NTV Telugu Site icon

Vikrant Rona Movie Rating : విక్రాంత్ రోణ రివ్యూ (డబ్బింగ్)

Vikrant Rona Movie Review

Vikrant Rona Movie Review

Vikrant Rona Movie Rating :

‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో మనవాళ్ళకు చేరువైన సుదీప్ నటించిన పలు కన్నడ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే ఆ సినిమాలేవీ ఇక్కడ పెద్దంత విజయాన్ని అందుకోలేదు. బట్… సుదీప్ లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’కు మాత్రం రిలీజ్ కు ముందే సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్ ఈ సినిమాను భారీ స్థాయిలో, త్రీడీలో నిర్మించడం దానికి మెయిన్ రీజన్. రకరకాల కారణాలతో అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘విక్రాంత్ రోణ’ ఎట్టకేలకు ఈ గురువారం దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. మరి విశేష ప్రచారంతో ప్రజల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…

కమరొట్టు అనేది కర్ణాటకలోని ఓ పల్లెటూరు. అడవి సరిహద్దుల్లో ఉండే ఆ గ్రామంలో జనార్ధన్ గంభీర (మధుసూదనరావు) కన్నుసన్నలలోనే అన్నీ జరుగుతుంటాయి. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ ఎస్.ఐ. ఊహించని విధంగా హత్యకు గురవుతాడు. సరిగ్గా అందుకు కొద్ది రోజుల ముందే జనార్దన్ తమ్ముడు విశ్వనాథ్ తన కూతురు పెళ్ళి ఆ ఊరిలోనే చేయాలని కుటుంబంతో ముంబై నుండి అక్కడికి వస్తాడు. అదే సమయంలో చిన్నప్పడే ఇంటి నుండి పారిపోయిన జనార్దన్ కొడుకు నందు కూడా ఊళ్ళోకి అడుగుపెడతాడు. తండ్రి అతన్ని ఇంట్లోకి అనుమతించక పోవడంతో బయటే ఉంటాడు. ఇదిలా ఉంటే ఎస్.ఐ. మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కోసం విక్రాంత్ రోణ (సుదీప్) ఆ గ్రామానికి వస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఎస్.ఐ.తో పాటు దాదాపు 16 మంది చిన్నపిల్లలు కూడా మిస్ అయిన విషయం తెలుస్తుంది. గ్రామంలోని అనుమానితుల్ని వరుస పెట్టి విచారిస్తూ, ఈ మిస్టరీని విక్రాంత్ రోణ ఎలా ఛేదించాడన్నదే ఈ సినిమా కథ.

కమరొట్టు అనే ఊహాజనిత గ్రామాన్ని దర్శకుడు అనూప్ భండారి తన తొలి చిత్రం ‘రంగి తరంగ’లో చూపించాడు. ఇప్పుడీ కథ కూడా అక్కడే జరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఇదో ‘ఊహాజనిత కథ’ అని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం వల్ల లాజిక్కుల జోలుకు పోలేం. టైటిల్స్ ముందు ఓ పాప మిస్ అయ్యే సీన్ ను చూడకపోతే… కథ కంగాళీగా అనిపిస్తుంది. దర్శకుడు చాలా పెద్ద కథను రాసుకుని, భారీ కాన్వాస్ లో దానిని తీసి, చివరకు సినిమా నిడివిని తగ్గించాలనే ప్రయత్నంలో చాలా సన్నివేశాలను ఎడిట్ చేసి తీసేసినట్టు అనిపిస్తోంది. ఏ సన్నివేశం కూడా సరిగ్గా మొదలై, సరిగ్గా ముగియదు. దాంతో చూసే ప్రేక్షకుడికి కథ ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతోందో అర్థం కాదు. హీరో ఎంట్రీ కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. దానికి తోడు ‘అతడు’లో ‘నేనే పార్థు’ అంటూ మహేశ్ బాబు ఓ ఇంటికి వెళ్ళినట్టుగా ఇందులోనూ ఓ క్యారెక్టర్ ‘నేనే సంజు’ అంటూ ఎంట్రీ ఇస్తుంది. అతను సంజు కాదనే విషయం, అలానే విక్రాంత్ రోణ కూతురు విషయంలో ఇల్యూజన్ లో ఉన్నాడనే విషయం ఆడియెన్స్ కు తెలిసిపోతూనే ఉంటాయి. దర్శకుడు అనూప్ తాను రాసుకున్న కథను స్ట్రయిట్ ఫార్వర్డ్ గా చెప్పకుండా రకరకాలుగా మెలికలు తిప్పి చెప్పాలనుకోవడంతో అది కాస్తా డైల్యూట్ అయిపోయి అర్థం లేని వ్యర్థ ప్రయత్నంగా మారిపోయింది. చివరకు చిన్నారుల మర్డర్ మిస్టరీకి ఛేదించే సన్నివేశాలు సైతం ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నత్త నడకలా సాగింది.

