విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. చాందిని చౌదరి, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని మొదలు పెట్టారు. 40 శాతం షూటింగ్ అయ్యాక సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ టేకప్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చింది. ఇక టీజర్, ట్రెయిలర్ తో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.
గామి కథ –
హరిద్వార్ లోని ఒక ఆశ్రమంలో అఘోరగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు శంకర్ (విశ్వక్ సేన్). అతనికి ఒక వింత జబ్బు ఉంటుంది. దాని వలన వేరే మనిషి అతనిని ముట్టుకుంటే అతని శరీరం అంతా రంగు మారిపోయి చనిపోతాడేమో అనేంతలా ఇబ్బంది పడతాడు. అతనిది జబ్బు కాదు శాపం అని చెబుతూ ఇతర అఘోరాలు ఆశ్రమ పెద్దకు ఫిర్యాదు చేస్తారు. అతన్ని ఇక్కడ ఉంచుకోవడం వల్లే మన ఆశ్రమానికి శుభం కలగడం లేదని చెప్పడంతో అతన్ని ఆశ్రమం నుంచి వెలివేస్తారు. అయితే ఈ సమస్యకు హిమాలయాలలో దొరికే మాలి పత్రాలు అనే ఒక రకమైన పుట్టగొడుగులతో పరిష్కారం దొరుకుతుందని అదే అవసరమానికి చెందిన సుధామ (జాన్ కొట్టోలీ) చెబుతాడు. ఈ క్రమంలో అతనికి జాహ్నవి(చాందినీ చౌదరి) ఆ పత్రాలను వెతికేందుకు సహాయపడుతుంది. అయితే వాటిని శంకర్ దక్కించుకున్నాడా? వాటి వల్ల తనకు ఏర్పడిన సమస్యను ఎలా క్లియర్ చేసుకున్నాడు? శంకర్ కి ఊహల్లో కనిపిస్తూ తమని కాపాడమని అడిగి ఉమ( హారిక), CT 333 ( మహ్మద్ సమద్), దేవదాసి దుర్గ(అభినయ) ఎవరు? వారికి శంకర్ కి అసలు సంబంధం ఏమిటి? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
గామి విశ్లేషణ
గామి అంటే గమ్యాన్ని గమించేవాడు అంటే ఒక రకంగా గమ్యాన్ని చేరుకునే వాడు అని అర్థం.. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలోనే సినిమా యూనిట్ వెల్లడించింది.. ముందు నుంచి గామి అంటే అదేదో కోడ్ భాష లాగా ఉందని అందరూ భావిస్తూ వచ్చారు కానీ ఈ క్లారిటీ వచ్చినప్పటి నుంచి సినిమా మీద అందరిలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్ కట్ అత్యద్భుతంగా ఉండడంతో సినిమా కూడా ప్రేక్షకులను అలరించే విధంగానే ఉంటుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను ఈ సినిమా అందుకునేలాగే తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు విద్యాధర్. నిజానికి ఈ సినిమా కోసం ఆయన 9 ఏళ్ళు సమయాన్ని వెచ్చించాడు అనగానే విన్న వాళ్లు చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. అయితే సినిమా చూసిన తర్వాత సినిమా కోసం తొమ్మిదేళ్లు కష్టపడడం ఏమాత్రం వృధా కాలేదు అని ఈజీగా అర్థమవుతుంది. ఒక ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఒక మాయలో పడేస్తూ సినిమా మొత్తాన్ని నడిపించాడు. నిజానికి సినిమా చూస్తున్నప్పుడు అన్తోలజీ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది కానీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ముగించాడు దర్శకుడు. మానవ స్పర్శ తగిలితే మరణం అంచుల దాకా వెళ్లే ఒక అఘోర, దేవదాసి తల్లి కూతురిగా మళ్లీ దేవదాసి వృత్తికి వెళ్ళకూడదు అని తల్లి చెప్పిన మాటలకు విలువ ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించే ఒక చిన్నారి, మానవ ప్రయోగాలు చేసే ఒక నిర్మానుష్యమైన చలి ప్రదేశంలో చిక్కుకున్న పేరు కూడా లేని సబ్జెక్టుగా సిటి త్రిబుల్ త్రిగా పిలవబడే ఒక యువకుడు … వీరి ముగ్గురి ప్రయాణాలను ప్రేక్షకుల ముందుకు తనదైన స్క్రీన్ ప్లే తో తీసుకొచ్చాడు దర్శకుడు. గతంలో కూడా మనం ఇదే రకమైన స్క్రీన్ ప్లే తో నడిచిన కొన్ని సినిమాలను