NTV Telugu Site icon

Virata Parvam Movie Review: వెన్నెల అలియాస్ సరళ

Virata Parvam

Virata Parvam

మొన్నటి వరకూ ఓటీటీలో విడుదల అవుతుందని భావించిన ‘విరాట పర్వం’ సినిమా మొత్తానికీ థియేటర్లలోకి వచ్చింది. విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసి బయటకొచ్చిన పాండవుల మాదిరిగా ఈ చిత్ర బృందం పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘భీమ్లానాయక్’ మూవీలో డేనియల్ శేఖర్‌గా నటించి ఆకట్టుకున్న రానా ఇందులో నక్సలైట్ రవన్న అవతారం ఎత్తాడు. గత డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్’ మూవీలో దేవదాసిగా నటించిన సాయిపల్లవి నక్సలైట్ వెన్నెలగా ఇప్పుడు జనం ముందుకు వచ్చింది. దాదాపు నాలుగేళ్ళ క్రితం ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా చక్కని గుర్తింపు పొందిన వేణు ఊడుగుల తన ద్వితీయ చిత్రంతో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. అభిరుచి కల చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందుతున్న సుధాకర్ చెరుకూరి ‘విరాటపర్వం’ను నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందు సాయిపల్లవి ప్రమోషనల్ ఇంటర్వ్యూలోని ఓ భాగం వైరల్ కావడంతో అందరి దృష్టి ‘విరాటపర్వం’ పై పడింది.

ఒక్కమాటలో చెప్పాలంటే… ఇదో అడవి కాచిన ‘వెన్నెల’ కథ. యుక్తవయసులో విప్లవ సాహిత్యం పట్ల ఆకర్షితురాలై తన జీవితాన్ని అడవి బాట పట్టించిన అమ్మాయి కథ. ఇంటర్మీడియట్ రోజుల్లో అరణ్య పేరుతో కామ్రేడ్ రవన్న (రానా) రాసిన కవితలను చదివి ప్రభావితురాలవుతుంది వెన్నెల (సాయిపల్లవి). బాల్యం నుండి మొండి అమ్మాయిగా గుర్తింపు పొందిన ఆమె ఇంట్లో పెద్దలు చూసిన పెళ్ళి సంబంధాన్ని కాదని, రవన్నను వెతుక్కుంటూ అడవి దారి పడుతుంది. ఆ కంటకాకీర్ణమార్గంలో ఆమెకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఛేదించుకుని తన లక్ష్యం దిశగా సాగుతుంది. ఎట్టకేలకు కామ్రేడ్ రవన్నను కలుస్తుంది. ప్రేమ పట్ల సదభిప్రాయంలేని రవన్న ఆమెను తిరస్కరిస్తాడు. కనిపెంచిన తల్లిదండ్రులను కాదని, రవన్న మీద ప్రేమతో ఇల్లు వదిలి అడవికి వచ్చేసిన వెన్నెల జీవితం ఏ దిక్కులలో తెల్లారిందన్నదే ఈ చిత్ర కథ.

ఖమ్మం జిల్లాకు చెందిన తూము సరళ కథ ఇది. 1992లో ఇంటర్మీడియెట్ చదివే సమయంలో విప్లవ సాహిత్యం చదివి, దళంలో చేరి సాయుధ పోరాటం చేయాలని కలలు కన్నది సరళ. అయితే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఆమె దళంలో చేరినా, సరళను పోలీస్ ఇన్ఫార్మర్ గా అనుమానించి నక్సలైట్లు హింసించి, కాల్చి చంపేశారు. ఆమె శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించలేదు. అయితే ఆ తర్వాత తాము పొరపాటు చేశామని, ఆమె వామపక్ష పార్టీల సానుభూతి పరులైన కుటుంబానికి చెందిన వ్యక్తి అని గ్రహించి బహిరంగ క్షమాపణ కోరారు. సరళ జీవితంతో ప్రభావితుడైన వేణు ఊడుగుల ఆమె కథనే ‘విరాటపర్వం’ పేరుతో సినిమాగా తెరకెక్కించాడు. అయితే ఆ క్రమంలో కొంత మేర క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నాడు. 1973లో నక్సల్స్ కు, పోలీసులకు మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న సమయంలో హాస్పిటల్ కు వెళ్ళే దారిలో డాక్టరైన లేడీ నక్సలైట్ సాయంతో ఆడబిడ్డ జన్మించడం, ఆ నక్సలైటే ఆ బిడ్డకు వెన్నెల అనే పేరు పెట్టడం, అదే క్షణంలో పోలీస్ కాల్పుల్లో చనిపోవడం అనేవి సినిమాటిక్‌ లిబర్టీతో చిత్రీకరించినవే. ప్రధమార్థంలో ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఆసక్తిని కలిగించే సన్నివేశం మరేదీ లేదు. రవన్న పోలీసులను తప్పించుకుని పారిపోయే సన్నివేశాలు సైతం పెద్దంత ఉత్సుకతను కలిగించలేకపోయాయి. అయితే ఇంటర్వెల్ తర్వాత మాత్రం కథ చకచకా సాగింది. ప్రేమోన్మాదంతో అడవి బాట పట్టిన వెన్నెలకు అక్కడ ఎదురయ్యే చేదు అనుభవాలు, నక్సలైట్లను ఏరివేయడానికి పోలీసులు ఆడే ఆటలు, వారి ట్రాప్‌లో పడి, తమ వారినే అనుమానించి నక్సలైట్లు హతమార్చడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే… వెన్నెల విషయంలో రవన్న తీసుకున్న తీవ్రమైన నిర్ణయం ప్రేక్షకులు హర్షించలేనిదిగా ఉంది. అంతవరకూ ఆమె పట్ల ప్రేమను చూపించిన వ్యక్తి ఒక్కసారిగా పూర్తిగా మారిపోవడం కన్వెన్సింగ్ గా అనిపించదు. ఇంత జరిగినా… వెన్నెల విప్లవోద్యమం పట్ల సానుభూతితోనే ఉండటమనేది ఆమె అమాయకత్వమో, పిచ్చితనమో అర్థం కాదు. నక్సలైట్ల పట్ల ఉన్న సానుభూతితో వారు చేసిన అతి పెద్ద తప్పును చాలా చిన్న విషయంగా, మామూలు ఘటనగా దర్శకుడు తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. బట్ ప్రేక్షకులు మాత్రం ఆ తప్పును అంత తేలికగా తీసుకోరనే అనిపిస్తోంది. ఎందుకంటే… థియేటర్ నుండి బయటకు వచ్చే వారు ‘పాపం పిచ్చి వెన్నెల’ అనుకుంటూనే వస్తున్నారు.