నటీనటుల విషయానికి వస్తే… సుదీప్ తన భుజానికెత్తుకుని కథను నడిపాడనే చెప్పాలి. అతని ప్రెజెన్స్ బాగుంది. కానీ భార్యతోనూ, కూతరుతోనూ ఉన్న అనుబంధాన్ని ఇంకాస్తంత ఎఫెక్టివ్ గా చూపించాల్సింది. సుదీప్, అలానే మరో కీలక పాత్ర పోషించిన మధుసూదన్ తప్పితే తెలుగువారికి సుపరిచితులు వేరెవరూ ఈ సినిమాలో లేరు. బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండేజ్ ‘సాహో’లో స్పెషల్ సాంగ్ చేయడం వల్ల కూడా ఆమెను మనవాళ్ళు కాస్తంత గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన నిరూప్, నీతా అశోక్, రవిశంకర్ గౌడ, వాసుకీ వైభవ్, చిత్కళా బిరదర్, రమేశ్ కుక్కువల్లీ వీరెవరూ సుపరిచితులు కాదు. జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఇందులో కీలక పాత్ర పోషించి ఉంటుందని భావించిన వారికీ నిరాశ తప్పదు. ఆమె కూడా ఓ ఐటమ్ సాంగ్ కే పరిమితమైపోయింది.

దర్శకుడిని నమ్మి నిర్మాత షాలినీ మంజునాథ్, జాక్ మంజునాథ్ భారీగానే ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ తెర మీద కనిపిస్తున్నాయి. అన్నపూర్ణ ఏడెకరాలులో వేసిన ఫారెస్ట్ సెట్ లోనే దాదాపు మూడొంతుల సినిమాను తీశారు. అయితే లైటింగ్, కలరింగ్ తో నేచురల్ గా వాటిని తెర మీద ప్రెజెంట్ చేశారు. విలియన్ డేవిడ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విఎఫ్.ఎక్స్ తో పాటు బి. అంజనీశ్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పోరాట సన్నివేశాలు కొన్ని థ్రిల్లింగ్ గా అనిపించాయి. బట్ ఎడిటింగ్ ఏమంత గొప్పగా లేదు. చాలా సన్నివేశాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. దర్శకుడు అనూప్ భండారి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయాడు.

‘కె.జి.ఎఫ్.’ తర్వాత కర్ణాటక నుండి వచ్చే ప్రతి పాన్ ఇండియా మూవీనీ దానితోనే పోల్చుకోవడం సహజం. ఆ మధ్య వచ్చిన ‘అతడే శ్రీమన్నారాయణ’ విషయంలోనూ అదే జరిగింది. ఆ సినిమా అన్ని భాషల్లోనూ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇక ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ వంతు! అయితే సుదీప్ కు ఉన్న స్టార్ డమ్ కారణంగా ఈ మూవీ కొంతలో కొత్త గట్టెక్కే ఛాన్స్ ఉంది. ఏదేమైనా… భారీ ఆశలు, అంచనాలతో థియేటర్ కు వెళితే మాత్రం నిరాశకు గురి కాకతప్పదు.

 

ప్లస్ పాయింట్స్
సుదీప్ నటన
త్రీడీ మూవీ కావడం
రీరికార్డింగ్, సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథ
స్లో నెరేషన్
పేలవమైన ముగింపు

ట్యాగ్ లైన్: రోణ కాదు… రోనా! Good

Show comments