NTV Telugu Site icon

Wanted Pandugad Movie Review : వాంటెడ్ పండుగాడ్ రివ్యూ

Wanted Pandugadu Review

Wanted Pandugadu Review

‘వాంటెడ్ పండుగాడ్’ టైటిల్ లోనే వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు. పోస్టర్స్ నిండా ప్రముఖ హాస్యనటులు దర్శనమిస్తున్నారు. పైగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్రానికి సమర్పకులు. దాంతో జనాల్లో ‘పండుగాడ్’ కాసింత ఆసక్తినే కలిగించాడు.

కథ విషయానికి వస్తే – జైలులో నుండి నేరస్థుడైన పండుగాడు తప్పించుకుంటాడు. అతడిని పట్టుకున్నవారికి కోటి రూపాయల నగదు బహుమానం అని ప్రకటిస్తారు. అడవుల్లోకి పారిపోయిన పండుగాడిని పట్టుకోవడానికి పలువురు బయలు దేరతారు. అందులో ఎన్నాళ్ళుగానో సినిమా తీయాలని తపించే ఓ దర్శకుడు, ప్రేయసి గుండె జబ్బు నయం చేయించుకోవాలని ఆశించే ప్రియుడు, డాన్ కావాలని కలలు కనేవాడు ఉంటారు. వారితో పాటు మరికొందరు కూడా అడవిలో దాగున్న పండుగాడిని పట్టుకొని కోటీశ్వరులు కావాలని కలలు కంటూ వెడతారు. వారి వెతలు తెలిసిన పండుగాడు తానే వారికి దొరుకుతాడు. దాంతో ‘పండుగాడు’ కాస్త ‘పండుగాడ్’ అవుతాడు. చివరకు అందరూ కలసి పండుగాడి వల్ల వచ్చిన మొత్తాన్ని పంచుకోవడంతో కథ ముగుస్తుంది.

కథ వింటేనే పాత చింతకాయ పచ్చడి అని ఇట్టే తేలిపోతుంది. అందులో చొప్పించిన హాస్యమంతా మనం బుల్లితెరపై చూస్తోన్న కామెడీ ప్రోగ్రామ్స్ లోని స్కిట్స్ లాగే ఉంటుంది. అంతకు మించి ఇందులో చెప్పుకోదగ్గది ఏమీ కనిపించదు. బుల్లితెరపై గిలిగింతలు పెట్టే కామెడీనే బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశించేవారికి ‘వాంటెడ్ పండుగాడ్’ పరవాలేదనిపిస్తుంది. లేదంటే సీట్లనే ‘పరుపు’ చేసుకోవాలనీ అనిపిస్తుంది. ఎక్కడా కొత్తదనం లేని ‘వాంటెడ్ పండుగాడ్’తో రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడయ్యారు. చిక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయాడనే చెప్పాలి. మహిరెడ్డి కెమెరా పనితనమే కాసింత ఊరట నిస్తుంది. చాలా రోజులకు తెరపై కనిపించిన బ్రహ్మానందం పాత్ర కూడా జనాన్ని ఆకట్టుకొనేలా తీర్చిదిద్దలేక పోయారు. ఈ సినిమాకు ‘పట్టుకుంటే కోటి’ అనే ట్యాగ్ ఉంది. చాలామంది చూసిన వారు ‘తట్టుకుంటే కోటి’ అనీ అంటున్నారు.

పస్ల్ పాయింట్స్:
– పలువురు హాస్యనటులు నటించడం
– రాఘవేంద్రరావు చిత్ర సమర్పకుడు కావడం

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం కనిపించక పోవడం
– కామెడీ స్కిట్స్ కూడా పాతగా అనిపించడం

రేటింగ్: 2/ 5

ట్యాగ్ లైన్: ‘పండు’ చితికింది!