చూశాము. కానీ ఈ సినిమా కథలో ఉన్న లొకేషన్స్ లో షూట్ చేయడం మాత్రం అనితర సాధ్యం. అది కూడా పాతిక లక్షల బడ్జెట్ తో ఇలాంటి స్పాన్ ఉన్న సినిమాని మొదలు పెట్టారంటే అది సినిమా మీద పిచ్చి అయినా అయి ఉండాలి, లేక ప్రేక్షకుల మీద నమ్మకమైనా అయి ఉండాలి. నిజానికి ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందా? అంటే అటు అవునని ఇటు కాదని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఒక ఆఫ్ బీట్ సినిమా, సినిమా అంటే మంచి ఫైట్స్ ఉండాలి నాలుగు మంచి పాటలు ఉండాలి, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ లేదా ప్రేమ ఉండాలి అని ఊహించుకుని సినిమాకి వెళితే మీకు ఏమాత్రం నచ్చదు. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఒక మంచి ప్రయత్నాన్ని చూసి రావాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం అబ్బుర పడేలా సినిమా ఉంటుంది. కథగా చెప్పుకుంటే ఇంతేనా అనిపించే సినిమాని తనదైన స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. దానికి టెక్నికల్ బ్రిలియన్స్ ఆడ్ అవ్వడంతో సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకి స్లో నేరేషన్ కాస్త మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆఫ్ బీట్ సినిమా కావడంతో కొంతమందికి అసలు సినిమా అర్థం కాకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ అర్థమైన వారు మాత్రం భలే ఉంది సినిమా అనుకునేలా దర్శకుడి ప్రతిభ, డీటెయిలింగ్ కనిపిస్తోంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్సేన్ ఇమిడిపోయాడు. కనీసం పక్క వ్యక్తితో మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తిగా కనిపిస్తూనే తన బాధను దిగమింగుకొని తన సమస్యకు పరిష్కారం వెతుక్కునే వ్యక్తిగా ఒకరకంగా సినిమాని తన భుజస్కందాల మీద నడిపించాడు. చాందిని చౌదరి హీరోయిన్ అనుకుంటారు కానీ ఆమెది చిన్న సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు.. కానీ ఉన్నంతలో ఆమె అదరగొట్టింది. అయితే అభినయకు మరోసారి మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. హారిక ఉమా అనే పాత్రలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. సమధ్ కూడా తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేశాడు. క్రూరమైన డాక్టర్ గా మయాంక్ పరాఖ్ భయపెట్టాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ విషయంలో అలాగే స్క్రీన్ ప్లే విషయంలో విద్యాధర్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్. వీఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలానే ఉంది, కాకపోతే కొన్ని చోట్ల మాత్రం అది వీఎఫ్ఎక్స్ అని అర్థం అయిపోయేలా ఉంటుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే బాగుండేది. స్లో నెరేషన్ అనే ఫీలింగ్ కలిగేలా సినిమా ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడిన సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ ఉన్నా పూర్తిస్థాయిలో గుర్తుపెట్టుకో తగ్గవి లేవు..అయితే కొన్ని సీక్వెన్స్ లు మరీ బ్లంట్ గా అనిపిస్తాయి. అలాగే రైటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేది. కొన్ని కొన్ని లోపాలు ఈజీగా అర్థం అయ్యేలా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు.
ఓవరాల్ గా ; గామి రెగ్యులర్ సినిమా కాదు. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే వారికి సినిమా ఒక ఫీస్ట్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లే రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.