NTV Telugu Site icon

Vikram Movie Review: విక్రమ్ (తమిళ డబ్బింగ్)

Vikram

Vikram

కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలై చాలా కాలం అయ్యింది. ‘విశ్వరూపం-2’ తర్వాత ఆయన చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాల నిర్మాణం మొదలైనా వివిధ దశల్లో ఆగిపోయాయి. ఆ ఇబ్బందులన్నింటినీ దాటుకుని ఈ శుక్రవారం జనం ముందుకు ‘విక్రమ్’ వచ్చింది. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాలతో తెలుగువారికీ చేరువైన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రేష్ట మూవీస్ బ్యానర్ తరఫున సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. 1986లో వచ్చిన ‘ఏజెంట్ విక్రమ్’ లోని కమల్ హాసన్ పాత్రను పొడిగిస్తూ వచ్చిన సినిమా ఇది.

చెన్నయ్ హర్బర్ లో రెండు లక్షల కోట్ల విలువ చేసే కొకైన్ కంటైనర్ ఒకటి పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్ (కాళిదాస్ జయరామ్) దృష్టిలో పడుతుంది. తన పై అధికారులకు ఆ విషయాన్ని చెప్పిన అతను తాను తండ్రిగా భావించే కన్నన్ (కమల్ హాసన్)కూ ఆ కంటైనర్ ఎక్కడ ఉందో చెబుతాడు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ ప్రభంజన్, కన్నన్, స్టీఫెన్ రాజ్ (హరీష్ పేరడి) హత్యకు గురవుతారు. ఈ వ్యవస్థ మీద కసితో వాళ్ళను తామే చంపేశామని ఓ వీడియోను హంతకుల ముఠా పోలీసులకు పంపుతుంది. ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరో తెలుసుకోవడం కోసం పోలీస్ అధికారులు అమర్ (ఫహద్ ఫాజిల్) అనే బ్లాక్ స్క్వాడ్ కమాండో బృందాన్ని నియమిస్తాడు. ఈ మొత్తం హత్యలన్నీ కొకైన్ కంటైనర్ మాయమైన నేపథ్యంలో జరిగాయని, అందులో ప్రధాన సూత్రధారి సంతానం (విజయ్ సేతుపతి) అని అమర్ గుర్తిస్తాడు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా కన్నన్ అనే వ్యక్తి చనిపోలేదని, దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం బ్లాక్ స్వ్కాడ్ లో పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వం నుండి తప్పించబడ్డ విక్రమ్.. కన్నన్ పేరుతో చలామణి అవుతున్నాడని, అతను తన కొడుకు హత్యకు ప్రతీకారంగా వీటన్నింటినీ చేస్తున్నాడని అమర్ పోలీస్ అధికారులకు తెలియచేస్తాడు. అసలు విక్రమ్ మెయిన్ మోటో ఏమిటీ? ప్రభంజన్ నిజంగానే అతని కొడుకేనా? డ్రగ్ మాఫియాకు మూలమైన సంతానంను చంపకుండా విక్రమ్ ఎందుకు తాత్సారం చేశాడు? అసలు కన్నన్ అనే పేరుతో అతను జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది మిగతా కథ.

