NTV Telugu Site icon

Yatra2 Movie Review: యాత్ర2 మూవీ రివ్యూ..

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాత్ర సినిమా 2019లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే సినిమాకి కొనసాగింపుగా యాత్ర 2 అనే సినిమా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. త్రీ ఆటం లీవ్స్, యూవీ సెల్యులాయిడ్స్ బ్యానర్ల మీద శివ మేక, సశి దేవిరెడ్డి, మహి వి రాఘవ్ నిర్మించారు. వైఎస్ జగన్ పాత్రలో జీవా, భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించారు. ఇక ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
యాత్ర 2 సినిమా రెండో సారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలవుతుంది. గెలిచిన కొన్ని రోజులకే ఆయన అమరుడవ్వడంతో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయాల్సి వస్తుంది. అయితే ప్రోగ్రెస్ పార్టీ(కాంగ్రెస్ పార్టీకి పేరు మార్పు) వద్దు అనడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత ఆయన ప్రజలకు సేవ చేయడం కోసం అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి పనులు చేశాడు? ఆయనను అధికారంలోకి రానివ్వకుండా ఎవరెవరు చేతులు కలిపారు? 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ ఎలా జగన్ ఓటమికి కారణమైంది? 2019 ఎన్నికల్లో ఎలా జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు అలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా గతంలో తెరకెక్కి రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించింది. అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎందుకు మొదలుపెట్టారు? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కలుసుకోవాలని అనుకున్నారు? వంటి విశేషాలతో ఆ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అనగానే సాధారణంగా ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ముందుగానే ఈ యాత్ర 2 సినిమా ఏమిటి? ఎలా ఉండబోతోంది? అనే విషయం మీద కూడా దర్శకుడు ముందు నుంచి క్లారిటీ ఇస్తూ వచ్చాడు. తెరమీద కూడా దాదాపుగా అదే ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ కు దూరం అయ్యాడు? తండ్రి చనిపోయిన తర్వాత అది చూసి షాక్ తిని చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లబోయి ఎలా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు? లాంటి విషయాలను చూపించారు. చెప్పిందే చేయాలి, ఒకవేళ మాట ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో తప్ప కూడదు అని తన తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి జగన్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదిరించారు? ఆ తర్వాత పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసేయ్? వైఎస్ జగన్ ను ఎలా కట్టడి చేసేందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలు ఏకమయ్యాయి లాంటి విషయాలను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అప్పటి మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాలేదు కానీ ఈ సినిమాతో కొంత ఆ అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. అంతేకాక చిన్ననాటి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒక హీరో భావిస్తూ వచ్చిన జగన్ ఆయన కోసం చనిపోయిన వారి కుటుంబాలను కలవాలనుకోవడం, ఆ కలయికను కొందరు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వేరే విధంగా తీసుకువెళ్లడం లాంటి విషయాలను లాజికల్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. మొత్తంగా చూసుకుంటే యాత్ర 2 సినిమా వైయస్ మరణంతో మొదలై వైయస్ జగన్ ఓదార్పు యాత్ర, తర్వాత ఉప ఎన్నికల్లో గెలుపు , ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమి వంటి విశేషాలు ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేసిన పాదయాత్రను బేస్ చేసుకుని ఈ సినిమా చేసినట్లు అనిపించినా ఎందుకో ఆ యాత్ర చేయడానికి గల కారణాలను కానీ చేసిన తర్వాత ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధాన్ని కానీ పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసినట్లు అనిపించ లేదు. చివరిలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ ఉండగా సినిమాను ముగించారు. సినిమా చివరిలో డాక్యుమెంటరీలాగా నిజంగానే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార దృశ్యాలు చూపించడం హైలైట్. అయితే నాణేనికి రెండు వైపులా ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం వైఎస్ జగన్ పాజిటివ్స్ మాత్రమే చూపిస్తూ సినిమాను ఆయన అభిమానుల కోసమే చేసినట్లు అనిపించింది. అయితే కొన్ని సీన్స్ మాత్రమే ఎమోషనల్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జగన్, వైఎస్ అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యే విధంగా ఆ సీన్స్ డైరెక్ట్ చేశారు మహి. ఒకరిని గొప్పగా చూపించాలంటే మరొకరిని కించపరచవలసిన అవసరం లేదు, అనే పాయింట్ బేస్ చేసుకుని సినిమా చేసినట్లు అనిపించింది.

ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మరొకసారి మమ్ముట్టి మెరిశారు.. స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే అయినా సరే ఉన్నంతలో తనదైన శైలిలో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర లో ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరు ఏమో అనేంతలా ఆయన ఒదిగిపోయారు. ఇక వైయస్ జగన్ పాత్రలో నటించిన జీవ కూడా చాలా హోంవర్క్ చేశాడు అనిపించింది. పోలికలు ఎక్కువగా లేకపోయినా మేనరిజం విషయంలో మాత్రం జగన్ లానే అనిపించాడు. నటన కూడా ఆకట్టుకునేలా ఉంది.. వైయస్ భారతి పాత్రలో నటించిన కేతకికి లభించింది చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ అయినా సరే హారతిని అచ్చుగుద్దినట్లు కనిపించే ఆమె ఉన్నంతలో బాగానే నటించింది. వైయస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి తనలైన శైలిలో నటించింది.. సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు..

నటీనటుల విషయానికి వస్తే టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. సంతోష్ నారయణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలు ఉత్తేజ పరిచేవిధంగా ఉండటం మాత్రమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు సిినిమాను ఎలివేట్ చేసింది. సినిమాటో గ్రఫి కూడా సినిమాకు ప్లస్ అయ్యే విధంగా ఉంది. కొన్ని షార్ట్స్ లో జీవాను జగన్ లా చూపించినట్లు చేయడంలో సినిమాటోగ్రాఫర్ సఫలం అయ్యారు. క్యాస్టుమ్ విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డీటెయిలింగ్ మిస్ కాకుండా క్యాస్టుమ్ డిజైనర్ చూసుకున్నారు. డైలాగ్స్ వైఎస్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉండటం మాత్రమే కాదు.. కొన్ని మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. పాత్రల క్యాస్టింగ్ కూడా బాగా సెట్ అయింది. ఓవరాల్ గా చిన్న చిన్న మిస్టేక్స్ సరిదిద్దుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే యాత్ర 2 వైఎస్ అభిమానులకు ఫీస్ట్. సాధారణ ప్రేక్షకులకు ఎమోషన్స్ తో కూడిన పొలిటికల్ ఎంటర్టైనర్.