Mahabharata Unknown Facts: కురుక్షేత్ర మహాసంగ్రామం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అర్జునుడి బాణాలు, కర్ణుడి శౌర్యం, భీష్ముడి ప్రతిజ్ఞ. అయితే 18 రోజుల పాటు సాగిన ఈ ధర్మయుద్ధంలో.. పాల్గొన్న వీరందరి కంటే అపారమైన శక్తులుండి కూడా కదనరంగంలోకి అడుగుపెట్టని మొనగాళ్లు కొందరున్నారని మీకు తెలుసా. నిజానికి వారు గనుక యుద్ధంలో పాల్గొని, ఆయుధం పట్టి ఉంటే.. పాండవుల విజయం అంత సులువు అయ్యేది కాదు. మహాభారతం చరిత్రే మారిపోయేది. ఇంతకీ కృష్ణుడు, భీష్ముడిని సైతం ముప్పతిప్పలు పెట్టగల ఆ నలుగురు మహావీరులు ఎవరు? వారు కురుక్షేత్రానికి ఎందుకు దూరంగా ఉండిపోయారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం.
18 రోజుల పాటు సాగిన ఈ మహాసంగ్రామంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. ఇందులో కౌరవుల వైపు 11 అక్షౌహిణులు, పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం మోహరించాయి. ఆ కాలంలో ఉన్న దాదాపు అందరు రాజులు ఏదో ఒక పక్షాన ఈ యుద్ధంలో పాల్గొన్న వారే. కానీ, తమకున్న అపార శక్తులతో యుద్ధ ఫలితాన్నే మార్చేయగల సామర్థ్యం ఉండి కూడా.. ఆ మహాసంగ్రామానికి దూరంగా ఉన్న నలుగురు వీరులు వీరే..
1. బలరాముడు (శ్రీకృష్ణుడి అన్న):
యదువంశంలోనే అత్యంత శక్తిమంతుడైన యోధుడు బలరాముడు. మగధ రాజు జరాసంధుడి దండయాత్రలను ఎన్నోసార్లు ఒంటిచేత్తో తిప్పికొట్టిన వీరుడు ఆయన. ఒకసారి కౌరవులు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడిని బంధించినప్పుడు.. బలరాముడు ఆగ్రహంతో తన హలాయుధాన్ని (నాగలి) ఉపయోగించి మొత్తం హస్తినాపురాన్నే గంగానదిలో ముంచేయడానికి లాగడం ప్రారంభించాడు. దాంతో భయపడిపోయిన కౌరవులు సాంబుడిని విడిచిపెట్టారు. శేషనాగు అవతారమైన బలరాముడికి దుర్యోధనుడు అత్యంత ప్రియమైన శిష్యుడు. అటు తమ్ముడు శ్రీకృష్ణుడు పాండవుల వైపు నిలబడగా.. ఇటు తన శిష్యుడు కౌరవుల వైపు ఉన్నాడు. దీంతో ఎవరి పక్షాన పోరాడలేక బలరాముడు ఈ యుద్ధంలో తటస్థంగా ఉండిపోవడమే మేలని భావించి ఆ మహా సంగ్రామానికి దూరంగా ఉన్నారు.
2. రుక్మి (రుక్మిణి అన్న):
విదర్భ రాజైన భీష్మకుని కుమారుడు, శ్రీకృష్ణుడి బావ అయిన రుక్మి కూడా సామాన్యుడు కాదు. ఆయన వద్ద ‘విజయ్’ అనే అత్యంత శక్తివంతమైన విల్లు ఉండేది. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకుని తీసుకెళ్తున్నప్పుడు.. రుక్మి భారీ సైన్యంతో కృష్ణుడిని అడ్డుకోవడానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడిని బంధించకపోతే తిరిగి తన రాజధాని కుండినపురంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు. కానీ యుద్ధంలో కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. ఆ సమయంలో కృష్ణుడు అతడిని అవమానిస్తూ గడ్డం, మీసాలు కత్తిరించాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం రుక్మి మళ్లీ ఎప్పటికీ తన రాజ్యానికి తిరిగి వెళ్లలేదు. అలాగే ఆ పాత పగ మనసులో పెట్టుకుని, అటు కృష్ణుడికి (పాండవులకు) సహాయం చేయలేక.. ఇటు కౌరవుల వైపు వెళ్లలేక మహాభారత యుద్ధానికి దూరంగా ఉండిపోయాడు.
3. వీర బార్బరీకుడు (భీముడి మనవడు):
మహాభారతంలోనే అత్యంత ప్రమాదకరమైన ధనుర్ధారి.. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు. ఈయనకు ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ ఉంది.. యుద్ధంలో ఎవరైతే ఓడిపోయే స్థితిలో ఉంటారో, వారి వైపు నుంచే తను పోరాడుతాడు. ఈయన వద్ద కేవలం మూడు బాణాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ మూడు బాణాలతో మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని కొన్ని క్షణాల్లోనే ముగించగల అపార శక్తి ఆయన సొంతం. యుద్ధంలో కౌరవుల ఓటమి ఖాయమని తెలిసిన శ్రీకృష్ణుడు.. ఒకవేళ బార్బరీకుడు కౌరవుల వైపు చేరితే పాండవుల నాశనం తప్పదని ముందే గ్రహించాడు. అందుకే ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి బార్బరీకుడిని ‘దానం’గా ఆయన తల (శిరస్సు) అడిగాడు. తాతగారి మాట ప్రకారం బార్బరీకుడు నవ్వుతూ తన తలను దానం చేసేశాడు. అలా యుద్ధంలో పాల్గొనలేకపోయినప్పటికీ.. శ్రీకృష్ణుడి వరంతో కొండపై నుంచి మొత్తం యుద్ధాన్ని వీక్షించాడు.
4. విదురుడు (ధృతరాష్ట్రుడి ప్రధాన సలహాదారు):
హస్తినాపురం రాజ్యంలో అత్యంత మేధావి, ధర్మపరుడు విదురుడు. కౌరవులు నడుస్తున్నది అధర్మ మార్గమని ఆయనకు ముందే తెలుసు. ఒకానొక సందర్భంలో సభలోనే దుర్యోధనుడు విదురుడిని తీవ్రంగా అవమానించాడు. దాంతో విదురుడు తన వింటిని విరగ్గొట్టి.. అటు రాజసభకు, ఇటు యుద్ధానికి దూరంగా ఉంటానని ప్రకటించాడు. కేవలం ఒక ప్రేక్షకునిలా మాత్రమే ఉంటూ.. ఏ పక్షానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయాడు.
ఒకవేళ ఈ నలుగురు వీరులలో ఎవరైనా ఒక్కరు కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేసి ఉంటే.. కురుక్షేత్ర యుద్ధ ఫలితం, ఈనాటి చరిత్ర గతి మరోలా ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు.