ఇది చూడటానికి రివేంజ్ డ్రామాగా అనిపిస్తుంది. తన కొడుకును హత్య చేసిన పోలీసులు, డ్రగ్స్ మాఫియాపై విక్రమ్ ఎలా పగ తీర్చుకున్నాడన్నదే కథ. అయితే తాను కేవలం కొడుకు చావుకు రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం లేదని, డ్రగ్స్ ఫ్రీ సొసైటీని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని, తన మనవడు డ్రగ్స్ లేని ఓ సొసైటీలో పెరగాలని కోరుకుంటున్నానని విక్రమ్ చెబుతాడు. గతంలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసిన విక్రమ్ అసలు లక్ష్యం ఏమిటనేది అతని నోటితోనే దర్శకుడు చెప్పించాడు. నిజానికి ‘విక్రమ్’లో కథ కంటే కథనమే ప్రధానమైంది. కథగా చెప్పుకోవాలంటే చాలా సింపుల్. మాదక ద్రవ్యాలతో ఉన్న కంటైనర్ మాయమవడం, దానిని తిరిగి పొందడం కోసం కొందరు ప్రయత్నించడం, ఆ క్రమంలో ఆయా వర్గాలకు ఎదురయ్యే సమస్యలు.. ఇదే కథ. అయితే ప్రేక్షకులలో ఇమేజ్ ఉన్న పాత్రధారులను ఈ సినిమాలోని పాత్రల కోసం ఎంపిక చేయడంతో ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చింది. కన్నన్ ఉరఫ్ విక్రమ్ గా కమల్ హాసన్ నటిస్తే, సినిమాను తన భుజాల మీద పెట్టుకుని నడిపించే అమర్ పాత్రను ఫహద్ ఫాజిల్ పోషించాడు. ప్రధమార్థం చూస్తుంటే.. ఈ సినిమాకు ఫహదే హీరో అనిపిస్తుంది. ఇక సంతానం అనే డ్రగ్స్ మాఫియా నేతగా విజయ్ సేతుపతి చేశాడు. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి నటించిన సినిమాలేవీ ఆడలేదు. అయితే ఇందులో అతని నటన చాలా మెరుగ్గా ఉంది. అలానే ఫహద్ ఫాజిల్ తన పాత్ర కోసం ప్రాణాలు పెట్టేశాడు. కమల్ హాసన్ వీరిద్దరితో పోల్చితే వయసులో చాలా పెద్దవాడు. అయినా ప్రతి సన్నివేశాన్ని ఎంతో హుషారుగా చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ద్వితీయార్థంలో యాక్షన్స్ సీన్స్ అన్నీ కమల్ హాసన్ మీదే ఉంటాయి. ముఖ్యంగా క్లయిమాక్స్ సినిమాకు హైలైట్. ద్వితీయార్థంలో యాక్షన్ పార్ట్ మోతాదుకు మించి ఉండటంతో ప్రేక్షకులు కాస్తంత అసహనానికి గురౌతారు. ఆ సమయంలోనే అండర్ వరల్డ్ డాన్ అలెక్స్ గా సూర్య ఎంట్రీ ఇవ్వడంతో మూవీ గ్రాఫ్‌ మళ్ళీ పైకి లేచింది. చివరి ఐదు నిమిషాల్లో సూర్య తెర మీదకు వచ్చి.. దీనికి సీక్వెల్ ఖాయం అని తెలియచేశాడు.

గతంలో వచ్చిన కమల్ ‘ఏజెంట్ విక్రమ్’లోని పాత్రను ఇందులోనూ అర్థవంతంగా కంటిన్యూ చేయడం బాగుంది. అలానే ఫహద్ ఫాజిల్ కు కమల్ టీమ్ కు మధ్య ఓ తెలియని సెంటిమెంట్ ను యాడ్ చేయడం చక్కగా ఉంది. నటీనటులంతా మంచి నటన ప్రదర్శించారు. దర్శక నటుడు సంతాన భారతి సైతం ఇందులో ఓ కీలక పాత్రను పోషించాడు. అమర్ భార్యగా నటించిన గాయత్రి శంకర్ పాత్రకు తప్ప మిగిలిన లేడీ క్యారెక్టర్స్ కు అంత ప్రాధాన్యం లేదు. విజయ్ సేతుపతి కి సంబంధించిన చాలా సన్నివేశాలను అసంబద్ధంగా ఎడిటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. మూవీలో థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. యాక్షన్ పార్ట్స్ చిత్రీకరణ బాగుంది. తన గత చిత్రాల మాదిరిగానే నైట్ ఎఫెక్ట్స్ లోనే సినిమాను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అనిరుధ్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ను ఎలివేట్ చేసినా.. చాలా చోట్ల మోతాదు మించింది. పజిల్ గా అనిపించే ఫస్ట్ హాఫ్ కు సెకండ్ హాఫ్ లో సమాధానాలు లభిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ ను యాక్షన్ కు పరిమితం చేయకుండా ఇంకాస్తంత బెటర్ గా తీసి ఉంటే.. మూవీ మరో రేంజ్ లో ఉండేది. అయినా కమల్ అభిమానులతో పాటు విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూస్తారు కాబట్టి.. తమిళనాట సక్సెస్ కు ఢోకా ఉండదు. యాక్షన్ ప్రియులకు మాత్రం ‘విక్రమ్’ నచ్చుతుంది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
కమల్ – లోకేష్ కాంబో కావడం
అగ్రతారలు నటించడం
ప్రొడక్షన్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనం
హెవీ యాక్షన్ సీన్స్
బోర్ కొట్టే ప్రథమార్ధం

ట్యాగ్ లైన్: యాక్షన్ హోరు!

Show comments