేళనం. ఇది రంగు, వాసన లేని పదార్థం. ఇది నీటిలో వేగంగా కరిగిపోతుంది. ఇది అమ్మోనియా, నైట్రిక్ ఆమ్లం ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేసిన సింథటిక్ పౌడర్. ఇది ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. స్వచ్ఛమైన అమ్మోనియం నైట్రేట్ స్వయంగా పేలుడు పదార్థం కాదు. దీనిని పేలుడు పదార్థంగా ఉపయోగించడానికి ప్రాథమిక పేలుడు పదార్థం లేదా RDX లేదా TNT వంటి డిటోనేటర్ అవసరం. వాస్తవానికి దీనికి మండే స్వభావం ఎక్కువ. ఇది ఏదైనా పేలుడు పదార్థంతో కలిస్తే పేలిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దాని విస్తృతమైన ఆక్సీకరణ కారణంగా, ఇది అగ్ని, తదుపరి పేలుడు నుంచి వేడిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ను పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎరువులలో నత్రజని మూలంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇంకా మైనింగ్ పరిశ్రమలో ఉపయోగించే పేలుడు పదార్థాలలో కూడా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు.

అమ్మోనియం నైట్రేట్‌కు మంట తగిలితే తీవ్రంగా పేలిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పేలుడు చాలా శక్తివంతమైనదని, ఇది చుట్టుపక్కల వస్తువులను సెకన్లలోనే నాశనం చేయగలదని వెల్లడించారు. 150 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్ రెండు నుంచి మూడు కిలోమీటర్ల ప్రాంతంలో పూర్తి విధ్వంసానికి కారణమవుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ పదార్థం పేలితే ప్రాణాంతకతను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. వాస్తవానికి ఫరీదాబాద్‌లో దొరికిన అమ్మోనియం నైట్రేట్‌కు మంట తగిలితే కనీసం ఆరు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేసి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ అమ్మోనియం నైట్రేట్‌ను చాలా దేశాల సైన్యాలు, ఉగ్రవాదులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 1921లో జర్మనీలోని ఒప్పౌలోని ఒక ప్లాంట్‌లో 4,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలుడులో 500 మందికి పైగా మరణించారు. 1947లో అమెరికాలోని గాల్వెస్టన్ బే ఓడరేవులో ఓడలో లోడ్ చేసిన 2 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలి 581 మంది మరణించారు. 1995లో అమెరికాలోని ఒక్లహోమా నగరంలో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించి పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో ఈ రసాయన సమ్మేళనం ఎంత విధ్వంసం సృష్టించిందంటే అది వర్ణించడం కష్టం. ఈ సంఘటనలో మొత్తం రెండు టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించారు. ఈ పేలుడులో 168 మందికి పైగా మరణించారు. 2015లో చైనాలోని టియాంజిన్ ఓడరేవులో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడులో 173 మంది మరణించారు. అలాగే 2020లో బీరుట్‌లో 3 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ పేలి భారీ విధ్వంసం సృష్టించింది.

బీరుట్ పేలుడు తర్వాత మారిన మార్గదర్శకాలు..
2020 బీరూట్ పేలుడు తర్వాత దేశంలో అమ్మోనియం నైట్రేట్ దొంగతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అగ్నిమాపక నిబంధనలను అమలు చేయడానికి, ఈ రసాయన నిర్వహణ, నిల్వను మెరుగుపరచడానికి పలు నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం పోర్టులలోకి దిగుమతి చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ను పోర్టు ప్రాంతం నుంచి కనీసం 500 మీటర్ల దూరంలో ఉన్న నిల్వ సౌకర్యాలకు బదిలీ చేయాలి, ఎట్టిపరిస్థితులోను పోర్టులలో నిల్వ చేయకూడదు. ఇంకా అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకుంటే, దానిని సురక్షితంగా, సత్వర పారవేయడం కోసం వేలం వేయవచ్చు. అమ్మోనియం నైట్రేట్‌ను బ్యాగ్ రూపంలో మాత్రమే దిగుమతి చేసుకోవాలి. దాని నిల్వ ప్రాంతంలో తగినంత అగ్నిమాపక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

చట్టపరమైన మార్గదర్శకాలు..
ప్రపంచవ్యాప్తంగా దీనిని యునైటెడ్ నేషన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేంజరస్ గూడ్స్ కింద ఆక్సీకరణ పదార్థంగా వర్గీకరించారు. భారతదేశంలో అమ్మోనియం నైట్రేట్ తయారీ, ప్యాకేజింగ్, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకానికి స్వాధీనం లేదా ఉపయోగం అమ్మోనియం నైట్రేట్ నియమాలు, 2012 ద్వారా నియంత్రిస్తున్నారు. పేలుడు పదార్థాల చట్టం 1884, అమ్మోనియం నైట్రేట్ (ఫార్ములా NH4NO3) ను జనాభా ఉన్న ప్రాంతాల్లో పెద్ద పరిమాణంలో నిల్వ చేయకూదని పేర్కొంది. అమ్మోనియం నైట్రేట్ తయారీకి పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం 1951 ప్రకారం పారిశ్రామిక లైసెన్స్ అవసరం. అమ్మోనియం నైట్రేట్‌తో కూడిన ఏదైనా కార్యాచరణకు అమ్మోనియం నైట్రేట్ నియమాలు, 2012 ప్రకారం లైసెన్స్ తీసుకోవడం ముఖ్యం.

READ ALSO: Asim Munir: దాయాది దేశంలో నిశ్శబ్ద తిరుగుబాటు.. జనరల్ జియా అడుగుజాడల్లో మునీర్!

Exit mobile version