NTV Telugu Site icon

Gangs Of Godavari Review: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ

Gg

Gg

చేస్తున్న అన్ని సినిమాలు, పాత్రలు భిన్నంగా ఉండేలా చూసుకుంటున్న ఈతరం నటుల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. చివరిగా గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. గతంలో చల్ మోహన్ రంగా, రౌడీ ఫెలో వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో కొన్ని సినిమాలకు లిరిసిష్టుగా వ్యవహరించిన ఆయన త్రివిక్రమ్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వక్సేన్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టు సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ కూడా ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సితార నాగవంశీ నిర్మాణం కావడంతో సినిమా మీద మరిన్ని అంచనాలకు వచ్చేశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ :
రాజమండ్రి – కొవ్వూరు మధ్యలో ఉన్న గోదావరిలో ఒక లంకలో పుట్టిన రత్న(విశ్వక్సేన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు.. ఏమి చేసినా సరే ఎదగాలనే మనస్తత్వం కలిగిన అతను అనుకోకుండా హిందుస్థాన్ లివర్ కంపెనీ డీలర్ అవుతాడు. ఆ తర్వాత ఇసుక రాంపుల ఆదాయం చూసి ఆ రాంపులు నడుపుతున్న ఎమ్మెల్యే దొరస్వామి ( గోపరాజు రమణ) క్యాంప్ లో చేరతాడు. ఎలా అయినా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో అతని అపోనేంట్ నానాజీ (నాజర్ ) తో చేతులు కలిపి దొరస్వామికి హ్యాండ్ ఇచ్చి ఏకంగా ఎమ్మెల్యే అయిపోతాడు. అంతేకాదు నానాజీ కుమార్తె బుజ్జి(నేహా శెట్టి)తో ప్రేమలో పడడంతో నానాజీకి కూడా పగవుతాడు. ఈ క్రమంలో ఒకపక్క దొరస్వామి మరొకపక్క నానాజీ రత్నను ఎలా అయినా దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే అప్పటివరకు రత్న వెంటే ఉన్న అతని స్నేహితులు అతనిని చంపేందుకు కత్తి కడతారు. అసలు ఈ కత్తి కట్టడం అంటే ఏమిటి? కత్తి కట్టాక రత్నను వాళ్ళు చంపారా? రత్నకు బుజ్జి ఎందుకు దూరమైంది? రత్నకు రత్నమాల(అంజలి)కి సంబంధమేమిటి? రత్న తండ్రి గద్ద రాజు(సాయికుమార్) ఎందుకు చనిపోయాడు? చివరికి రత్న ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ విషయంలో సితార సంస్థతో పాటు విశ్వక్ కూడా చాలా కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాని తెలుగు స్క్రీన్ మీద ముందు ఎన్నడూ చూడలేదు అన్నట్లుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం నిజం కాదేమోనని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమా ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఒక స్లం స్థాయి వ్యక్తి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లడడం అనే లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే చిన్నచిన్న దొంగతనాలు చేసుకునే ఒక వ్యక్తి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి గోదావరి లంకల నేపథ్యాన్ని కలుపుతూ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా తెరకెక్కించారు. సినిమా ఓపెన్ అయినప్పుడే విశ్వక్సేన్ క్యారెక్టర్ ఏమిటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా అతను ఎదుగుతున్న క్రమాన్ని కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే అతను ఎదుగుతున్న క్రమం ఎందుకో కన్విన్సింగ్ అనిపించేలా లేదు. నిజానికి రత్న అలాగే అతని గ్యాంగ్ అంతా లంకకు చెందినవారే అయినా పొట్టకూటి కోసం టౌన్ కి వచ్చినట్లు ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కూడా ఎందుకో క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. చాలా మందికి కథ లంకలలో జరుగుతుందా లేక టౌన్ లో జరుగుతున్నదా అనేది కూడా ఒక పట్టాన అర్థం కాదు. అయితే లంకల రత్నాకర్ అనే క్యారెక్టర్ ని మాత్రం ఎస్టాబ్లిష్ చేసేందుకు చాలా సమయాన్ని తీసుకున్నాడు డైరెక్టర్. తన ఎదుగుదల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యే క్యారెక్టర్ లో విశ్వక్ చాలా ఈజీగా పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపించింది. నిజానికి ఇలాంటి క్యారెక్టర్ లను నేనే రాజు నేనే మంత్రి, రణరంగం, పుష్ప లాంటి సినిమాలలో మనం గతంలోనే చూసాం. కానీ ఈ సినిమా విషయంలో నేపథ్యాన్ని గోదావరికి మార్చారు. గోదావరి అంటే పచ్చటి పంట పొలాలు సెలసెల పారే గోదావరి మాత్రమే కాదు సల సలా రగులుతున్న పగలకు కూడా అడ్డానే అనే మెయిన్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. కత్తి కట్టారు అనే విషయాన్ని మనం ఒక వాడుక పదంలా మార్చేశాం, కానీ అసలు ఆ కత్తి కట్టడం ఏమిటి? ఎందుకు? ఎవరు కత్తి కడతారు? ఎలా కత్తి కడతారు? లాంటి విషయాలను కాస్త కన్వెన్సింగ్ గా చూపించారు. ఫస్ట్ ఆఫ్ లోనే లంకల రత్నాకర్ ఎదుగుదల, ప్రేమ, పెళ్లి లాంటి విషయాలను చూపిస్తూ అతని క్యారెక్టర్ తో ప్రేక్షకులలో ఎన్నో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఆ అనుమానాలు అన్నింటికి సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ వెళ్లారు. అలాగే సినిమా పీరియాడిక్ అని కొన్నిచోట్ల అనిపిస్తే మరికొన్ని చోట్ల ఆ పీరియాడిక్ మూడ్ని క్యారీ చేసే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోలేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్ చివరిలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా అనిపిస్తుంది. రెండో భాగానికి అవకాశం ఉండేలాగానే సినిమాని ముగించాడు దర్శకుడు.

నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ రత్నాకర్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నటన విషయంలో గత సినిమాలతో పోలిస్తే విశ్వక్ చెల రేగి పోయి నటించాడు అని చెప్పక తప్పదు. అయితే తన అభిమాన హీరో మీద ప్రేమనో ఏమో తెలియదు కానీ కొన్నిచోట్ల మాత్రం విశ్వక్ నటన ఎన్టీఆర్ నటనను గుర్తుచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు భిన్నమైన పాత్రలలో కనిపించిన విశ్వక్ , మొత్తం మీద వన్ మ్యాన్ షో నడిపించాడనే చెప్పాలి. నేహా శెట్టికి చాలా మంచి పాత్రే పడింది కానీ నిడివి చాలా తక్కువ. నేహాతో పోలిస్తే అంజలికి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక హీరో హీరోయిన్ల తర్వాత నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర గోపరాజు రమణదే. నాటక బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన దొరస్వామి రాజు అనే పాత్రలో జీవించాడు. నాజర్ పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.యాదు అనే క్యారెక్టర్ లో గగన్ విహారి ఒక రేంజ్ లో యాక్ట్ చేశాడు. తనదైన శైలిలో విలనిజం పండించాడు. ఇక ప్రవీణ్, హైపర్ ఆది, పమ్మి సాయి వంటి నటులు ఉన్నారు అని బలవంతపు కామెడీ చేయించకుండా ఉన్నంతలో సిచువేషనల్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఒకటి రెండు సీన్స్ లో ఇబ్బంది పెట్టినా చాలా వరకు సినిమాకి ప్లస్ అయ్యేలా ఇచ్చాడు. దర్శకుడు చైతన్య కృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలావరకు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. అలాగే స్పెషల్ సాంగ్ ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిడివి విషయంలో కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. గోదావరి అనగానే గ్రీనరీకి అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకు సినిమాటోగ్రఫీ విషయంలో కాస్త కొత్త ప్రయోగం కళ్ళ ముందుకు వచ్చినట్లు అనిపించింది. గ్రే షేడ్స్ తో సినిమాటోగ్రఫీ ని నడిపించారు. ఇక పీరియాడిక్ సినిమా కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా వరకు కనిపించింది. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం ఎందుకు నెగ్లెక్ట్ చేశారనిపించింది.

ఫైనల్లీ : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ డ్రామా