NTV Telugu Site icon

Maharaja Review: విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రివ్యూ.. హిట్టా ? ఫట్టా?

Mr

Mr

మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పిజ్జా సినిమాతో హీరోగా మారిన ఆయన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాంటి ఆయన కెరియర్లో 50వ సినిమాగా మహారాజా అనే సినిమా వస్తుందనే విషయం కొద్దిరోజుల ముందు వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయో ఒక్కసారిగా సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్లో లక్ష్మీ పోయింది అంటూ విజయ్ సేతుపతి పోలీసులకు చెబుతున్న పాయింట్ కాస్త ఎంగేజింగ్ గా ఉండటంతో అసలు ఎవరీ లక్ష్మి? అని అందరూ సినిమా మీద ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చింది? అనే విషయాన్ని మాత్రం మనం రివ్యూలో చూసి తెలుసుకోవాల్సిందే.

మహారాజా కథ:
మహారాజా (విజయ్ సేతుపతి) ఒక బార్బర్. భార్య చనిపోగా కుమార్తె జ్యోతి మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉంటాడు. కుమార్తె ఒక స్పోర్ట్స్ క్యాంపుకి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఉన్న లక్ష్మీ పోయింది అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. అతను చెప్పింది అంతా విన్న తర్వాత పోలీసులు షాక్ అవుతారు. ముందు తరిమికొట్టాలని చూసినా తన లక్ష్మిని వెతికి తీసుకొస్తే ఏడు లక్షల వరకు క్యాష్ ఇస్తానని పోలీసులకు చెప్పడంతో ఆలోచనలో పడతారు. ఎలా అయినా అతని లక్ష్మిని వెతికి తీసుకు రావాలని లేకుంటే అలాంటిదే మరొకటి తయారు చేసి అతనికి అంటగట్టాలని ఫిక్స్ అవుతారు. అయితే అసలు ఆ లక్ష్మీ ఏమిటి? లక్ష్మీ కోసం ఏడు లక్షల రూపాయలు అయినా ఎందుకు ఖర్చు పెట్టడానికి మహారాజా సిద్ధమయ్యాడు? ఒక ఎలక్ట్రికల్ షాపు నడుపుకునే సెల్వంకి (అనురాగ్ కశ్యప్), మహారాజాకి ఏమిటి సంబంధం? అసలు ఈ లక్ష్మీ ఏమిటి? మహారాజా దాని కోసం ఎందుకంత పట్టు పట్టాడు? చివరికి లక్ష్మి దొరికిందా? డబ్బు కోసం రంగంలోకి దిగిన పోలీసులు ఏం చేశారు? చివరికి అసలు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కనబరచడానికి ఏకైక కారణం అసలు లక్ష్మీ ఏమిటి? అనేది. అయితే సినిమా ఓపెనింగ్ లోనే ఈ లక్ష్మీ ఏమిటి అనేదాన్ని రివీల్ చేసేస్తారు. అరెరే ఇంత ఈజీగా రివీల్ చేశారేమిటి? ఇంకా కథ ఏం ఉంది? అని పెదవి విరిచిన వారందరికీ షాక్ కలిగించేలా ఫస్టాఫ్ నడిపించాడు దర్శకుడు. లక్ష్మీ పోయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చి మహారాజా కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత పోలీసులందరూ పిచ్చివాళ్ళలా ఆ లక్ష్మిని ఎలా అయినా తీసుకురావాలని ప్రయత్నాలు చేయడం వంటి విషయాల్లో కామెడీ పుట్టించాడు దర్శకుడు. ఎవరు ఊహించని ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ కట్ చేసి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచేసాడు. అయితే సెకండ్ హాఫ్ కి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు అర్థమవుతున్నట్లే అనిపించినా తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే తో వచ్చిన సినిమాలలో ఒకటిగా ఈ మహారాజా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్క్రీన్ ప్లే తోనే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లిపోయాడు. అయితే సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్ అయ్యే అంశం. దానిని తనదైన నటనతో మరుగున పడేలా విజయ్ సేతుపతి, అనురాగ కశ్యప్ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. కొన్ని సీన్స్ లో విజయ్ సేతుపతి నటన అనితర సాధ్యమేమో అనేంతలా ఉంటుంది. నిజానికి యాక్షన్ సీక్వెన్స్ లు, వైలెన్స్ వంటి విషయం పక్కన పెడితే ఇది కచ్చితంగా ప్రస్తుత సమాజానికి తెలియాల్సిన, చెప్పాల్సిన కథ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కన్న కూతుళ్ళ మీద కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కథ చెప్పాలనుకోవడం సాహసమే అయినా చెప్పి ఆలోచింపచేసేలా దర్శకుడి ప్రయత్నం కనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి తన 50వ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇదే నా చివరి సినిమా, ఇక నటించే అవకాశం రాదేమో అనేంతలా చెలరేగి నటించాడు. అనురాగ్ కశ్యప్ కూడా తనదైన శైలిలో మైమరిపించేలా నటించాడు. అభిరామి సహా భారతి రాజా అలాగే ఇతర తమిళ నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఒక చిన్న పాత్రలో దివ్యభారతి మెరిసింది. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ స్క్రీన్ ప్లే ఎంచుకున్న దర్శకుడికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాగే సినిమా నిడివి కూడా సినిమాకి తగ్గట్టుగా పెట్టుకున్నారు. ఎక్కువ లాగ్ చేసిన ఫీలింగ్ కలగకుండా కట్ చేసుకున్న విధానం ఆకట్టుకుంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం వేరే లెవెల్. అయితే వైలెన్స్ ఇష్టం లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని వేరే లెవల్లో ఎలివేట్ చేసింది. ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క ఏడిపించేలా సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ షాట్ మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి.

ఫైనల్లీ మహారాజా ఒక ఎక్స్లెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకి వెళితే ఫుల్ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తారు.

Show comments