నటీనటుల విషయానికి వస్తే… నక్సలైట్ దళనాయకుడు రవన్న పాత్రను రానా సమర్థవంతంగా పోషించాడు. అయితే ఈ సినిమా నిర్మాణం చాలా సంవత్సరాల పాటు సాగిందనేది తెలిసిపోతోంది. తల్లిని చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పటి సన్నివేశాల్లో రానా సెంటిమెంట్ ను అంతగా పండించలేకపోయాడు. ఇక ఈ చిత్రానికి వెన్నెముకగా సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర! ఆ పాత్రకు ఆమె సంపూర్ణ న్యాయం చేకూర్చింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ తన మనసులోని ఆవేదనను చక్కగా పలికించింది. ‘ఫిదా’లో తండ్రీ కూతుళ్లుగా నటించిన సాయి చంద్, సాయిపల్లవి మళ్ళీ ఈ చిత్రంలో అదే అనుబంధాన్ని కొనసాగించడం బాగుంది. ఆమె తల్లిగా ఈశ్వరీరావు నటించగా, రానాతో పాటు దళంలోని కీలక సభ్యులుగా నవీన్ చంద్ర, ప్రియమణి నటించారు. నిజానికి వారికి ఉన్న ఇమేజ్ కు ఇవి చిన్న పాత్రలనే చెప్పాలి. రవన్న తల్లిగా జరీనా వహాబ్, వెన్నెల బావగా రాహుల్ రామకృష్ణ, ప్రొఫెసర్ శకుంతలగా నందితాదాస్, విరసం కార్యదర్శిగా వీరశంకర్ నటించారు. నివేదా పేతురాజ్ ఈ సినిమా ప్రారంభంలో నక్సలైట్ నాయకురాలిగా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం విశేషం. మొన్న వచ్చిన ‘ఆచార్య’లో నక్సలైట్ నాయకుడిగా నటించిన సీనియర్ నటుడు బెనర్జీ ఇందులో పోలీస్‌ ఆఫీసర్ పాత్రను చేశారు. మొత్తం మీద నటీనటులందరినీ ఆయా పాత్రలకు తగ్గట్టుగానే ఎంపిక చేశారు. వారి నుండి చక్కని నటన రాబట్టుకున్నారు. సంభాషణలూ అర్థవంతంగా ఉన్నాయి. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సమకూర్చిన సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్‌గా నిలిచింది. పాటలన్నీ సందర్భానుసారం వచ్చేవి కావడంతో థియేటర్ బయటకు వచ్చాక హమ్ చేసుకొనే ఆస్కారం లేకపోయింది. సురేశ్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం చక్కగా ఉంది. ఓ కన్విక్షన్‌తో దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమా తీశాడనేది ప్రేక్షకులకు అర్థమౌతుంది. నిర్మాణ విలువలూ బాగున్నాయి. కానీ ఫేడ్ అవుట్ అయిపోయిన నక్సలిజాన్ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా కమర్షియల్‌గా ఏమేరకు సక్సెస్ అవుతుందనేది అనుమానమే.

ప్లస్ పాయింట్స్
వాస్తవమైన కథ కావడం
సాయిపల్లవి నటన
మేకింగ్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
బోర్ కొట్టే ప్రథమార్థం
పండని సెంటిమెంట్ సీన్స్
నక్సలిజ ప్రచార చిత్రం కావడం

రేటింగ్: 2.75 /5

ట్యాగ్ లైన్: వెన్నెల అలియాస్ సరళ

Show comments